టూ లేట్- ఇరాన్‌కు ఇప్పుడు చర్చలు కావాలా?: డొనాల్డ్ ట్రంప్
నాయకత్వం, గగనతల రక్షణ వ్యవస్థ, వాయుసేన, నౌకాదళం అన్నీ కోల్పోయింది- ఇంత ఆలస్యంగా చర్చలు గుర్తుకొచ్చాయా- ఇరాన్‌పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగ్రహం- అమెరికాతో చర్చలకు రెడీ, కానీ : ఖమేనీ ప్రతినిధి

Published : March 3, 2026 at 7:49 PM IST
Trump On Iran Restart Negotiations : ఇరాన్‌తో సైనిక ఘర్షణ తీవ్రరూపు దాలుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాతో మళ్లీ చర్చలను ప్రారంభించే విషయంలో ఇరాన్ బాగా ఆలస్యం చేసిందన్నారు. నాయకత్వాన్ని, గగనతల రక్షణ వ్యవస్థను, వాయుసేనను, నౌకాదళాన్ని కోల్పోయాక చర్చల గురించి ఇరాన్ మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని పేర్కొన్నారు. ఈమేరకు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ తాజాగా భారతీయ వార్తాసంస్థ ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీగానే ఉందని, కానీ ఇరాన్ ఆత్మగౌరవానికి అమెరికా విలువ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ కామెంట్స్‌కు స్పందనగానే ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు.
Their air defense, Air Force, Navy, and Leadership is gone. They want to talk. I said “Too Late!”https://t.co/5EktMbLuuU
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) March 3, 2026
(TS: 03 Mar 07:38 ET) pic.twitter.com/BVEojdUHeL
అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ లేఖ : కీలక అంశాలివీ
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడుల వివరాలతో అమెరికా కాంగ్రెస్‌కు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక అధికారిక లేఖను రాశారు. ఇరాన్‌పై సైనిక చర్య చేయడాన్ని సమర్ధిస్తూ ఇందులో పలు ముఖ్య వివరాలను ఆయన ప్రస్తావించారు. తన ఆదేశంతోనే ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా ఆర్మీ దాడులను మొదలుపెట్టిందని తెలిపారు. అమెరికా ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ దాడులను చేస్తున్నట్లు లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి మీదుగా జరిగే సముద్ర రవాణా - వాణిజ్యం పరిరక్షణ కోసం, ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాల ఆత్మ రక్షణ కోసమే ఇరాన్‌పై సైనిక చర్యను మొదలుపెట్టామని ట్రంప్ వివరించారు. ఇరాన్‌లోని బాలిస్టిక్ మిస్సైళ్లను తయారు చేసే యూనిట్లు, ఆ దేశ నౌకాదళ యూనిట్లు, యుద్ధ నౌకలు, గగనతల రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లను లక్ష్యం చేసుకొని దాడులు చేశామన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనికుల భద్రత కోసమే ఈ సైనిక చర్యను నిర్వహిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఇరాన్‌పై భూతల దాడులు చేసేది లేదు
ఇరాన్‌పై భూతల దాడులు చేసేది లేదని అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఇరాన్ నుంచి ముప్పును తగ్గించేందుకు, ఇరాన్ ఆయుధశక్తిని తగ్గించేందుకే ఈ సైనిక ఆపరేషన్‌ను మొదలుపెట్టామన్నారు. వీలైనంత తక్కువ ప్రాణనష్టం జరిగేలా జాగ్రత్తల చర్యలతో దాడులను చేస్తున్నామని లేఖలో అమెరికా ప్రెసిడెంట్ వివరించారు.
ఇరాన్ సీనియర్ సైనిక కమాండర్ మృతి
ఇరాన్‌లో ఒక సీనియర్ సైనిక కమాండర్‌ను కడతేర్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో ఆ కమాండర్ చనిపోయాడని తెలిపింది. అయితేే అది ఎవరు అనే సమాచారాన్ని తెలియజేయలేదు.
నాలుగో రోజూ కొనసాగిన సైనిక ఘర్షణ
శనివారం రోజు ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 150 మందికిపైగా స్కూలు పిల్లలు చనిపోయారు. మంగళవారం రోజు ఇరాన్‌లో ఆ పిల్లల అంత్యక్రియలు జరిగాయి. వీటిలో వేలాది మంది ప్రజానీకం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ఇరాన్ ప్రభుత్వ మీడియాలో ప్రసారం చేశారు. అమాయక పిల్లలను కూడా అమెరికా, ఇజ్రాయెల్ పొట్టనపెట్టుకున్నాయి అని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఈ అంశం ఇరాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వానికి కలిసొస్తుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఖమేనీ అంతం తర్వాత ఇరాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వంపై తిరగబడతారనే ట్రంప్ అంచనా తలకిందులు అయిందనే అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ సైనిక ఘర్షణ నాలుగో రోజు (మంగళవారం) కూడా కంటిన్యూ అయింది. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్‌పైనా ఇరాన్ దాడులను కొనసాగించింది. అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడులు చేశాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం- ధ్రువీకరించిన ఐఏఈఏ

