ETV Bharat / international

నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు- మళ్లీ గ్రీన్ ల్యాండ్ వైపు దృష్టి మళ్లిందా?

ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ ఫోకస్ మార్పు- నాటో మిత్రదేశాలు సహకరించలేదని ఆరోపణలు- గ్రీన్‌ ల్యాండ్​పై మళ్లీ హక్కుల చర్చకు సంకేతాలు

Trump
Trump (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : April 9, 2026 at 8:39 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump On NATO : ఇరాన్‌తో జరిగిన యుద్ధ ఉద్రిక్తతల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గ్రీన్‌ ల్యాండ్ అంశంపై దృష్టి సారించారు. ఇదే సమయంలో నాటో మిత్రదేశాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తన సోషల్ మీడియా వేదికలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. "మనం అవసరమైనప్పుడు నాటో మాతో లేదు. భవిష్యత్తులో కూడా ఉండదు. గ్రీన్‌లాండ్ గుర్తుంచుకోండి" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఆసక్తి ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతోంది.

ఇరాన్‌తో జరిగిన ఘర్షణల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య 10 పాయింట్ల తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాటు త్వరలో ఇస్లామాబాద్‌లో ప్రత్యక్ష చర్చలు జరపనున్నారు. ఈ చర్చల ద్వారా యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే యుద్ధ సమయంలో నాటో మిత్రదేశాలు అమెరికాకు తగిన మద్దతు ఇవ్వలేదని ట్రంప్ విమర్శించారు. ముఖ్యంగా ఆయిల్ రవాణాకు కీలకమైన స్ట్రయిట్ ఆఫ్ హర్మూజ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, మిత్రదేశాలు సహకరించలేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అమెరికా నాటో నుంచి బయటకు రావచ్చనే సూచనలు కూడా ట్రంప్ చేశారు.

నాటో 1949లో ఏర్పడిన సైనిక కూటమి. ఒక దేశంపై దాడి జరిగితే అది అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి కలిసి స్పందించాలనే ప్రధాన సూత్రంతో ఇది పనిచేస్తుంది. 2001లో జరిగిన సెప్టెంబర్ 11వ తేదీ దాడులు తర్వాత ఈ కూటమి మొదటిసారి యాక్టివ్‌గా పనిచేసి అమెరికాకు మద్దతు ఇచ్చింది. అయితే తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ కూటమి భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ఒక చట్టం ద్వారా అధ్యక్షుడు ఒంటరిగా నాటో నుంచి బయటకు రావడం కష్టంగా మార్చింది. అయినప్పటికీ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక గ్రీన్‌ ల్యాండ్​ విషయానికి వస్తే, ఇది డెన్మార్క్​ ఆధీనంలో ఉన్న స్వయం ప్రతిపత్తి ప్రాంతం. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ ప్రాంతం ఖనిజ సంపదలతో పాటు ఆర్కిటిక్‌లో కీలక స్థానం కలిగి ఉంది. రష్యా, చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గ్రీన్‌ ల్యాండ్​పై నియంత్రణ అవసరమని అమెరికా భావిస్తోంది. అయితే గ్రీన్‌ ల్యాండ్, డెన్మార్క్ నాయకత్వం మాత్రం అమెరికా ప్రయత్నాలను ఖండిస్తూ తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని స్పష్టం చేసింది. ఈ అంశం యూరప్ దేశాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు యూరోపియన్ యూనియన్ మరింత బలంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించాయి. ఇరాన్ యుద్ధ సమయంలో కూడా ట్రంప్ పలుమార్లు మిత్రదేశాలను విమర్శించారు. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా సహాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా తమ రక్షణ కోసం పెద్ద ఎత్తున సైన్యాన్ని ఇతర దేశాల్లో ఉంచుతున్నప్పటికీ, అవసరమైనప్పుడు సహకారం అందడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో ట్రంప్ భేటీ కూడా జరిగింది. ఈ సమావేశం ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించినప్పటికీ, తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారే అవకాశాన్ని సూచిస్తున్నాయి. మరోవైపు అమెరికా రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెనేటర్ మిచ్ మెక్‌కానెల్ నాటోకు మద్దతుగా మాట్లాడుతూ, మిత్రదేశాలతో సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ భద్రత దృష్ట్యా నాటో కీలకమని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే, ఇరాన్‌తో తాత్కాలిక శాంతి నెలకొన్నప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలు కొత్త అంతర్జాతీయ రాజకీయ చర్చలకు తెరతీశాయి. గ్రీన్‌ ల్యాండ్ అంశం, నాటో భవిష్యత్తు, యూరప్-అమెరికా సంబంధాలు ఎలా మారతాయన్నది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

'కాల్పుల విరమణనా లేదా యుద్ధమా?'- ఏదో ఒకటి తేల్చుకోవాలన్న ఇరాన్

హర్మూజ్ జలసంధి తెరవకపోతే ఒప్పందం రద్దే- ఇరాన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక