ఖమేనీ అంతంతో అమెరికా లక్ష్యం నెరవేరుతుందా? ఇరాన్ దాడులతో అరబ్ దేశాల వైఖరి మారిపోయిందా?
ఖమేనీపై దాడికి తప్పుడు సమయాన్ని ఎంచుకున్న అమెరికా- అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడటం కష్టమే- ఇరాన్ దాడులతో అరబ్ దేశాల వైఖరిలో మార్పు- స్వీయరక్షణ కోసం అమెరికా, ఇజ్రాయెల్ వైపు మొగ్గు

Published : March 2, 2026 at 10:42 PM IST
Arab Countries Vs Iran : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా ప్రాంతం అట్టుడుకుతోంది. అమెరికా సైనిక స్థావరాలున్న అరబ్ దేశాలపైనా ఇరాన్ ఎడాపెడా ఎటాక్స్ చేస్తోంది. ఇక ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చేసి, ఆ దేశాన్ని తమ అదుపులోకి తెచ్చుకోవాలనే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయి. ఈ టార్గెట్ నెరవేరుతుందా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయడం అమెరికాకు కలిసొస్తుందా? ఇరాన్ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటారా? ఇరాన్ దాడుల ఎఫెక్ట్‌తో గల్ఫ్ దేశాల వైఖరిలో ఎలాంటి మార్పు వస్తుంది? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఖమేనీపై ఎటాక్- రాంగ్ టైమింగ్
ఇరాన్ అనేది ఇస్లామిక్ దేశం. అక్కడ ఇస్లామిక్ విధానాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయితే దీనిపై గత రెండు దశాబ్దాలుగా పలువురు మహిళలు, యువత నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చాలాసార్లు భారీ నిరసనలూ జరిగాయి. మహ్సా అమిని అనే యువతి తలపై స్కార్ఫ్ ధరించడానికి నిరాకరించింది. దీంతో ఆమెను ఇరాన్ పోలీసులు అరెస్టు చేశారు.
2022 సెప్టెంబర్ 16న పోలీసుల కస్టడీలో మహ్సా అమిని చనిపోయింది. దీంతో ఇరాన్‌లో భారీ నిరసనలు జరిగాయి. ఖమేనీ పాలనపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. అంతెందుకు, 2025 డిసెంబరు చివరి వారం నుంచి జనవరి 10 వరకు ఇరాన్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఖమేనీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభానికి, నిత్యావసరాల ధరల మంటకు ప్రస్తుత ప్రభుత్వమే కారణమని ప్రజలు ఆరోపించారు. దేశంలో రాజకీయ మార్పు రావాలని నినదించారు. ఆ నిరసనలను రాజకీయ అంశంగా మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యత్నించారు. ఆ సమయంలో ఇరాన్‌లోని అణ్వస్త్ర కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఈ మాటలన్నీ కట్టిపెట్టి, ఇరాన్ ప్రజలు రోడ్లపై నిరసన తెలుపుతున్న టైంలోనే సుప్రీం లీడర్ ఖమేనీపై అమెరికా ఎటాక్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ట్రంప్ కోరుకున్న విధంగా, ఆ ప్రజా సమూహమే ఇరాన్ పార్లమెంటు (మజ్లిస్)లోకి వెళ్లి జెండా పాతి ఉండేది.
ఇరాన్‌లోని ఇస్లామిక్ అతివాదులకు కొత్త ఛాన్స్
ప్రజా నిరసనలన్నీ ముగిసిన నెలన్నర రోజుల తర్వాత, ఫిబ్రవరి 28న (శనివారం) ఇరాన్ సుప్రీం లీడర్‌పై అమెరికా ఎటాక్ చేసింది. ఆయనను అంతం చేసింది. ఇప్పటివరకు బలహీనపడిన ఇరాన్ ఇస్లామిక్ అతివాదులకు, ఈ పరిణామం బలపడే కొత్త అవకాశాన్ని సృష్టించింది. ప్రత్యేకించి దేశంలోని యువత, మహిళల నుంచి సానుభూతిని పొందే మార్గాన్ని చూపించింది. ఖమేనీ ప్రాణాలను కోల్పోయి ఉండొచ్చు. కానీ ఆయన ఏర్పాటుచేసిన మతతత్వ వ్యవస్థ, అత్యంత క్లిష్టమైన సైనిక వ్యవస్థ, మతానికే పెద్దపీటను వేసే రాజ్యాంగ వ్యవస్థ అలాగే బలంగా నిలబడి ఉన్నాయి. వీటన్నింటిలోని కీలక వ్యక్తులూ ఇంకా క్రియాశీలకంగానే ఉన్నారు. ఖమేనీ మరణం తర్వాత ఈ వ్యవస్థల బలోపేతానికి అంతర్గతంగా కసరత్తు కూడా మొదలైందని సమాచారం. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పరిధిలో చాలా రహస్య విభాగాలు ఉన్నాయి. వీటిలో కొన్ని దేశ ప్రజల మధ్యే ఉండి సీక్రెట్‌గా పనిచేస్తుంటాయి. ఇటువంటి ఒక విభాగం పేరే 'బాసిజ్'. ఇరాన్ ప్రభుత్వంపై ప్రజలకు అసమ్మతి పెరగకుండా గ్రౌండ్ లెవల్‌లో ప్రచారం చేయడం, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వారిని కూడగట్టడమే బాసిజ్ విభాగం సభ్యుల పని.

అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడటం కష్టమే
ఐఆర్‌జీసీ గొడుగు కింద ఖమేనీ ఏర్పాటు చేసిన రహస్య విభాగాల గురించి ఇప్పటికీ ప్రపంచానికి పెద్దగా తెలియదు. అమెరికా, ఇజ్రాయెల్‌లకూ వాటిపై అంతగా అవగాహన లేదు. ఆ విభాగాలు గ్రౌండ్ లెవల్‌లో యాక్టివ్‌గా ఉన్నంత వరకు, ఇరాన్‌లో ఖమేనీ భావజాలాన్ని కలిగిన ప్రభుత్వాలే ఏర్పడుతాయి. ఆ భావజాలాన్ని కలిగిన వాళ్లనే పాలనా పీఠం వరకు వెళ్లనిస్తారు. ఇరాన్ సుప్రీం లీడర్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలోనూ మతపెద్దల కమిటీకే సర్వాధికారాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఖమేనీని అంతం చేసినంత మాత్రాన, అమెరికా , ఇజ్రాయెల్‌లకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏర్పడదు.
ఇరాన్ సైనిక వ్యవస్థలో కొన్ని లోపాలు
ఇరాన్ సైనిక వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఐఆర్‌జీసీ విభాగాన్ని నేరుగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నియంత్రించేవారు. అది ఆయనకే జవాబుదారీగా ఉండేది. దీనివల్ల ఐఆర్‌జీసీ, ఇరాన్ సైన్యం వేర్వేరు అనే భావన ఏర్పడింది. ఈ ఇరువిభాగాల మధ్య సమన్వయం ఎలా జరుగుతుంది అనే అంశం కూడా పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. కొన్నిసార్లు ఇలాంటి వ్యవస్థాగత లోపాల వల్లే రహస్య సమాచారాలు శత్రుదేశాలకు లీక్ అవుతుంటాయి. ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్‌లో జరిగిన ఖమేనీ మీటింగ్‌పైనా అలాగే సమాచారం లీకై ఉంటుంది.

అమెరికా, ఇజ్రాయెల్‌ల వైపే అరబ్ దేశాల మొగ్గు
లెబనాన్‌లో హిజ్బుల్లా, గాజాలో హమాస్, యెమన్‌లో హుతీలు, ఇరాక్‌లో ఖతాయబ్ హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలను ఇరానే క్రియేట్ చేసింది. వీటన్నింటిని కలిపి "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్" అంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్" బాగా బలహీనపడింది. ఆ మిలిటెంట్ సంస్థల్లోని కీలక నేతలు అందరినీ ఇజ్రాయెల్ హతమార్చింది. అందువల్లే ఇప్పుడు ఖమేనీ హత్య అనంతరం నేరుగా ఇరానే రంగంలోకి దిగింది. నేరుగా అరబ్ దేశాలపై దాడులను మొదలుపెట్టింది. అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ పరిణామంతో అరబ్ దేశాలు ఇరాన్‌ను నెగెటివ్‌గా చూడటం మొదలుపెట్టాయి. ఇకపై తమ దేశాల భద్రత కోసం అమెరికా, ఇజ్రాయెల్‌లకు అవి మరింత చేరువయ్యే ఛాన్స్ ఉంది. అంటే అరబ్ దేశాలతో ఇరాన్‌కు ఉన్న గ్యాప్ మరింత పెరుగుతుంది. కేవలం అమెరికా, ఇజ్రాయెల్‌లపైనే ఇరాన్ దాడులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇరాన్‌కు కనీసం నైతిక మద్దతు పలికేందుకు అరబ్ దేశాలు ముందుకొచ్చి ఉండేవి.


