ETV Bharat / international

'మిత్రదేశాల ఐక్యతకు ఇదో పరీక్ష'- ఇరాన్‌ యుద్ధంలో నాటో తీరుపై ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి

నాటో దేశాల తీరు తనను తీవ్రంగా నిరాశపరిచిందన్న ట్రంప్‌- నాటో దేశాలపై తనకున్న దీర్ఘకాలిక సందేహాలు నిజమయ్యాయని వెల్లడి

Trump Says Disappointed With Nato
US President Donald Trump and Turkish President Recep Tayyip Erdogan (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : July 8, 2026 at 11:15 AM IST

2 Min Read
Choose ETV Bharat

Trump Says Disappointed With Nato : ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో మిత్రదేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తుర్కియే రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన ఇరాన్ సంక్షోభాన్ని మిత్రదేశాల ఐక్యతను పరీక్షించే అవకాశంగా భావించానని చెప్పారు. అయితే ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.

టర్కీ అధ్యక్షుడు రెసెప్​ తయ్యిప్​ఎర్గోగాన్​తో జరిగిన సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, "మాకు ఎవరి సహాయం అవసరం లేదు. కానీ అవసరమైన సమయంలో మా మిత్రదేశాలు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ఇది ఒక పరీక్షగా భావించాను" అని అన్నారు. అమెరికా ఎన్నో దశాబ్దాలుగా నాటో దేశాల భద్రత కోసం ముందుండి నడిచిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాల్లో మిత్రదేశాలకు అండగా నిలిచామని, అయితే అమెరికాకు అవసరమైనప్పుడు అదే స్థాయిలో సహకారం లభిస్తుందనే నమ్మకం తనకు లేదని పేర్కొన్నారు.

నాటోపై పాత అనుమానాలే నిజమయ్యాయ్
నాటో కూటమిపై తనకు చాలా కాలంగా ఉన్న సందేహాలు తాజా పరిణామాలతో మరింత బలపడ్డాయని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల సమయంలో తమ వైమానిక స్థావరాలను వినియోగించుకునేందుకు కొన్ని నాటో దేశాలు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే హర్మూజ్ జలసంధిలో భద్రత కల్పించేందుకు అవసరమైన సైనిక సహకారం కూడా అందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా చేపట్టిన చర్యలకు మిత్రదేశాలు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు.

'భద్రతా బాధ్యతలు అమెరికాపైనే ఎందుకు?'
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా నాటో కూటమికి ప్రధాన భద్రతా బలంగా నిలిచిందని ట్రంప్ పేర్కొన్నారు. యూరప్ భద్రత కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోందని, అయినప్పటికీ కొన్ని దేశాలు తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించడం లేదని విమర్శించారు. భద్రతా హామీల విషయంలో అమెరికాపైనే ఆధారపడకుండా, నాటో సభ్యదేశాలన్నీ సమాన బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అమెరికా ఒక్కటే ప్రపంచ భద్రత భారాన్ని మోయలేదని స్పష్టం చేశారు.

స్టార్మర్, మెలోనిపై కూడా విమర్శలు
ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ వైఖరిపైనా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్​తో నెలకొన్ని ఉద్రిక్తతల సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ఆశించిన స్థాయిలో లేదని వ్యాఖ్యానించారు. అలాగే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో తనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నప్పటికీ, హర్మూజ్ జలసంధి భద్రత, ఇరాన్ వ్యవహారాల్లో అమెరికా వ్యూహానికి ఆమె మద్దతు ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందన్నారు. "ఆమె అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం. ఆమె మంచి నాయకురాలు. కానీ హర్మూజ్ జలసంధి, ఇరాన్ అంశాల్లో ఆమె తీసుకున్న నిర్ణయం సరైనది కాదని నేను భావిస్తున్నాను. అందుకే మా మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి" అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగిన జీ7 సమావేశంలో జార్జియా మెలోని తనును ఒక ఫోటో కోసం వేడుకుందని ట్రంప్​ వ్యాఖ్యానించారు.

నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే, అమెరికా-నాటో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ట్రంప్ వైఖరిలో మార్పు తీసుకురావడంలో ఆయన విఫలమైనట్లు తెలుస్తోంది.

ఒబామాపై మరోసారి ట్రంప్ వివాదాస్పద పోస్ట్- మార్ఫింగ్ ఫొటో, గ్రాఫిటీతో నినాదాలు

'ఐరోపాలో అమెరికా దళాలు కొనసాగింపుపై సమీక్షిస్తాం'- మిత్రదేశాలపై పీట్ హెగ్‌సెత్ ఆగ్రహం