ETV Bharat / international

యుద్ధం వేళ గల్ఫ్ నౌకలపై అమెరికా కీలక నిర్ణయం- బీమా, రక్షణ హామీ ఇచ్చిన ట్రంప్

హర్ముజ్ జలసంధిలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు రంగంలోకి ట్రంప్- గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు ఆర్థిక, రక్షమ భద్రత

Trump On Gulf Ship Insurance
US president Trump (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 8:41 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump On Gulf Ship Insurance : ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన 'హర్మూజ్ జలసంధి' గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని, ముఖ్యంగా ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు అమెరికా తనసైనిక శక్తిని ఉపయోగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో సముద్ర వాణిజ్యాన్ని కాపాడటానికి అమెరికా తక్షణ చర్యలు చేపడుతుందని ప్రకటించారు.

యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో సముద్ర ప్రయాణం చేసే నౌకలకు సాధారణ బీమా సంస్థలు రక్షణ కల్పించడానికి వెనుకాడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ప్రభుత్వ రంగానికి చెందిన 'యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ' ద్వారా గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే అన్ని నౌకలకు 'పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్' అందించాలని ఆయన ఆదేశించారు.

ఇంధన రవాణాకు ఆర్థిక భద్రత
"గల్ఫ్ ప్రాంతం గుండా ప్రయాణించే అన్ని రకాల సముద్ర వాణిజ్యానికి, ముఖ్యంగా ఇంధన రవాణాకు ఆర్థిక భద్రత కల్పించేలా అత్యంత సరసమైన ధరకే 'పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్', గ్యారెంటీలను అందించాలని నేను యునైటెడ్ స్టేట్స్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ) ఆదేశించాను. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి. ఒకవేళ అవసరమైతే, అమెరికా నౌకాదళం వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధి గుండా ట్యాంకర్లకు రక్షణ నిలుస్తుంది" అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

అతి తక్కువ ధరకే
చాలా తక్కువ ధరకే ఈ బీమా, గ్యారంటీలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల షిప్పింగ్ లైన్లకు ఆర్థిక భద్రత లభిస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అంతర్జాతీయ కంపెనీలు ధైర్యంగా గల్ఫ్ మార్గంలో వాణిజ్యాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. కేవలం ఆర్థిక హామీలతోనే ఆగకుండా, ట్రంప్ నేరుగా సైనిక హెచ్చరికను కూడా జారీ చేశారు. ఒకవేళ పరిస్థితులు మరింత విషమిస్తే, అమెరికా నౌకాదళం రంగంలోకి దిగుతుందని ఆయన తెలిపారు.

"అవసరమైతే, అమెరికా నౌకాదళం వీలైనంత త్వరగా హార్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్లకు రక్షణగా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ప్రపంచానికి ఇంధన సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగేలా అమెరికా చూస్తుంది. అమెరికా ఆర్థిక, సైనిక శక్తి ఈ భూమిపైనే అత్యున్నతమైనది. మరిన్ని చర్యలు త్వరలోనే ఉండబోతున్నాయి" అని ట్రంప్ పేర్కొన్నారు

హర్ముజ్ జలసంధి ప్రాముఖ్యత
ప్రపంచ చమురు వాణిజ్యంలో హర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో సుమారు 20 శాతం నుంచి 30శాతం వరకు ఈ జలసంధి గుండానే ఎగుమతి అవుతుంది. గత నాలుగు రోజులుగా ఈ జలసంధి దాదాపు మూతపడింది. దీనివల్ల సరఫరా దెబ్బతిని చమురు ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82.29 డాలర్ల వద్ద ఉంది. ట్రంప్ తాజా ప్రకటనతో మార్కెట్‌లో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. అలాగే, మరో కోణంలో ఆలోచిస్తే, డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని చాటిచెప్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, అమెరికా నౌకాదళం నేరుగా రంగంలోకి పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశమూ లేకపోలేదు.

అట్టుడుకుతున్న పశ్చిమాసియా
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై తీవ్రంగా దాడి చేస్తున్నాయి. టెహ్రాన్ సహా ఇరాన్‌లోని ప్రధాన నగరాల్లో ఉన్న సైనిక కమాండ్ సెంటర్లు, క్షిపణి కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రతీకారంగా ఇరాన్ తన వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేస్తోంది. ఈ పరస్పర దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతం రణరంగంగా మారింది.