ETV Bharat / international

'ఇరాన్ పూర్తిగా లొంగిపోయినా- అమెరికాపై టెహ్రాన్​దే విజయం అంటారు'- డెమొక్రాట్లు, మీడియాపై ట్రంప్ ఫైర్​

ఇరాన్ ఓడినా, అమెరికాపై టెహ్రాన్​ విజయం సాధించిందంటూ మీడియా, డెమొక్రాట్లు ప్రచారం చేస్తారు: డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు

Donald Trump
Donald Trump (Associate Press)
author img

By ETV Bharat Telugu Team

Published : June 2, 2026 at 1:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Trump Slams Democrats : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం యూఎస్​ మీడియాపై, విపక్ష డెమొక్రాట్లపై విమర్శల వర్షం కురిపించారు. ఇరాన్​ పూర్తిగా లొంగిపోయి, సైనిక పరంగా ఓటమి అంగీకరించినప్పటికీ, అమెరికాలోని తమ రాజకీయ ప్రత్యర్థులు (డెమొక్రాట్లు), మీడియా సంస్థలు దాన్ని తప్పుగా చిత్రీకరిస్తాయని, అమెరికాపై ఇరాన్​ విజయం సాధించిందని తప్పుడు ప్రచారం చేస్తాయని ఆరోపించారు.

ట్రంప్ ఒక ఊహాజనితమైన పరిస్థితి వివరిస్తూ సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) ట్రూత్ సోషల్​లో ఓ పోస్టు పెట్టారు. అందులో ఇరాన్​ నావికాదళం, వాయుసేన పూర్తిగా నాశనమై, వారి సైన్యం టెహ్రాన్ నుంచి వెనక్కు వచ్చేసినా, ఆయుధాలు కిందపడేసి, చేతులు పైకెత్తి లొంగిపోయినా, అలాగే ఇరాన్ నాయకత్వం లొంగిపోతున్నట్లు అన్ని పత్రాలపై సంతకాలు చేసి, మన మహా శక్తివంతమైన అమెరికా చేతిలో తాము ఓడిపోయామని అంగీకరించినప్పటికీ, విమర్శకులు మాత్రం ఆ వాస్తవాన్ని మార్చి చూపిస్తారని పేర్కొన్నారు.

"ఇరాన్​ లొంగిపోయి, తమ నావికాదళం సముద్ర గర్భంలో కలిసిపోయిందని, తమ వాయుసేన ఇక లేదని అంగీకరిస్తే, అలాగే వారి సైన్యం మొత్తం తెల్లజెండాలు ఊపుతూ, మేము లొంగిపోతున్నాం, మేము లొంగిపోతున్నాం అని అరూస్తూ టెహ్రాన్ నుంచి బయటకు వచ్చేస్తే, మిగిలిన ఇరాన్ నాయకులు తమ ఓటమిని అంగీకరిస్తూ అన్ని పత్రాలుపై సంతకాలు చేసి, శక్తివంతమైన మన అమెరికా బలగాల ముందు తమ ఓటమిని ఒప్పుకుంటే, అప్పుడు కూడా యూఎస్​లోని పలు మీడియా సంస్థలు 'అమెరికాపై ఇరాన్​ అద్భుతమైన, అమోఘమైన విజయం సాధించింది' అని హెడ్​లైన్స్​ పెడతాయి."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

తెలివితక్కువ డ్యూమాక్రాట్స్​!
ఈ సందర్భంగా ట్రంప్ తన ప్రత్యర్థులను 'డ్యూమాక్రాట్స్​' (తెలివితక్కువ డెమొక్రాట్లు) అని ఎగతాళి చేశారు. డమ్​ (తెలివి తక్కువ), డెమొక్రాట్లు అనే పదాలను కలిపి సృష్టించిన అవమానకరమైన పదమే ఈ డ్యూమాక్రాట్స్​. దీనిని ప్రత్యర్థులను ఎగతాళి చేయడానికి లేదా అవమానించడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు డెమొక్రాట్లతోపాటు మీడియా కూడా దారితప్పిందని, యుద్ధ ఫలితాలను విశ్లేషించడంలో వాళ్లు తప్పుచేస్తున్నారని అన్నారు. కచ్చితంగా చెప్పాలంటే డెమొక్రాట్లకు, మీడియాకు పూర్తిగా పిచ్చి పట్టిందని ట్రంప్​ ఎద్దేవా చేశారు.

"ఫెయిలింగ్ న్యూయార్క్ టైమ్స్, చైనా స్ట్రీట్ జర్నల్​, అత్యంత అవినీతిమయమైన, ఇప్పుడు అన్నీ కోల్పోయిన సీఎన్​ఎన్​, మిగిలిన ఫేక్ మీడియా సంస్థలు అన్నీ- అమెరికాపై ఇరాన్​ అద్భుతమైన విజయం సాధించిందని, అసలు పోటీనే లేదని ప్రముఖంగా వార్తలు రాస్తాయి. డ్యూమోక్రాట్లు, మీడియా పూర్తిగా దారి తప్పారు. వారికి పిచ్చిపట్టింది."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

శాంతి ఒప్పందం దిశగా అడుగులు
మరోవైపు పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడటంపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యూహాత్మక సముద్ర (హర్మూజ్​ జలసంధి) రవాణా మార్గంలో రాకపోకలను పునరుద్ధరించడానికి, కాల్పుల విరమణను పొడిగించడానికి వచ్చే వారంలో టెహ్రాన్​తో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కీలకమైన షిప్పింగ్ మార్గంలో ఆంక్షలు తొలగించే లక్ష్యంతో రూపొందించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)కు తాను ఇంకా ఆమోదం తెలపలేదని ఆయన స్పష్టం చేశారు. "నేను ఇంకా కొన్ని పాయింట్లపై స్పష్టత తెచ్చుకోవాల్సి ఉంది" అని అన్నారు.

వాస్తవానికి అమెరికా, ఇరాన్​ మధ్య దాదాపు రెండు నెలల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే గత వారాంతంలో ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీనితో దౌత్య చర్చలు నిలిచిపోయి, మళ్లీ పశ్చిమాసియాలో ఘర్షణలు ఏర్పడతాయనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అయితే టెహ్రాన్​తో శాంతి చర్చలు వేగంగా సాగుతున్నాయని ట్రంప్ సోమవారం ప్రకటించారు.

అమెరికాతో చర్చల్లో లెబనాన్ కీలకం- ఇరాన్ స్పీకర్ కీలక ప్రకటన- యుద్ధ విరమణకు కొత్త ప్రతిపాదనలు!

అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు- కారణమిదే!