Telangana Panchayat Elections Results2025

ETV Bharat / international

F-35 అమ్మకానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్- సౌదీ రాజు పర్యటన వేళ కీలక నిర్ణయం

ఏడు సంవత్సరాల తర్వాత సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) వైట్‌హౌస్‌ పర్యటన

Trump
Trump (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : November 18, 2025 at 8:13 AM IST

2 Min Read
Choose ETV Bharat

US Saudi Arabia Jet Deal : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్‌ జెట్ల విక్రయాన్ని ఆమోదిస్తానని స్పష్టం చేశారు. ఏడు సంవత్సరాల తర్వాత సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) వైట్‌హౌస్‌ పర్యటనకు రావడం ఈ నిర్ణయం ప్రాధాన్యాన్ని చూపిస్తోంది.

సౌదీ వారసుడి రాకను పురస్కరించుకుని వైట్‌హౌస్‌ ఎదుట సౌదీ జెండాలు ఎగురవేశారు. మంగళవారం జరిగే ఈ పర్యటనలో ఆతిథ్య వేడుకలు, సైనిక గార్డ్‌, కేనన్‌ సల్యూట్‌, గుర్రాల అతిథి స్వాగతం వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి. తర్వాత ఓవల్‌ ఆఫీస్‌లో ద్వైపాక్షిక చర్చలు, రాత్రి బ్లాక్‌ టై డిన్నర్‌ ఏర్పాటు చేశారు.

F-35 జెట్‌ విక్రయం ఖాయం: ట్రంప్‌
రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ స్పష్టంగా స్పందింస్తూ, "అవును మేము F-35లను అమ్మబోతున్నాం. డీల్‌ జరుగుతుంది" అని తెలిపారు. ఈ అమ్మకంపై అమెరికా అధికారుల్లో కొంత ఆందోళన ఉంది. ముఖ్యంగా UAE డీల్‌ ఆగిపోవడానికి కారణమైన చైనా టెక్నాలజీ దొంగిలింపు ప్రమాదం ఇదే డీల్‌లో కూడా ఉందని అధికారులు సూచిస్తున్నారు. సౌదీ చైనా సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో అభ్యంతరాలు పెరిగాయి. ఇటీవలే రెండు దేశాలు ఉమ్మడి నౌకా విన్యాసాలు నిర్వహించాయి.

ఇజ్రాయెల్‌ మిలిటరీ అడ్వాంటేజ్ అంశం
అమెరికా ఎప్పటినుంచో ఇజ్రాయెల్‌కు పొరుగు దేశాలపై గుణాత్మక సైనిక ఆధిక్యం (Qualitative Military Edge) ఉండేలా చూస్తోంది. ఇదే కారణంగా సౌదీకి F-35 ఇచ్చే విషయంలో గతంలోనే అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న లేవనెత్తుతోంది. "సౌదీ నుంచి ఎలాంటి హామీలు తీసుకున్నారు? ఇజ్రాయెల్‌ ఆధిక్యం ఎలా కాపాడుతారు? కాంగ్రెస్‌ తప్పకుండా వైట్‌హౌస్‌ను అడుగుతుంది" అని FDD విశ్లేషకుడు బ్రాడ్లీ బౌమన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అబ్రహాం ఒప్పందాల దిశగా?
ట్రంప్‌ సౌదీ రాజు పర్యటనలో ముఖ్యంగా అబ్రహాం అకార్డ్స్‌ గురించి చర్చించాలని చూస్తున్నారు. సౌదీ – ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాల సాధారణీకరణ తన మిడిల్‌ఈస్ట్‌ శాంతి ప్రయత్నాల కీలక భాగమని ఆయన భావిస్తున్నారు. సౌదీ అరేబియా త్వరలో అబ్రహాం అకార్డ్స్‌లో చేరుతుందని ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. తాజాగా UN సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆమోదించిన గాజా పునర్‌నిర్మాణ ప్లాన్‌ కూడా చర్చల్లో ప్రధానాంశం కానుంది. పర్యటనలో సాంకేతిక, రక్షణ, హరిత శక్తి, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బయోటెక్నాలజీలో పెద్ద పెట్టుబడి ఒప్పందాలు కుదరనున్నాయని వైట్‌హౌస్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఎంబీఎస్‌ – వాషింగ్టన్‌ సంబంధాలు మళ్లీ గాడిలో
క్రౌన్ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చివరిసారి 2018లో వైట్‌హౌస్‌కు వచ్చినప్పుడు జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గీ హత్య వివాదం పెద్ద దెబ్బతీసింది. అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఆ హత్య ఆపరేషన్‌కు ఎంబీఎస్‌ బాధ్యత ఉండొచ్చని అప్పట్లో అంచనా వేశాయి. సౌదీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. ఏడు సంవత్సరాల తర్వాత అలాంటి భావనలు తొలగిపోయాయని ట్రంప్‌ భావిస్తున్నారు. మేలో రియాద్‌ పర్యటనలో ట్రంప్‌కు ఇచ్చిన ఘన స్వాగతం, ఫైటర్‌ జెట్ల ఎస్కార్ట్‌, బంగారు తల్వార్ల గౌరవ గార్డు, అరేబియన్‌ గుర్రాల పరేడ్‌, రెండు దేశాల మధ్య బలపడుతున్న బంధాన్ని సూచించింది.