ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌నకు ఎదురుదెబ్బ- సైనిక చర్యలను నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం
ఇరాన్‌పై యుద్ధ చర్యలను నిలిపివేయాలంటూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం- ప్రతినిధులసభలో తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు

Published : June 4, 2026 at 7:14 AM IST
Trump War Powers Resolution : ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్) గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగించరాదని స్పష్టం చేస్తూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. సభలో జరిగిన ఓటింగ్‌లో 215 మంది సభ్యులు అనుకూలంగా, 208 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది.
న్యూయార్క్‌కు చెందిన డెమొక్రాట్ నేత గ్రెగరీ మీక్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగబద్ధ బాధ్యతలను కాంగ్రెస్ నిర్వర్తిస్తోందని, కార్యనిర్వాహక వ్యవస్థపై నియంత్రణ, సమతుల్యతను కొనసాగించడం తమ బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. అనవసర, భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ పార్టీలోని కొందరు సభ్యులు కూడా తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. థామస్ మాసీ, బ్రియాన్ ఫిట్జ్‌పాట్రిక్, టామ్ బారెట్, వారెన్ డేవిడ్‌సన్ అనే నలుగురు రిపబ్లికన్ సభ్యులు పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఓటు వేశారు. ఇటీవలి కాలంలో ట్రంప్ యుద్ధాధికారాలను పరిమితం చేయాలని డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలకు రిపబ్లికన్ పార్టీలోని కొంతమంది సభ్యుల నుంచి కూడా మద్దతు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఓటింగ్ మే 21న జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు అధిక సంఖ్యలో సభ్యులు గైర్హాజరు కావడంతో అప్పుడు ఓటింగ్‌ను నిలిపివేశారు.
ప్రస్తుతం ఆమోదం పొందిన వార్ పవర్స్ రిజల్యూషన్ ప్రకారం, కాంగ్రెస్ అధికారిక అనుమతి లేకుండా అమెరికా సైన్యాన్ని దీర్ఘకాలిక యుద్ధ చర్యల్లో కొనసాగించరాదు. ఈ తీర్మానం చట్టబద్ధంగా అమలులోకి రావాలంటే కాంగ్రెస్ రెండు సభల ఆమోదం అవసరం. అయితే ఇది అధ్యక్షుడి సంతకానికి పంపబడదని అమెరికా చట్ట ప్రక్రియలు చెబుతున్నాయి.
స్పీకర్ జాన్సన్ అభ్యంతరం
తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ స్పందించారు. ప్రస్తుతం అధ్యక్షుడికి ఉన్న చర్చల స్వేచ్ఛను పరిమితం చేయడం ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇరాన్ అంశంలో శాంతి ఒప్పందం దిశగా చర్చలు కొనసాగుతున్నాయని, ఈ తరుణంలో యుద్ధాధికారాలను తగ్గించడం అమెరికా చర్చల సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని అభిప్రాయపడ్డారు. అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' లక్ష్యాలు ఇప్పటికే నెరవేరాయని, ప్రభుత్వం తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించిందని ఆయన పేర్కొన్నారు.
యుద్ధంపై దర్యాప్తు ప్రారంభం
ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలపై పలు పర్యవేక్షణ సంస్థలు సంయుక్త విచారణ ప్రారంభించాయి. పెంటగాన్, విదేశాంగ శాఖ, యూఎస్‌ఎఐడీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు ఈ దర్యాప్తులో పాల్గొంటున్నాయి. విదేశాల్లో 60 రోజులకుపైగా కొనసాగుతున్న సైనిక మిషన్లను సమీక్షించడం చట్టపరమైన బాధ్యతగా పేర్కొంటూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ సైనిక చర్యలు ఇప్పటికే 60 రోజుల గడువును దాటినట్లు పర్యవేక్షణ సంస్థలు భావిస్తున్నాయి.
వార్ పవర్స్ చట్టంపై చర్చ
అమెరికా వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు 60 రోజులకంటే ఎక్కువ కాలం సైన్యాన్ని ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో కొనసాగించలేరు. అయితే ఇరాన్‌పై చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి పొందలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత 60 రోజుల గడువు మళ్లీ ప్రారంభమైనట్లుగా తమ అభిప్రాయం అని అమెరికా యుద్ధ వ్యవహారాల కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ ఇటీవల పేర్కొన్నారు.
నెతన్యాహుపై నిజంగానే సీరియస్ అయ్యా- ఖమేనీని కలుస్తా, జీ7కి కూడా వెళ్తా: ట్రంప్ కీలక ప్రకటనలు
భారత్‌తో సహా 60 దేశాలపై అమెరికా ఆంక్షలు- 12శాతం అదనపు సుంకాలకు ప్లాన్- కారణమిదే!

