ఖమేనీ చనిపోలేదు- కానీ తీవ్రంగా గాయపడ్డాడు: ఇరాన్ సుప్రీంలీడర్పై ట్రంప్ కామెంట్స్
ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు- ఖమేనీ గురించి ఏమి తెలియకుండా ఇరాన్ నాటకం ఆడుతోందంటూ మండిపాటు

Published : August 27, 2026 at 6:40 AM IST
Trump On Khamenei Health Status : ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ మృతి చెందారనే వదంతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆయన బతికే ఉన్నప్పటికీ, అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని స్పష్టం చేశారు. ఇరాన్ అగ్రనేత చాలా కాలంగా బహిరంగంగా కనిపించకపోవడం, ఆయన ఆరోగ్యంపై తీవ్రమైన ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రముఖ అమెరికన్ కామెంటేటర్ గ్లెన్ బెక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఇరాన్ ప్రస్తుత పరిస్థితులు, ఖమేనీ ఆరోగ్యంపై స్పందించారు.
"ఖమేనీ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. కానీ, ఆ సైనిక దాడుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరానికి ఎడమ వైపున, చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ అతను మరణించలేదని నేను భావిస్తున్నా."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
'ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుతోంది'
ఒకవేళ ఖమేనీ నిజంగానే గాయపడినా లేదా మరణించినా ఈ విషయాలు బయటకు తెలియకుండా ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఒక చక్కటి నాటకం ఆడుతోందని, ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుతోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తాము ఆయన వద్దకు వెళ్లి నిర్ణయాలపై తుది ఆమోదం తీసుకుంటున్నామని ఇరాన్ నాయకులు చెబుతున్నారని, అయితే, వారిని పూర్తిగా నమ్మలేమని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా బలగాల పనితీరుపై కూడా ట్రంప్ మాట్లాడారు. అమెరికా సైన్యాన్ని అకాశానికెత్తారు. 'నిన్న రాత్రే మా నావికాదళం ఇరాన్‌కు చెందిన 22 పడవలను ధ్వంసం చేసింది. మా నేవీ, మిలటరీ అద్భుతంగా పనిచేస్తున్నాయి' అని ప్రశంసించారు. గత ఏడాదిన్నర కాలంలో అమెరికా ఆర్థిక బలం అసాధారణ రీతిలో పుంజుకుందని తెలిపారు. వెనిజువెలాలో సాధించిన విజయం మాదిరిగానే, ప్రస్తుత సైనిక చర్యల్లోనూ తాము ఘన విజయం సాధించడం తథ్యమని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి ఆయన ఇప్పటివరకు ఒక్కసారిగా కూడా బహిరంగంగా కనిపించలేదు. కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారానే పరిపాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమేనీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కొన్ని మీడియా కథనాలు అయితే అతను ఏకంగా చనిపోయినట్లు వదంతులు వచ్చాయి.
ఈ వదంతులను తిప్పికొట్టేందుకు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు 'ఫార్స్ న్యూస్', 'మెహర్ న్యూస్' ఏజెన్సీలు ఇటీవల కొన్ని ఖమేనీ వీడియోలను విడుదల చేశాయి. ఇదిలా ఉండగా, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా ఖమేనీ ఆరోగ్యంపై స్పందించారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఖమేనీతో తాము సుదీర్ఘంగా సమావేశాలు జరుపుతున్నామని తెలిపారు.
విదేశీ పరికరాల నిషేధం- ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
అమెరికా బల్క్ పవర్ సిస్టమ్‌లో భద్రతా లోపాలను అరికట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విదేశాల్లో తయారైన విద్యుత్ పరికరాలను ఉపయోగించడం వల్ల అమెరికా విద్యుత్ గ్రిడ్‌కు పెను ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు దీనికి సంబంధించన ఉత్తర్వులపై సంతకం చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బల్క్ పవర్ సిస్టమ్ ఎలక్ట్రిక్ పరికరాలు దేశానికి అసాధారణమైన ముప్పుగా పరిణమించాయని ఈ సందర్భంగా ట్రంప్ ఆయన పేర్కొన్నారు.
అమెరికా పవర్ గ్రిడ్ కేవలం సాధారణ విద్యుత్ సరఫరా మాత్రమే కాకుండా, జాతీయ రక్షణ, అత్యవసర సేవలు, ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, అధునాతన తయారీ రంగాలకు కూడా ఈ గ్రిడ్ అత్యంత కీలకంగా మారిందని పేర్కొంది. విదేశాల్లో తయారైన పరికరాలలో రహస్య 'డిజిటల్ బ్యాక్‌డోర్స్' ఉండే అవకాశం ఉందని, దీనివల్ల విదేశీ శక్తులు ఆ పరికరాలను రిమోట్ ద్వారా యాక్సెస్ చేసి గ్రిడ్‌ను నియంత్రించే ముప్పు ఉందని భావిస్తోంది. పరికరాల కొనుగోలు, నిర్వహణపై తగినంత నిబంధనలు లేకపోవడం వల్ల కొన్ని విదేశీ శక్తులు ఈ బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని ఉత్తర్వులో పేర్కొంది.
హెచ్-1బీ ఫీజు పెంపు- అమెరికా ఉద్యోగాలు విదేశాలకు తరలిపోయే ప్రమాదం!
నేపాల్‌లో వరద బీభత్సం- సుమారు 100 మంది మృతి- 133 మంది భారతీయులు గల్లంతు!

