ETV Bharat / international

గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్యకూ వెనుకాడబోం - అమెరికా సంచలన కామెంట్స్

గ్రీన్‌లాండ్‌ను పొందే విషయంలో వెనక్కి తగ్గిని అమెరికా - ఐరోపా దేశాలు వ్యతిరేకించినా ఆ ద్వీపం తమకు కావాలంటున్న యూఎస్ - అవసరమైతే సైనిక చర్య చేపడుతామని స్పష్టం

WHITE HOUSE ABOUT GREENLAND
WHITE HOUSE ABOUT GREENLAND (Eenadu)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 9:20 AM IST

3 Min Read
Choose ETV Bharat

White House About Greenland : డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ దక్కించుకోవడానికి అమెరికా అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో బుధవారం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం తమకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకాడబోమని ఆమె స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌‌ అంశం అమెరికా భద్రత విషయంలో చాలా కీలకమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు. ఆర్కటిక్ ప్రాంతంలో రష్యా, చైనా వంటి ప్రత్యర్థులను నిరోధించడానికి ఇది అత్యంత కీలకమన్నారు. కమాండర్ ఇన్ చీఫ్‌గా అధ్యక్షుడికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సైనిక చర్య కూడా కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఆర్కటిక్ ప్రాంతంలో రష్యా, చైనా తమ సైనిక, వాణిజ్య ఉనికిని వేగంగా పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా మారిందని అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఆర్కటిక్‌లో భద్రతను బలోపేతం చేయడానికి గ్రీన్‌లాండ్‌పై నియంత్రణ అవసరమని అమెరికా భావిస్తోంది.

"గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో శత్రువులను నిరోధించడానికి ఇది ఎంతో కీలకం. ఈ విదేశీ విధాన లక్ష్యాన్ని చేరుకోవడానికి అధ్యక్షుడు, ఆయన బృందం చర్చిస్తున్నారు. ఈ క్రమంలో, కమాండర్ ఇన్ చీఫ్ (అధ్యక్షుడు) అధికార పరిధిలో అమెరికా సైనిక బలగాలను ఉపయోగించే ఆప్షన్ ఆయనకు ఉంది"

- వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్


యూరోపియన్ దేశాల అభ్యంతరం
గ్రీన్‌లాండ్‌ స్వాధీనం చేసుకుంటామని అమెరికా పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై యూరోపియన్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం యూరోప్ దేశాల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్కటిక్ ప్రాంత భద్రతను ఒక దేశం నిర్ణయించలేదని, నాటో మిత్రదేశాల సహకారంతో, ఐక్యరాజ్యసమితి ఛార్టర్ సూత్రాలకు అనుగుణంగా సమిష్టిగా పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా, గ్రీన్‌లాండ్‌ అనేది అక్కడి ప్రజలదని తేల్చి చెప్పారు.
‘గ్రీన్‌లాండ్‌ అక్కడి ప్రజలది. డెన్మార్క్, గ్రీన్లాండ్‌కు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే హక్కు వారికే మాత్రమే ఉంది” - యురోపియన్ నేతలు

వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలాస్ మదురోను అరెస్టు చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌ స్వాధీనంపై వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అంతకుముందు కూడా ట్రంప్ పలు సందర్భాల్లో గ్రీన్‌లాండ్‌ అమెరికాకు కావాలని బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల కూడా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘మాకు గ్రీన్‌లాండ్‌ అవసరం. ప్రస్తుతం అది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. అక్కడ రష్యా, చైనా నౌకలు విస్తృతంగా ఉన్నాయి. జాతీయ భద్రత కోణంలో గ్రీన్‌లాండ్‌ చాలా ముఖ్యం. డెన్మార్క్ ఒంటరిగా దీనిని నిర్వహించలేరు’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో యూరప్ దేశాలు కూడా తనకు మద్దతు ఇస్తున్నాయని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ట్రంప్ కామెంట్స్ తర్వాత యూరోపియన్ నేతలు స్పందించారు. ట్రంప్ మాటలకు బిన్నంగా ప్రకటన విడుదల చేశారు.
ఆర్కటిక్ ప్రాంతం సైనిక, ఆర్థిక, వ్యూహాత్మకంగా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌పై అమెరికా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఒకవైపు అమెరికా 'సైనిక చర్య' అని హెచ్చరిస్తుండగా, మరోవైపు ఐరోపా దేశాలు 'అంతర్జాతీయ చట్టాలను' ప్రస్తావిస్తున్నాయి. ఈ వివాదం అమెరికా-ఐరోపా మధ్య ఉన్న మిత్ర బంధాన్ని బలహీనపరుస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే ‘నాటో’ కథ ముగిసినట్లే: డెన్మార్క్ ప్రధాని

అమెరికా ఆకస్మిక దాడుల్లో 24మంది వెనెజువెలా భద్రతాధికారుల మృతి