'ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదు'- డీల్‌పై ట్రంప్ వ్యాఖ్యలు- మస్ట్ అంటే ఒప్పుకోమని టెహ్రాన్ కౌంటర్
సిట్యుయేషన్ రూమ్ సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటించని వైట్ హౌస్- ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండబోదని అంగీకరించాలన్న ట్రంప్- హర్మూజ్‌ను పూర్తిగా తెరవాలని అమెరికా డిమాండ్-మస్ట్ అనే భాషను అంగీకరించమంటూ అమెరికాకు ఇరాన్ కౌంటర్

Published : May 30, 2026 at 7:08 AM IST
US Iran Deal Talks : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన కీలక సిట్యుయేషన్ రూమ్ సమావేశం అనంతరం కూడా అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. ఇరాన్‌కు సంబంధించిన అంశాలపై ఫైనల్ డిటర్మినేషన్ తీసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ట్రంప్ ముందుగానే ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. అయితే దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశం ముగిసిన తర్వాత కూడా వైట్ హౌస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సమావేశం అనంతరం వైట్ హౌస్ అధికారి విడుదల చేసిన ప్రకటనలో, "అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే, అధ్యక్షుడు ట్రంప్ నిర్దేశించిన రెడ్ లైన్స్‌ను సంతృప్తిపరిచే ఒప్పందానికే ఆయన అంగీకరిస్తారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదు" అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌కు పలు షరతులు విధించారు. ఇరాన్ అణ్వాయుధాలు లేదా అణుబాంబు తయారీ దిశగా ఎప్పటికీ వెళ్లబోదని స్పష్టంగా అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాటర్ మైన్స్‌ను నిర్వీర్యం చేయాలి!
అలాగే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తక్షణమే అన్ని రకాల సుంకాలు లేకుండా రెండు దిశల్లోనూ నౌకా రాకపోకలకు తెరవాలని సూచించారు. జలసంధిలో ఎక్కడైనా సముద్ర గనులు (వాటర్ మైన్స్) మిగిలి ఉంటే వాటిని వెంటనే నిర్వీర్యం చేయాలని ట్రంప్ అన్నారు. ఇప్పటికే అమెరికా నౌకాదళం అనేక మైన్లను పేల్చి తొలగించిందని, మిగిలిన వాటిని ఇరాన్ తొలగించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా నావికా దిగ్బంధనం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన నౌకలు తిరిగి ప్రయాణాలు ప్రారంభించవచ్చని కూడా ట్రంప్ తెలిపారు.
అయితే అమెరికా వైఖరిని ఇరాన్ తీవ్రంగా తిరస్కరించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు మస్ట్ అనే భాషతో ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరు. 47 సంవత్సరాల క్రితమే ఆ విధమైన భాషకు మేము వీడ్కోలు చెప్పాం. ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, హక్కులను దృష్టిలో పెట్టుకుని మా నిర్ణయాలను మేమే తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశాలపై వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కూడా బఘాయీ స్పందించారు.
పదేపదే చేస్తున్న వ్యాఖ్యలకు భిన్నంగా ట్రంప్
కాల్పుల విరమణను కొనసాగించేందుకు ఈ ఒప్పందం రూపొందించారని వస్తున్న కథనాలను ఆయన ధ్రువీకరించలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టంచేశారు. "అణు అంశంపై మాకు ఎలాంటి చర్చలు లేవు" అని ఆయన ప్రకటించారు. ఇది ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉంది. ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించి అణ్వాయుధాల అభివృద్ధి చేయడం అమెరికా అంగీకరించదని ట్రంప్ పలుమార్లు స్పష్టం చేశారు.
హర్మూజ్ జలసంధి అంశంపై కూడా ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. ఈ జలసంధి ఇరాన్, ఒమన్ దేశాల ప్రాదేశిక జలాల్లో ఉందని, తీర ప్రాంత దేశాల భద్రతా ప్రయోజనాలు కాపాడుతూ అంతర్జాతీయ నౌకాయానానికి భరోసా కల్పించే విధానాలు అవసరమని బఘాయీ తెలిపారు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి నిర్వహణ కోసం ఇటీవల ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (పీజీఎస్‌ఏ)పై అమెరికా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకల నుంచి అక్రమ రుసుములు వసూలు చేస్తోందని, ఆ నిధులు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చేరుతున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ శాఖ పీజీఎస్‌ఏను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది.
సులభతరం చేసే పనిని!
అమెరికా చర్యలను పీజీఎస్‌ఏ తీవ్రంగా ఖండించింది. యుద్ధం, దౌత్యం ద్వారా హర్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించలేకపోయిన అమెరికా ఇప్పుడు ఆంక్షల ద్వారా అదే లక్ష్యాన్ని సాధించాలనుకుంటోందని విమర్శించింది. అయితే తమ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేసింది. "పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర జలాల్లో అమెరికా ప్రేరేపిత చర్యలు కొనసాగుతున్నప్పటికీ, శత్రుత్వం లేని నౌకలకు అనుమతులు జారీ చేస్తూ నౌకాయానాన్ని సులభతరం చేసే పనిని మేము కొనసాగిస్తాం" అని పీజీఎస్‌ఏ వెల్లడించింది.
మరోవైపు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, హర్మూజ్ జలసంధిలో టోల్ విధించే ఆలోచన ఒమన్‌కు లేదని ఆ దేశం తమకు హామీ ఇచ్చిందన్నారు. అలాగే ఇరాన్‌పై ఎకనామిక్ ఫ్యూరీ పేరుతో కొనసాగిస్తున్న ఆర్థిక ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. ఇక ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘర్ ఘలిబాఫ్ కూడా అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘"అమెరికా మాటలను లేదా హామీలను మేము నమ్మం. చర్యలే మాకు ప్రమాణం. ఎదుటి పక్షం చర్యలు తీసుకునే వరకు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోం. చర్చల కంటే క్షిపణుల ద్వారానే మేము రాయితీలు సాధించాం" అని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన- వైట్‌హౌస్‌లో ఉన్నతస్థాయి సమావేశం

