ట్రంప్ వర్సెస్ ఇరాన్- పరస్పరం బిగ్ వార్నింగ్స్- ఏం జరగబోతోంది?
ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని స్పష్టం చేసిన ట్రంప్- అమెరికా, ఇజ్రాయెల్ నాయకులు తమ రైడ్ లైన్ దాటారన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్

Published : March 1, 2026 at 11:29 AM IST
Trump Vs Iran : ఇజ్రాయెల్- అమెరికా, ఇరాన్ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాలపై పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అయినా దాడులు మాత్రం కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని ట్రంప్ స్పష్టంచేశారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చిరించింది.
ఇరాన్ ఈ రోజు చాలా గట్టిగా దాడి చేయబోతుందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా దాడికి సిద్ధమైనట్లు ఇరాన్ ఇప్పుడే ప్రకటించిందని తెలిపారు. అయితే వారు అలా చేయకపోవడమే మంచిదని అన్నారు. ఎందుకంటే వారు అలా చేస్తే ఇంతకు ముందెన్నడూ చూడని శక్తితో మనం వారిపై విరుచుకుపడతామని హెచ్చరించారు.
US President Donald Trump posts on Truth Social, " iran just stated that they are going to hit very hard today, harder than they have ever hit before. they better not do that, because of they do, we will hit them with a force that has never been seen before..." pic.twitter.com/DvKDuW49ft
— ANI (@ANI) March 1, 2026
ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ వార్నింగ్
మరోవైపు, ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్‌కు వార్నింగ్. అమెరికా, ఇజ్రాయెల్ నాయకులు తమ రైడ్ లైన్ దాటారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగర్ గాలిబాఫ్ తెలిపారు. అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంతలా అంటే ఇరాన్ దెబ్బకు మిమ్మల్ని మీరే అడుక్కోవాల్సి పరిస్థితి వస్తుందని అన్నారు. అంతేకాకుండా అమెరికా, ఇజ్రాయెల్ నేతలను మురికి నేరస్థులగా అభివర్ణించారు.
ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరిక
ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌పెజెష్కియాన్ స్పందించారు. నేరస్థులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఖమేనీ హత్యను మహా నేరంగా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ను దుష్టశక్తిగా పేర్కొన్నారు. ఖమేనీ రక్తం మహా ప్రవాహంగా మారి అమెరికా-ఇజ్రాయెల్‌ను అణచివేస్తుందని, నేరాలను నిర్మూలిస్తుందని వివరించారు. ఈ దాడి ఇస్లామిక్ ప్రపంచం, షియా చరిత్రలో కొత్త అధ్యాయం తెరుస్తుందని చెప్పారు. తమ ప్రతీకార దాడులతో ఆయా దేశాలు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతాయన్నారు.
ప్రతిదాడి ఖాయం: ఇరాన్ నేత అలీ లరిజానీ
ఖమేనీ మృతిపై ఇరాన్‌లో సుప్రీం లీడర్ తర్వాత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన అలీ లరిజానీ స్పందించారు. ఇరాన్ ప్రజల హృదయాలపై అమెరికా దాడులతో పొడించిందని అన్నారు. తాము కూడా కచ్చితంగా అమెరికన్ల హృదయాలపై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ సైనిక దళాల చేసే ప్రతిదాడి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తాము తన్ని పారిపోబోమని అమెరికన్లకు తెలుసని పేర్కొన్నారు. ఖమేనీ సలహా బృందంలోని సభ్యుల్లో అలీ లరిజానీ నిర్ణయాత్మక వ్యక్తి. లరిజానీ ది సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అమెరికా దాడుల నుంచి బయటపడిన ఇరాన్ అత్యున్నత నేతల్లో ఆయన కూడా ఒకరు.
ట్రంప్ పర్యవేక్షణ
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. అయితే ఈ ఆపరేషన్‌ను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యవేక్షించారు. అందుకు సంబంధించిన ఫొటోలను వైట్‌హౌస్ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఫ్లొరిడాలోని పామ్‌బీచ్‌లోని ట్రంప్ స్వగృహం మార్ ఎ లాగో రిసార్ట్‌లోని పర్యవేక్షించినట్లు ఉంది. ట్రంప్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్మీ కీలక జనరల్స్ సుసీ విల్లీస్, డాన్ కెయిన్ తదితరులు కూడా అక్కడే ఉన్నారు. సాధారణంగా హై వాల్యూ టార్గెట్స్‌పై జరిగే దాడులే అమెరికా అధ్యక్షుడి పర్యవేక్షణలో జరుగుతాయి. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడావార్ రూమ్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఫొటోను వైట్‌హౌస్ పోస్ట్ చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు సౌదీ, ఇజ్రాయెల్ సహా ఇతర గల్ఫ్ నేతలతో కూడా టచ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతోపాటే ఇజ్రాయెల్ కూడా 'ఆపరేషన్ రోర్ ఆఫ్ ది లయన్' చేపట్టింది.

