ETV Bharat / international

మోదీ నాపట్ల సంతోషంగా లేరు : డొనాల్డ్ ట్రంప్

భారత్​ టారిఫ్‌లపై మరోసారి మాట్లాడిన ట్రంప్- తన పట్ల మోదీ సంతోషంగా లేరని కీలక వ్యాఖ్యలు!

DONALD TRUMP ABOUT MODI
DONALD TRUMP ABOUT MODI (EVT Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 9:08 AM IST

3 Min Read
Choose ETV Bharat

Donald Trump About Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న అనుబంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధం ఉందని, కానీ అధిక సుంకాల కారణంగా ఆయన సంతోషంగా లేరని అన్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం వాషింగ్టన్​ డీసీలో జరిగిన హౌస్​ జీఓపీ మెంబర్​ రిట్రీట్​లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

'ప్రధాని మోదీ నన్ను కలవడానికి వచ్చిన తర్వాత 68 అపాచీ హెలికాప్టర్లు ఆర్టర్ చేశారు. మోదీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికాకు భారత్​ ఎక్కువ సుంకాలు చెల్లిస్తున్నందున మోదీ నాతో సంతోషంగా లేరు. కానీ, ఇప్పుడు వారు రష్యా నుంచి చమురు కొనుగోలను చాలా వరకు తగ్గించారు' అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్​ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధిస్తోంది. అందులో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తుందనే కారణంగా భారత్​పై అమెరికా 25 శాతం పన్ను విధించింది.

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండటంపై తాను సంతోషంగా లేనని, భారత్‌పై అమెరికా అతి త్వరలో సుంకాలను పెంచే అవకాశముందని ప్రధాని మోదీకి తెలుసునని ఇటీవల ట్రంప్‌ పేర్కొన్నారు. 'నన్ను సంతోషపెట్టాలని వాళ్లు (భారత్‌) అనుకుంటున్నారు. ప్రధాని మోదీ మంచి చాలామంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మేం సుంకాలను పెంచుతాం. అది వారికి ఏమాత్రం బాగోదు. మా ఆంక్షలు రష్యాను తీవ్రంగా బాధిస్తున్నాయి' అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ టారిఫ్‌లు పెంచుతానని ట్రంప్‌ బెదిరింపులు రావడం గమనార్హం. కొన్ని నెలల కిందట ప్రధాని మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రకటించి ట్రంప్‌ సంచలనం వ్యాఖ్యలు చేశారు.

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ వాదన
ఇదిలా ఉండగా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ సమర్థించుకుంటూ వస్తోంది. దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు లభిస్తున్న చమురును కొనుగోలు చేయడం తప్పనిసరి అని దిల్లీ స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో, భారత్‌ రాయితీ ధరలకు చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే దీనిపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. భారత్‌ రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.

రష్యా నుంచి రూ.15 లక్షల కోట్ల చమురు దిగుమతి
ఉక్రెయిన్​తో యుద్ధం మొదలైన దగ్గరి నుంచి రష్యా చమురును భారత్​ ఇప్పటి వరకు 144 బిలియన్‌ యూరోల (రూ.15 లక్షల కోట్ల విలువైన) దిగుమతి చేసుకుంది. దిగుమతి చేసుకున్న మొత్తం శిలాజ ఇంధనాల విలువ 162.5 బిలియన్ యూరోలుగా ఉంటుందని ఐరోపా సంస్థ సెంటర్‌ ఫర్ రీసెర్చ్‌ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ఎయిర్‌ (CREA) వెల్లడించింది. అలాగే ఫిబ్రవరి, 2022 (యుద్ధం మొదలైన ఏడాది) నుంచి ప్రపంచ దేశాలకు చమురు అమ్మడం ద్వారా రష్యా ఒక ట్రిలియన్ యూరోల ఆదాయాన్ని పొందిందని తెలిపింది. రష్యా రాయితీ ధరలకు చమురును విక్రయించడం ప్రారంభించడంతో చైనా తర్వాత మన దేశం అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఫలితంగా మొత్తం మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1% నుంచి 40 శాతానికి చేరింది. ఇక చైనా 210.3 బిలియన్ యూరోల చమురును కొనుగోలు చేసిందని సీఆర్‌ఈఏ వెల్లడించింది. గ్యాస్‌, బొగ్గు దిగుమతులతో కలిపి ఆ మొత్తం 293.7 బిలియన్ యూరోలుగా ఉందని తెలిపింది.

భారత్​పై సుంకాలు పెంచుతా- నేను హ్యాపీగా లేనని మోదీకి తెలుసు: ట్రంప్​

మదురోలా అమెరికాకు కొలంబియా అధ్యక్షుడు సవాల్​- సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్