ఈ రాత్రి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం- ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్
ఇరాన్ చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది- ఈ రాత్రి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం- డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Published : July 8, 2026 at 7:31 PM IST
|Updated : July 8, 2026 at 7:56 PM IST
Trump Threatens To Strike Iran : కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన కొద్ది గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని, హర్మూజ్ జలసంధి వద్ద నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందని అన్నారు. అందుకే ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని అన్నారు. 2026 నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం కావడానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో, యూఎస్ ప్రతిదాడులు ప్రారంభించింది. వరుసగా రెండో రోజు రాత్రి కూడా దాడులు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అవసరమైతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, డీశాలినేషన్ (సముద్రపు నీటిని శుద్ధి చేసే) ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం ఖర్గ్ ద్వీపంపై దాడులు చేసినప్పటికీ, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేయలేదని అన్నారు. అయితే ఇప్పుడు ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.
"ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితులు వస్తే వాటిని కచ్చితంగా నాశనం చేస్తాం. అలాగే ఇరాన్ ప్రజల దాహం తీర్చే డీశాలినేషన్ ప్లాంట్లపై కూడా దాడి చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసరమైతే వాటిపైనా ఎటాక్ చేస్తాం. నిన్న రాత్రి మేము ఖర్గ్ ద్వీపంపై దాడి చేసి, ఒక భాగాన్ని ధ్వంసం చేశాం. అయితే నేను చమురును మట్టుకోవద్దని మా సైన్యానికి చెప్పాను. ఎందుకంటే బహుశా మేము ఆ ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అందుకే నేను చమురు పైపులను ధ్వంసం చేయవద్దు, మిగతా వాటిని కొట్టండి అని చెప్పాను. మా సైన్యం అలానే చేసింది. ఈ రాత్రి కూడా మేము మళ్లీ దాడులు చేస్తాం. మేము ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం. దీనిపై వారు చేయగలిగింది ఏమీ లేదు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇరాన్ నాయకుల తీరుపై ట్రంప్ అసంతృప్తి
ఇరాన్ నాయకత్వం తీరుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి చర్యలు చాలా దూకుడుగా ఉన్నాయని అభివర్ణించారు. పశ్చిమాసియాలో వారు అందరినీ బెదిరిస్తున్నారని, కానీ ఇకపై అలా జరగదని అన్నారు. చర్చల సమయంలో ఇరాన్ నేతలు పదేపదే తమ నిర్ణయాలను మార్చుకుంటున్నారని ఆరోపించారు. వారిని పిచ్చివాళ్లు (cuckoo) అని సంబోధించారు. "వాళ్లు ప్రతిదానికీ అంగీకరిస్తారు. ఆపై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము దీని గురించి అస్సలు మాట్లాడలేదని చెబుతారు. వారు పిచ్చివాళ్లు. వారిలో ఏదో లోపం ఉంది" అని అన్నారు.
మళ్లీ మొదలైన దాడులు, ప్రతిదాడులు
మంగళవారం హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై టెహ్రాన్ దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా యూఎస్ దళాలు ఇరాన్‌పై దాడులు చేశాయి. 80కిపైగా ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ముఖ్యంగా ఇరాన్ వైమానికి రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌లు, తీరప్రాంత రాడార్ వ్యవస్థలు, యాంటీ-షిప్ మిస్సైల్ క్యాపబిలిటీస్, వ్యూహాత్మక జలమార్గంలో పనిచేస్తున్న 60కి పైగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)కి చిన్న పడవలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
ఈ దాడుల అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ అమెరికాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను అనేక సార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియా శాంతి స్థాపన కోసం కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని యూఎస్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అగ్రరాజ్యం తీవ్రమైన సైనిక, ఆర్థిక ఒత్తిళ్లు తెచ్చినా టెహ్రాన్ లొంగదని స్పష్టం చేశారు.
ఇరాన్ నేతలు చెడ్డవారు- టెహ్రాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్
'మిత్రదేశాల ఐక్యతకు ఇదో పరీక్ష'- ఇరాన్ యుద్ధంలో నాటో తీరుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి

