ETV Bharat / international

ఆంథ్రోపిక్​కు ట్రంప్ షాక్- ఆ కంపెనీ ఏఐ వినియోగాన్ని ఆపాలంటూ ప్రభుత్వ శాఖలకు ఆదేశం

పెంటగాన్ డిమాండ్లకు అంగీకరించలేదని ఆంథ్రోపిక్‌తో డీల్ క్యాన్సిల్ చేసిన ట్రంప్

Trump Vs Anthropic
Trump Vs Anthropic (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : February 28, 2026 at 9:50 AM IST

4 Min Read
Choose ETV Bharat

Trump Vs Anthropic : ప్రఖ్యాత ఏఐ టెక్నాలజీ కంపెనీ ఆంథ్రోపిక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఆంథ్రోపిక్‌‌కు చెందిన ఏఐ సాంకేతికతను వినియోగించడాన్ని ఆపాలని అన్ని అమెరికా ప్రభుత్వ విభాగాలను ఆయన ఆదేశించారు. దీంతోపాటు ఆ కంపెనీపై పలు కీలక జరిమానాలనూ విధించారు. "మాకు ఆంథ్రోపిక్‌ అక్కర్లేదు. ఆ కంపెనీతో మాకు పని లేదు. మేం మళ్లీ వాళ్లతో కలిసి వ్యాపారం చేసేది లేదు" అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వెల్లడించారు. ఏకంగా అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్)పైనే బల ప్రయోగం చేసేందుకు ఆంథ్రోపిక్ యత్నించిందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు అమెరికా సైన్యానికి సంబంధించిన ఆన్‌లైన్ వేదికల్లో ఎంబెడ్ చేసిన ఆంథ్రోపిక్ ఏఐ టెక్నాలజీని తొలగించేందుకు పెంటగాన్‌కు 6 నెలల గడువు ఇచ్చానని ట్రంప్ తెలిపారు. వామపక్ష అతివాదం, జాతి వివక్షా భావం కలిగిన కంపెనీకి అమెరికా సైనిక వ్యూహాలు, యుద్ధ రహస్యాలు ఎలా ఉండాలనే దానిపై మాట్లాడే అవకాశాన్ని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఒక పోస్ట్‌ను పూర్తిగా ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్‌‌తో ట్రూత్ సోషల్‌‌లో ట్రంప్ పెట్టడం గమనార్హం.

సప్లై చైన్ రిస్క్ కేటగిరీలో ఆంథ్రోపిక్‌ను చేరుస్తాం: అమెరికా రక్షణమంత్రి
"మేం అమెరికా సైన్యం కోసం చట్టబద్ధంగానే ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ టూల్స్‌ను వాడుతాం. ఆ టూల్స్‌పై మాకు పూర్తిస్థాయి యాక్సెస్‌ను ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ ఆంథ్రోపిక్ ససేమిరా అంటోంది. ఏకంగా అమెరికా రక్షణశాఖకే ఆంథ్రోపిక్ కంపెనీ సహకరించడం లేదు. ఇలాంటప్పుడు సప్లై చైన్ రిస్క్ కేటగిరీలో దాన్ని చేర్చాల్సి ఉంటుంది’’ అని అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెథ్ తాజా హెచ్చరిక చేశారు.

అమెరికా రక్షణ శాఖను కోర్టులో సవాలు చేస్తాం : ఆంథ్రోపిక్
"మా కంపెనీపై సప్లై చైన్ రిస్క్ ఆరోపణలు చేసినందుకు అమెరికా రక్షణ శాఖను కోర్టులో సవాలు చేస్తాం. సప్లై చైన్ రిస్క్ కేటగిరీ అనేది అమెరికాతో విరోధం కలిగిన దేశాల కోసం రూపొందించినది. ఆ కేటగిరీలోకి ఒక అమెరికన్ కంపెనీని ఎలా చేరుస్తారు ? చట్టబద్ధంగా అలా చేయడం కుదరదు కదా ? అమెరికా ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకునే అమెరికా కంపెనీలు ఇలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుండటం ఆందోళనకరం. అమెరికన్లపై నిఘా కోసం, అటానమస్ ఆయుధాల వినియోగం కోసం మా ఏఐ ఛాట్‌బోట్ క్లాడ్ టెక్నాలజీని వినియోగించము అనే స్పష్టమైన హామీని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ఇవ్వడం లేదు. అందుకే వాళ్లకు మేం ఏఐ టూల్స్‌పై పూర్తి యాక్సెస్‌ను ఇవ్వడం లేదు" అని తాజాగా ఓ ప్రకటనలో ఆంథ్రోపిక్ వెల్లడించింది.

ఆంథ్రోపిక్‌ స్థానంలో ఓపెన్ ఏఐ‌ వినియోగం : ఆల్ట్‌మన్
ఆంథ్రోపిక్‌ ఏఐ వినియోగాన్ని ఆపేసిన వెంటనే, తమ ఏఐ టూల్స్‌ను వాడటాన్ని అమెరికా రక్షణ శాఖ మొదలుపెట్టిందని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ప్రకటించారు. దీనిపై శుక్రవారం రాత్రే అమెరికా రక్షణ శాఖ, ఓపెన్ ఏఐ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇక తమ ఏఐ మోడల్స్‌ను అమెరికా రక్షణ శాఖకు చెందిన క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లలో మోహరిస్తారని చెప్పారు. ఏఐ భద్రతకు కట్టుబడి ఉంటామని అమెరికా ప్రభుత్వం నుంచి తమకు హామీ లభించిందని ఆల్ట్‌మన్ వెల్లడించారు. అమెరికన్లపై నిఘా కోసం, మనుషులపై బలప్రయోగం కోసం, అటానమస్‌గా పనిచేసే ప్రాణాంతక ఆయుధాల కోసం ఏఐను వినియోగించకూడదు అనేవి ఏఐ భద్రత పరిధిలోకి వస్తాయన్నారు. వీటికి లోబడి పనిచేస్తామని అమెరికా రక్షణశాఖ తమకు హామీ ఇచ్చిందన్నారు. ఈవివరాలను ఒప్పందంలో కూడా చేరుస్తామని ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు.

ఆంథ్రోపిక్‌‌ను దూషించిన ఎలాన్ మస్క్‌- అందుకోసమేనా ?
మొత్తం మీద ఈ వ్యవహారం అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో కలకలం సృష్టించింది. ఆంథ్రోపిక్ కంపెనీ ప్రధాన పోటీదారులైన ఓపెన్ ఏఐ, గూగుల్ కూడా ఆంథ్రోపిక్ సీఈఓ డేరియో అమోడీకి మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఎలాన్ మస్క్ మాత్రం ఆంథ్రోపిక్‌ను దూషిస్తూ ట్వీట్ చేశారు. పశ్చిమ దేశాల నాగరికత అంటే ఆంథ్రోపిక్‌కు ద్వేషమని ఆయన వ్యాఖ్యానించారు. ఆంథ్రోపిక్ కంపెనీ అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులను కోల్పోతుండటం, ఎలాన్ మస్క్‌కు చెందిన ఛాట్‌బోట్ గ్రోక్‌కు కలిసొచ్చే ఛాన్స్ ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే గ్రోక్ ఏఐకు అమెరికా క్లాసిఫైడ్ మిలిటరీ నెట్‌వర్క్స్‌లోకి యాక్సెస్ ఇస్తారని తెలుస్తోంది. తమ ఏఐ టెక్నాలజీని, టూల్స్‌‌ను అమెరికా సైన్యానికి అందించే కాంట్రాక్టులను కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్న గూగుల్, ఓపెన్ ఏఐ కంపెనీలకు ఇదొక హెచ్చరికలా ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

ఆంథ్రోపిక్ VS అమెరికా రక్షణశాఖ : అసలేమైంది ?
ఆంథ్రోపిక్ కంపెనీ 2023 మార్చి 14 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు పలు క్లాడ్ ఏఐ మోడల్స్‌ను విడుదల చేసింది. 2024 జూన్ నుంచి వీటిని అమెరికా సైన్యం, రక్షణ శాఖ, సైబర్, శాటిలైట్ నిఘా విభాగాలు వినియోగిస్తున్నాయి. ఈక్రమంలో 2026 ఫిబ్రవరి 24న కీలక పరిణామం చోటుచేసుకుంది. క్లాడ్ ఏఐ మోడల్స్‌ను ఎలాంటి పరిమితులు లేకుండా వినియోగించేందుకు అమెరికా రక్షణశాఖకు అనుమతులు ఇవ్వాలంటూ ఆంథ్రోపిక్ కంపెనీకి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెథ్ అల్టిమేటం ఇచ్చారు. అయితే అలాంటి అనుమతులను ఇవ్వడం కుదరదని పేర్కొంటూ 2026 ఫిబ్రవరి 26న ఆంథ్రోపిక్ కంపెనీ సీఈఓ డేరియో అమోడీ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ప్రాణాంతకంగా నిలిచే పూర్తిస్థాయి అటానమస్ ఆయుధాల కోసం, అమెరికన్లపై నిఘా కోసం ఏఐ టెక్నాలజీని ఇచ్చేందుకు తమ మనస్సాక్షి అంగీకరించదు అని తేల్చి చెప్పారు. మనస్సాక్షి కాదని పనిచేయలేమని అమెరికా రక్షణశాఖకు స్పష్టంచేశారు. దీంతో ఫిబ్రవరి 27వ తేదీన సాయంత్రం 5 గంటలకల్లా అమెరికా సైన్యానికి క్లాడ్ ఏఐలో పూర్తి యాక్సెస్‌ను ఇచ్చేందుకు అంగీకారం తెలపాలని ఆంథ్రోపిక్‌కు రక్షణశాఖ నిర్దేశించింది. అయినా ఆంథ్రోపిక్‌ వెనకడుగు వేయలేదు. అమెరికా రక్షణ శాఖ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తమ కంపెనీతో రాజీని కుదుర్చుకునే క్రమంలో అమెరికా రక్షణ శాఖ వినియోగించిన భాషను, పరుష పదజాలాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అందుకే ఆంథ్రోపిక్ ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని ఆపాలంటూ అమెరికా ప్రభుత్వ శాఖలకు ట్రంప్ తాజా ఆదేశాలు జారీ చేశారు.