రష్యా చమురుపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లు- భారత్‌పై 500 శాతం సుంకాలు?
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై చర్యలకు సిద్ధం- భారత్, చైనా, బ్రెజిల్‌పై ప్రభావం చూపే అవకాశం

Published : January 8, 2026 at 8:59 AM IST
Trump Russia Sanctions Bill : రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్, చైనా వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో అమెరికాలో ద్వైపక్షిక (బైపార్టిసన్) ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500 శాతం పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన కీలక సమావేశం అనంతరం లిండ్సే గ్రాహమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. గత కొన్ని నెలలుగా డెమోక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెన్‌థాల్‌తో కలిసి తాను పనిచేస్తున్న రష్యా ఆంక్షల బిల్లుకు ట్రంప్ అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ బిల్లు తీసుకురావడం వ్యూహాత్మకంగా సరైన సమయమని గ్రాహమ్ అభిప్రాయపడ్డారు.
After a very productive meeting today with President Trump on a variety of issues, he greenlit the bipartisan Russia sanctions bill that I have been working on for months with Senator Blumenthal and many others.
— Lindsey Graham (@LindseyGrahamSC) January 7, 2026
This will be well-timed, as Ukraine is making concessions for peace…
ఉక్రెయిన్ శాంతి కోసం కొన్ని రాయితీలు ఇస్తుంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం మాటలకే పరిమితమై నిరపరాధులను హతమారుస్తున్నారని గ్రాహమ్ విమర్శించారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి పుతిన్ యుద్ధ యంత్రాంగానికి ఇంధనం అందిస్తున్న దేశాలపై చర్యలు తీసుకునే అధికారం ఈ బిల్లు ద్వారా ట్రంప్‌కు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం ఈ బిల్లుపై బలమైన ద్విపక్ష మద్దతుతో ఓటింగ్ జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా కాంగ్రెస్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ బిల్లుకు సాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 అనే పేరు పెట్టారు. ఈ బిల్లు అమలులోకి వస్తే, రష్యాపై మాత్రమే కాకుండా, రష్యాతో వ్యాపారం చేసే వ్యక్తులు, సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం వరకు కస్టమ్ డ్యూటీ విధించే ప్రతిపాదన ఇందులో ఉంది.
ఈ పరిణామాల మధ్య, జనవరి 7న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ అమెరికా ప్రతినిధి బృందాన్ని కలిశారు. ఈ భేటీలో స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్యపరమైన మార్గాలపై ఇరు పక్షాలు చర్చించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, భారత్–అమెరికా మధ్య చమురు దిగుమతులు, టారిఫ్‌ల అంశంపై ఇప్పటికే కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల హౌస్ జీఓపీ సభ్యుల సమావేశంలో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనపై అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై అధిక టారిఫ్‌లు విధించాల్సి వచ్చిందని, దాంతో మోదీ సంతోషంగా లేరని ట్రంప్ అన్నారు. అయితే, భారత్ వాటిని కొంతవరకు తగ్గించిందని కూడా ఆయన పేర్కొన్నారు.
"మోదీతో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి. కానీ టారిఫ్‌ల విషయంలో ఆయన సంతోషంగా లేరు. నన్ను సంతోషపెట్టేందుకు కొన్ని మార్పులు చేశారు" అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు దిగుమతుల నేపథ్యంలో భారత్‌పై మొత్తం 50 శాతం వరకు టారిఫ్‌లు విధించినట్లు ఆయన తెలిపారు. అవసరమైతే భారతీయ వస్తువులపై మరింత టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
ట్రంప్ కీలక నిర్ణయం- భారత్ నేతృత్వంలోని సోలార్ అలయెన్స్ నుంచి US ఔట్
కొలంబియాపై మారిన ట్రంప్ వైఖరి- చర్చలకు వైట్‌హౌస్‌కు ఆహ్వానం

