ETV Bharat / international

మళ్లీ ఉప్పొంగుతున్న భోటే కోషి- నేపాల్​లో హైఅలర్ట్​- భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక!

మూడు రోజుల తర్వాత శిథిలాల నుంచి ఆరేళ్ల బాలిక సజీవం- భారీ వర్షాల హెచ్చరికతో సహాయక చర్యలకు ఆటంకం- విద్యుత్‌ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం- అమెరికా భారీ సాయం

Nepal Floods Update
నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విలయం (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 30, 2026 at 11:25 AM IST

3 Min Read
Choose ETV Bharat

Nepal Floods Update : నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విలయం మరింత విషాదాన్ని నింపుతోంది. వరదలు, కొండచరియలు, శిథిలాల కారణంగా మృతుల సంఖ్య ఆదివారం నాటికి 724కు చేరింది. దాదాపు 2,500 మంది ఇంకా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే భోటే కోషి నదిలో నీటిమట్టం మళ్లీ పెరుగుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

శిథిలాల నుంచి బాలిక సజీవంగా!
సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ రుసువా జిల్లాలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. టిమురే ప్రాంతంలో సాయుధ పోలీసు బలగాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మట్టి, శిథిలాలను తొలగించి ఆరేళ్ల బాలికను సజీవంగా బయటకు తీశారు. దాదాపు మూడు రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకున్నప్పటికీ బాలిక ప్రాణాలతో బయటపడింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం కాఠ్​మాండూలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు కూడా సజీవంగా ఉండొచ్చన్న ఆశతో సహాయక సిబ్బంది తనిఖీ చేస్తున్నారు.

గల్లంతైన వారిలో భారతీయులు
నేపాల్‌, టిబెట్‌ ప్రాంతాల్లో కలిపి వేలాది మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన భారతీయుల్లో పలువురి సమాచారం తెలియడం లేదు. భారత విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, 128 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గత రెండు రోజుల్లో 598 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్‌లోని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని వెల్లడించింది. మరో 900 మంది చైనా సరిహద్దుల్లోనే ఉన్నట్లు పేర్కొంది.

మళ్లీ భోటే కోషిలో వరద ముప్పు
ఇదిలా ఉండగా, భోటే కోషి నదిలో మరోసారి నీటిమట్టం భారీగా పెరుగుతున్నట్లు నేపాల్‌ విపత్తు నివారణ సంస్థ ఎన్డీఆర్ఆర్ఎంఏ హెచ్చరించింది. రసువా జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ హెచ్చరికలు జారీ చేసింది. రసువా, ధాదింగ్‌, నువాకోట్‌, చిత్వాన్‌ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మరోసారి నీటిమట్టం పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

భారీ వర్షాలకు హెచ్చరిక
వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేపాల్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక సామగ్రిని తరలించడం, శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు నెమ్మదిస్తున్నాయి.

విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీ నష్టం
ఈ ప్రకృతి విపత్తు మానవ ప్రాణాలను బలిగొనడంతో పాటు నేపాల్‌ మౌలిక సదుపాయాలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ప్రధాన జలవిద్యుత్‌ ప్రాజెక్టులతో పాటు సౌర విద్యుత్‌ కేంద్రాలు వరదలు, శిథిలాల ధాటికి దెబ్బతిన్నాయి. నువాకోట్‌లో త్రిశూలి నది ఒడ్డున ఉన్న సౌర విద్యుత్‌ కేంద్రం పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయింది. ప్రాజెక్టులోని అనేక పరికరాలు ధ్వంసమయ్యాయి. ఒకప్పుడు అక్కడ సౌర విద్యుత్‌ కేంద్రం ఉండేదనే విషయాన్ని గుర్తించేలా కొన్ని అవశేషాలు మాత్రమే మిగిలాయి.

ఇంధన రంగానికీ దెబ్బ
వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని నేపాల్‌ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్‌ వాగ్లే తెలిపారు. త్రిశూలి ప్రాంతంలోని సౌర విద్యుత్‌ కేంద్రంతో పాటు మరికొన్ని విద్యుత్‌ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ధ్రువీకరించారు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలకు నష్టం వాటిల్లడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అమెరికా భారీ మానవతా సాయం
విపత్తు నేపథ్యంలో నేపాల్‌కు అంతర్జాతీయంగా సహాయం అందుతోంది. నేపాల్‌కు 3.6 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ప్రాణరక్షక, మానవతా సహాయాన్ని అందిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ సహాయంలో వరద బాధితులైన సుమారు 10 వేల కుటుంబాలకు అత్యవసర ఆహారం అందించే సామగ్రి కూడా ఉందని తెలిపింది. మరోవైపు భారత్‌ సహా ఇతర దేశాలు కూడా సహాయక చర్యలకు తమవంతు సహకారం అందిస్తున్నాయి.

ప్రవాస భారతీయులు కర్మభూమికి విధేయులుగా ఉండాలి: మోహన్ భాగవత్

నేపాల్‌ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంక్ లాకర్- రూ. 57 లక్షలు కాజేసిన నిందితులు- డెడ్‌బాడీపై బంగారాన్నీ వదల్లేదు!