రష్యా జెండా కలిగిన చమురు ట్యాంకర్- సిబ్బందిలో ముగ్గురు భారతీయులు!
'మ్యారినెరా' నౌక- ముగ్గురు భారతీయులు ఉన్నట్లు పేర్కొన్న రష్యా మీడియా

Published : January 8, 2026 at 10:03 PM IST
Three Indians In Russia Oil Tanker : రష్యా జెండాతో వెళ్తున్న వెనెజువెలా 'మ్యారినెరా' నౌకకు సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా స్వాధీనం చేసుకున్న 'మ్యారినెరా' పేరుతో ఉన్న ఈ నౌక సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు రష్యా మీడియా పేర్కొంది. అందులో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, 17 మంది ఉక్రెయిన్ పౌరులు, ఎనిమిది మంది జార్జియా, ముగ్గురు భారతీయులతో పాటు మరో ఇద్దరు రష్యన్ పౌరులు ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే రష్యా జెండాతో వెళ్తున్న వెనెజువెలా 'మ్యారినెరా' నౌకతో పాటు మరో నౌకను అమెరికా సీజ్ చేసింది. ఈ వ్యవహారం భౌగోళిక రాజకీయాల్లో పెను దుమారం రేపింది. అయితే ఈ నౌక పాత పేరు బెల్లా-1 కాగా, గయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చినట్లు తెలుస్తోంది. గతంలో దీన్ని ఓ ప్రైవేటు వ్యాపారి అద్దెకు తీసుకున్నారని సమాచారం. గయానా నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదన్న అమెరికా కోస్ట్ గార్డ్ నౌకను యూఎస్ పోర్టుకు తరలించాలని డిమాండ్ చేసింది. ఇందుకు నిరాకరించిన నౌకా సిబ్బంది, వెనెజువెలా తీరం నుంచి అట్లాంటిక్ మహా సముద్రం వైపు దీన్ని మళ్లించారు. మార్గ మధ్యలోనే ట్యాంకర్ పేరును మార్చేసిన కెప్టెన్ సోచి పోర్ట్ కెప్టెన్ నుంచి తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందినట్లు రష్యా మీడియా తెలిపింది. ఇదంతా చట్టబద్ధమేనని, అమెరికా ఆరోపిస్తున్నట్లుగా అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించలేదని వివరించింది.
నౌకపై వివాదం ఎందుకు?
అంతకుముందు రష్యా జెండాతో వెళ్తున్న చమురు నౌకను బ్రిటన్ సహకారంతో అమెరికా స్వాధీనం చేసుకోవడంపై భౌగోళిక రాజకీయాల్లో పెను దుమారాన్ని తలెత్తింది. వెనెజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ నౌకపై వివాదం దేనికి? అందులో ఏం తరలిస్తున్నారు? అనేవి ఆసక్తికర అంశాలు.
ఈ నౌక ఏళ్లుగా వెనెజువెలాకు చెందిన చమురు ఎగుమతుల్లో పాల్గొంటోంది. వెనెజువెలా నుంచి చమురును తరలించడానికి షాడో నౌకలు పని చేస్తున్నాయని ఆరోపిస్తున్న అమెరికా వాటి కదలికలపై నిఘా వేసింది. అందులో భాగంగా దీనిని పట్టుకునేందుకు అమెరికా సేనలు పలుమార్లు యత్నించాయి. వారి కళ్లు గప్పి నౌకలోని సిబ్బంది తప్పించుకుంటూ సాగిపోతున్నారు. ఈ క్రమంలో నౌక గుర్తింపునే మార్చేశారు. దానికి తుప్పు పట్టిన రంగు వేయడంతోపాటు రష్యా పతాకాన్ని తగిలించారు. రష్యా రిజిస్ట్రేషన్‌ను దానికి జతచేశారు. కొత్త రూపురేఖలు సంతరించుకున్నప్పటికీ రష్యా జెండాతో నడుస్తున్న ఈ ట్యాంకర్ నౌక అమెరికా బలగాల నుంచి తప్పించుకోలేకపోయింది. నిజానికి అందులో చమురు లేదని రష్యా వాదిన. పశ్చిమాసియాలోని హెజ్‌బొల్లా తదితర మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాల్ని చేరవేయడానికి ఈ నౌకను ఉపయోగిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే రష్యా నౌక ఎస్కార్టుగా ఉన్న నౌకను అమెరికా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇది తీవ్ర అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని నిపుణులు అంటున్నారు. అతి పెద్ద న్యాయ పోరాటానికి దారి తీయొచ్చని చెబుతున్నారు.
అయితే అమెరికా దళాలు ఈ నౌకను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇందుకు బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితోపాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
'అమెరికా పడవలను ముంచేస్తాం- అవసరమైతే టార్పిడోలతో దాడులు' : నౌక సీజ్‌పై రష్యా ఫైర్

