మా మాట వినకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తాం: ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌పై భారీ దాడులకు దిగిన ఇజ్రాయెల్- మిత్రదేశానికి తోడుగా రంగంలోకి దిగిన అమెరికా

Published : February 28, 2026 at 1:36 PM IST
Trump On Iran : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దళాలు సైనిక చర్యలు ప్రారంభించాయి. ఆ ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధ్రువీకరించారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులపై తొలిసారిగా అధికారికంగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు తమ జాతీయ భద్రతను కాపాడుకోవడమే ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. . ఇరాన్ అణు కార్యక్రమాన్ని మళ్లీ పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని, దీర్ఘ శ్రేణి క్షిపణుల తయారీలో వేగం పెంచిందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాము మౌనంగా ఉండలేమని తెలిపారు.
ట్రంప్ మాట్లాడుతూ, ఇటీవల కొంత సమయం క్రితమే అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలో పోరాట చర్యలు ప్రారంభించిందని ధ్రువీకరించారు. ఇరాన్ పాలకుల నుంచి ఎదురవుతున్న ముప్పులను పూర్తిగా నిర్మూలించడం ద్వారా అమెరికా ప్రజలను, విదేశాల్లోని తమ దళాలను రక్షించడమే లక్ష్యమన్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రపంచ ఉగ్రవాదానికి ప్రధాన మద్దతుదారుగా మారిందని, అనేక తీవ్రవాద గ్రూపులకు సహాయం చేస్తోందని విమర్శించారు.
అలాగే, గత 40 ఏళ్లుగా ఇరాన్ పాలకులు అమెరికాకు మరణం అంటూ విద్వేష నినాదాలు చేస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా సైనిక స్థావరాలు, మిత్రదేశాలపై దాడులకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు. తమ సొంత దేశ ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తే వారినే వీధుల్లో కాల్చి చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలన దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రపంచానికి పెద్ద ప్రమాదమని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా సంయుక్తంగా భారీ సైనిక చర్యలు చేపట్టిందన్నారు. ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, ఆయుధ పరిశ్రమలు, వ్యూహాత్మక సైనిక స్థావరాలపై లక్ష్యబద్ధ దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా క్షిపణి వ్యవస్థలు, రక్షణ మౌలిక వసతులను నేలమట్టం చేయడమే లక్ష్యమని తెలిపారు. అవసరమైతే ఇరాన్ నావికాదళ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తామని స్పష్టం చేశారు.
అణు ఒప్పందాల విషయంలో ఇరాన్ అస్పష్టంగా వ్యవహరిస్తోందని ట్రంప్ అన్నారు. అంతర్జాతీయ సమాజం ఎన్నిసార్లు హెచ్చరించినా, తమ మాట వినకుండా అణు కార్యక్రమాన్ని విస్తరిస్తోందని విమర్శించారు. ఇక దీన్ని సహించలేమని, అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటామని చెప్పారు. ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణు బాంబు ఉండకూడదనేది తమ ప్రభుత్వ స్పష్టమైన విధానమని మరోసారి పునరుద్ఘాటించారు.
ఇప్పటికైనా ఇరాన్ నాయకులు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని ట్రంప్ సూచించారు. లేనిపక్షంలో మరింత తీవ్ర సైనిక చర్యలకు అమెరికా వెనుకాడదని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. తమ మిత్రదేశాల రక్షణకూ సమాన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు, ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేపట్టిన దాడులను "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ"గా పేర్కొంది పెంటగాన్.
ఇరాన్‌పై పట్టపగలే అమెరికా, ఇజ్రాయెల్ బాంబులతో పెద్దఎత్తున విరుచుకుపడ్డాయి. టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలి దాడి జరిపాయి. అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ మిలిటరీ, ప్రభుత‌్వ, ఇంటెలిజెన్స్ కార్యాలయాలే టార్గెట్‌గా దాడులు చేసినట్లు సమాచారం. బాంబు దాడులతో ఆయాప్రాంతాల్లో పెద్దఎత్తున పొగలు అలుముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అధికారిక ఛానల్, అంతర్జాతీయ మీడియా ధ్రువీకరించాయి. దేశవ్యాప్తంగా దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. అయితే దాడులు జరిగిన సమయంలో ఖమేనీ తన కార్యాలయంలో లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్పటికే ఆయన్ను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు పేర్కొన్నాయి.
ఇరాన్‌పై మిస్సైళ్లతో విరుచుకపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు- భారతీయులకు అడ్వైజరీ జారీ
ఆంథ్రోపిక్‌కు ట్రంప్ షాక్- ఆ కంపెనీ ఏఐ వినియోగాన్ని ఆపాలంటూ ప్రభుత్వ శాఖలకు ఆదేశం

