ETV Bharat / international

ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తిగా ఉండకూడదు : SCO సదస్సులో ప్రధాని మోదీ

బిష్కెక్​లో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ- ఉగ్రవాద వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని పిలుపు-ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్న ప్రధాని

PM Modi On Terrorism
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 12:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi On Terrorism : ఉగ్రవాదాన్ని ఏ దేశమూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇందులో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, యువతను నియమించుకోవడం, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, అలాగే సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) శిఖరాగ్ర సదస్సులో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

" ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటి. ఉగ్రవాదంపై పోరాటాన్ని కేవలం చర్య-ప్రతిచర్య అనే పరిమిత దృక్పథంతో చూడకూడదు. దాని మూలాలను గుర్తించి మొత్తం వ్యవస్థను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలను అడ్డుకోవడంతో పాటు కొత్త వ్యక్తులను ఆకర్షించే ప్రక్రియను నిలువరించాలి. తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు. ఉగ్రవాదాన్ని తమ విధానానికి ఒక సాధనంగా ఉపయోగించే దేశాలు, అలాగే ఆశ్రయం, మద్దతు ఇచ్చే వాటికి స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తి కాదన్న విషయాన్ని ఆయా దేశాలకు తెలియజేయాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఎస్​సీఓలో భారత్​ దృష్టికోణాన్ని వివరిస్తూ, భద్రత, అనుసంధానం, అవకాశాలు మూడు కీలక అంశాలని ప్రధాని మోదీ చెప్పారు. శాంతి, భద్రత తమ మొదటి ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయని తెలిపారు. యూరేషియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగాలంటే అఫ్గానిస్థాన్​లోనూ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. అప్గాన్ ప్రజల అభివృద్ధి, మానవతా అవసరాలకు భారత్​ తన వంతు సహకారం అందిస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని తెలిపారు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలపైనా మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో మొదలైన ఘర్షణ అక్కడికే పరిమితం కాదని చెప్పారు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై పడుతుందని వివరించారు. ఈ సంక్షోభాల వల్ల గ్లోబల్‌ సౌత్‌ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయని అన్నారు. యుద్ధాలు, ఉద్రిక్తతలకు యుద్ధభూమిలో పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని భారత్‌ ఎప్పటి నుంచో చెబుతోందని మోదీ పేర్కొన్నారు.

యువతకు డ్రగ్స్‌ పెను ముప్పు
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కూడా యువతతో పాటు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్ ట్రాఫికింగ్​ను అడ్డుకునేందుకు ఎస్​సీఓ పరిధిలోని సంబంధిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్​సీఓ యంత్రాంగాలను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక సమన్వయం, సకాలంలో చర్యలు తీసుకునే వేదికలుగా మార్చాలని పిలుపునిచ్చారు.

ప్రజలకే నేరుగా ప్రయోజనం
ఎస్​సీఓ సహకారం వల్ల కలిగే ప్రయోజనాలు నేరుగా ప్రజలకు చేరాలని మోదీ ఆకాంక్షించారు. ప్రజల మధ్య సంబంధాలే ఈ సహకారానికి అతిపెద్ బలమని అన్నారు. రానున్న 25 ఏళ్లల్లో ఎస్​సీఓ సహకారంలో ప్రజల మధ్య సంబంధాలను మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యువతకు ఎన్ని కొత్త అవకాశాలు కల్పించాం? వ్యాపారవేత్తలకు ఎన్ని కొత్త మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి? సాంకేతికత ద్వారా రైతులకు ఎంత ప్రయోజనం చేకూరింది? ప్రజల జీవన ప్రమాణాలు ఎంత మెరుగుపడ్డాయి? అనే అంశాలే సంస్థ విజయానికి అసలైన కొలమానాలని మోదీ పేర్కొన్నారు.

ఒకే ఫ్రేమ్​లో మోదీ,జిన్​పింగ్, పుతిన్
ఇదిలా ఉండగా ఎస్​సీఓ దేశాధినేతలు కలిసి ఫొటో దిగారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​లు ఒకే ఫ్రేమ్​లో కనిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, షీ జిన్​పింగ్, పుతిన్​తో ప్రధాని మోదీ ముచ్చటించారు.

భారత GDP వృద్ధిపై ప్రధాని మోదీ హర్షం- రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలు

'యుద్ధం మానవాళిని వెనక్కి నెడుతోంది- దానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది'- పుతిన్‌కు స్పష్టం చేసిన మోదీ