ETV Bharat / international

'ఇక అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు'- ఇరాన్ కీలక ప్రకటన

ఎక్స్‌లో పోస్టులో వెల్లడించిన ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి అలీ లరిజానీ

Iran on US Threat
Iran on US Threat (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 11:13 AM IST

3 Min Read
Choose ETV Bharat

Iran on US Threats : ఇజ్రాయెల్ - అమెరికా‌తో సైనిక ఘర్షణ వేళ ఇరాన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వ అత్యున్నత స్థాయి భద్రతా వ్యవహారాల అధికారి అలీ లారిజానీ వెల్లడించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు సోమవారం ఉదయం నుంచి ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూపులు కూడా అరబ్ దేశాలు, ఇజ్రాయెల్‌‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు మొదలుపెట్టాయి. డ్రోన్లు, మిస్సైళ్లతో అవి ఎటాక్స్ చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల్లో ఉన్న సైనికులను టార్గెట్‌గా చేసుకొని తమ దాడులను కొనసాగిస్తామనే హెచ్చరికలను ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూపులు జారీ చేశాయి. ఇరాన్‌పైనా అమెరికా - ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం ప్రతిదాడులను చేస్తోంది.

యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తాం : గల్ఫ్, ఐరోపా దేశాలు
ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ చేస్తున్న దాడులకు తాము కలిసికట్టుగా సరైన సమాధానం ఇస్తామని వెల్లడించాయి. ఈ యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. ఇరాన్‌ను నిలువరించేందుకు అమెరికాకు తమ వంతు సాయాన్ని అందిస్తామని అవి వెల్లడించాయి. ఇరాన్ పూర్తి నిర్లక్ష్యంగా అన్ని అరబ్ దేశాలపై దాడులు చేస్తోందని ఆ మూడు ఐరోపా దేశాలు ఆరోపించాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోయారు. ఈ మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఈవిధంగా సైనిక ఘర్షణతో యావత్ పశ్చిమాసియా ప్రాంతం అట్టుడుకుతోంది. అరబ్, ఐరోపా దేశాలు కూడా ఈ యుద్ధంలోకి ప్రవేశిస్తే, సైనిక ఘర్షణ పరిధి మరింత పెరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మండే వార్‌ - కీలక అప్‌డేట్స్

  • ఇరాక్‌లోని ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూపులు బాగ్దాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకొని సోమవారం దాడులు చేశాయి. ఆదివారం రోజు ఇరాక్‌లోని ఇర్బిల్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపైనా అవి ఎటాక్స్ చేశాయి.
  • తమ దేశంలోని బ్రిటన్ సైనిక స్థావరంపైనా ఒక డ్రోన్ దాడి జరిగిందని సైప్రస్ దేశం ప్రకటించింది. ఈ దాడి కూడా ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూపులదే అయి ఉంటుందని భావిస్తున్నారు.
  • సోమవారం తెల్లవారుజాము నుంచి లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మిస్సైల్ ఎటాక్స్‌ను మొదలుపెట్టారు. ఖమేనీని హత్య చేసినందున, దాదాపు ఏడాది తర్వాత తాము తొలిసారిగా ఇజ్రాయెల్‌పై దాడులను మొదలుపెడుతున్నామని మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ప్రకటించింది. హిజ్బుల్లా సంధించిన రాకెట్లు, మిస్సైళ్లు ఖాళీ ప్రదేశాల్లోనే పడ్డాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఒక మిస్సైల్‌ను తాము గాల్లోనే పేల్చేశామని పేర్కొంది.
  • హిజ్బుల్లా దాడులకు ప్రతిగా లెబనాన్‌‌‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసింది. లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న 50 గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ అల్టిమేటం ఇచ్చింది. ఆ ప్రాంతాల్లోని హిజ్బుల్లా మిలిటెంట్ల ఏరివేతకు ముమ్మర సైనిక ఆపరేషన్ నిర్వహిస్తామని ప్రకటించింది.

ఇరాన్‌ మిస్సైల్ యూనిట్లపై అమెరికా ఫోకస్
ఇరాన్‌ ప్రధాన బలం మిస్సైళ్లు, డ్రోన్లే. వాటిని తయారు చేసే, నిల్వ చేసే యూనిట్లు లక్ష్యంగా ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లను తయారు చేసే యూనిట్లపై బీ-2 స్టెల్త్ బాంబర్లతో 2వేల పౌండ్ల బాంబులను వేశామని అమెరికా సైన్యం వెల్లడించింది. తమ దాడుల్లో ఇరాన్‌కు చెందిన 9 యుద్ధ నౌకలు మునిగిపోయాయని తెలిపింది. ఇరాన్‌ నౌకాదళానికి చెందిన ప్రధాన కార్యాలయం కూడా తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది. ఇరాన్‌లో తాము చేయాల్సింది చాలా ఉందని, ఆ లక్ష్యాలన్నీ నెరవేరే వరకు ఈసారి సైనిక ఘర్షణ కొనసాగుతుందని ట్రంప్ ఇప్పటికే తేల్చి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో శనివారం (ఫిబ్రవరి 28) నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో చనిపోయిన వారి సంఖ్య 200 దాటిందని అంటున్నారు.