ETV Bharat / international

'హర్మూజ్​ను తెరవకపోతే మళ్లీ బాంబు దాడులు చేస్తాం'- ఇరాన్‌కు ట్రంప్ ఘాటు హెచ్చరిక​

ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో, అత్యంత భయంకరంగా ఉంటాయి- అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్‌ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుంది- మా దారిలోకి వస్తే హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుంది- ట్రంప్​

US President Donald Trump
US President Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2026 at 7:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

Trump Warn Iran : పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్‌ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయిని తెలిపారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో, అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌ పెట్టారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్‌ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హర్మూజ్‌లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్‌, ఇరాన్‌ తమ దారిలోకి వస్తే హర్మూజ్ జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందని అనుకోవడం పెద్ద ఊహే కావచ్చని ట్రంప్‌ వ్యాఖ్యనించారు.

హర్మూజ్​ను నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థ
మరోవైపు, హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. "సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్" పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఇ-మెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై జరిగిన దాడుల తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధం ఉన్న నౌకలను సురక్షితంగా వెళ్లనిచ్చేది లేదని ఇరాన్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిని మరింత చట్టబద్ధం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఒక ముసాయిదాను కూడా పరిశీలిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు, శత్రువులు కాని ఇతర దేశాల నౌకల ప్రయాణానికి 'టోల్ సిస్టమ్' తీసుకురావాలని భావిస్తోంది.

హర్మూజ్‌లో నౌకలకు అమెరికా బలగాలు స్వయంగా ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తాయని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" పేరిట ఎస్కార్ట్ ఇస్తాయని చెప్పారు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలోనే ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మిలిటరీ జాయింట్ కమాండ్ విభాగం ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఏవైనా విదేశీ సాయుధ బలగాలు, ముఖ్యంగా అమెరికా సైన్యం హర్మూజ్ సమీపంలోకి వస్తే కచ్చితంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.