ETV Bharat / international

కొలంబియాపై మారిన ట్రంప్​ వైఖరి- చర్చలకు వైట్​హౌస్​కు ఆహ్వానం

కొన్ని రోజుల క్రితం కొలంబియాపై తీవ్ర వ్యాఖ్య- ఇప్పుడు అధ్యక్షుడికి వైట్ హౌస్‌కు ఆహ్వానం- ఆ అంశాలపై చర్చలు

Trump
Trump (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 8:16 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump On Colombia : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై తన వైఖరిని ఒక్కసారిగా మార్చారు. కొన్ని రోజుల క్రితం కొలంబియాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్, ఇప్పుడు పెట్రోను వైట్ హౌస్‌కు ఆహ్వానించినట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో చేసిన పోస్టులో, గుస్తావో పెట్రోతో తనకు స్నేహపూర్వక ఫోన్ సంభాషణ జరిగిందని తెలిపారు.

డ్రగ్స్‌కు సంబంధించిన అంశాలు, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని విభేదాలపై పెట్రో తనతో మాట్లాడారని చెప్పారు. పెట్రో మాట్లాడిన తీరు నచ్చిందని, త్వరలోనే ఆయనను కలవాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ భేటీ వైట్ హౌస్‌లోనే జరుగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే కేవలం కొన్ని రోజుల క్రితమే ట్రంప్ కొలంబియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వెనిజువెలాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యల తర్వాత మాట్లాడిన ట్రంప్, “కొలంబియా కూడా చాలా అనారోగ్యంగా ఉంది” అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, కొలంబియా అధ్యక్షుడు పెట్రోపై అమెరికాకు కోకైన్ సరఫరా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అమెరికా కొలంబియాపై సైనికంగా జోక్యం చేసుకునే అవకాశం ఉందా? అని మీడియా ప్రశ్నించగా, “అది నాకు బాగానే అనిపిస్తోంది” అంటూ ట్రంప్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల తర్వాత కొలంబియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అనవసరమైనవని, తమ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని కొలంబియా నేతలు డిమాండ్ చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్న సమయంలో, ఇప్పుడు ట్రంప్ స్వయంగా పెట్రోను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా ఫోన్ కాల్ తర్వాత పరిస్థితి మారినట్లు ట్రంప్ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

రెండు దేశాల మధ్య డ్రగ్స్ నియంత్రణ, భద్రత, వాణిజ్య అంశాలపై చర్చ జరగే అవకాశముందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. వెనిజువెలా, కొలంబియా వంటి దేశాల విషయంలో ట్రంప్ వ్యవహారం ఒక్కోసారి తీవ్రంగా, మరోసారి సాఫ్ట్‌గా ఉండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరోవైపు, వెనిజువెలా తాజాగా కుదుర్చుకున్న ఆయిల్ ఒప్పందం ద్వారా వచ్చే డబ్బుతో ఇకపై కేవలం అమెరికాలో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయనుందని ట్రంప్​ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్​లో స్పష్టం చేశారు. వెనిజువెలా కొనుగోలు చేసే వస్తువుల్లో అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు, అలాగే ఆ దేశంలోని విద్యుత్ గ్రిడ్, శక్తి రంగాన్ని మెరుగుపరచేందుకు అవసరమైన పరికరాలు ఉంటాయని ట్రంప్ తెలిపారు.

అమెరికాతోనే ప్రధానంగా వ్యాపారం చేయాలని వెనిజువెలా నిర్ణయించుకోవడం సరైన నిర్ణయమని, ఇది రెండు దేశాల ప్రజలకు మేలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన వెనిజువెలాలో చోటుచేసుకున్న కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చింది. అంతకుముందు వెనిజువెలా తమపై విధించిన ఆంక్షల కింద ఉన్న 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించనుందని తెలిపారు.

ఈ చమురును అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారమే విక్రయిస్తామని, అయితే దాని ద్వారా వచ్చే డబ్బును అమెరికానే నియంత్రిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ నిధులను వెనిజువెలా ప్రజల సంక్షేమానికి, అలాగే అమెరికా ప్రయోజనాలకు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వెనిజువెలాలో తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థ, ఆరోగ్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి.