ETV Bharat / international

పరిస్థితి ఉద్రిక్తంగా మారితే నెతన్యాహును నరకానికి పంపుతాం: ఇరాన్​ బిగ్ వార్నింగ్

తమపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఇరాన్- అమెరికా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా దాడులు చేస్తామని వార్నింగ్- జియోనిస్ట్ పాలన అంతానికి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్య

Iran Warns US Israel
ప్రతీకాత్మక చిత్రం (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 8:29 AM IST

3 Min Read
Choose ETV Bharat

Iran Warns US Israel : అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేసింది. తమపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అమెరికా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మోహ్‌సెన్ రెజాయ్ అల్టిమేటం ఇచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును నరకానికి పంపుతామని హెచ్చరించారు. జియోనిస్ట్ పాలన అంతానికి రోజులు దగ్గరపడ్డాయని ఓ వార్తా ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయ్‌ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ కుమారుడిని ఇరాన్ హత్య చేయబోతోందంటూ నెతన్యాహు తప్పుడు వార్తలు వ్యాప్తిచేశారని, దీంతో భయాందోళనలకు గురైన ట్రంప్ ఫుడ్ ట్రక్ వర్కర్‌లా తిరగాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.

మరోవైపు, లెబనాన్‌పై కూడా ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. లెబనాన్‌లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ కచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇదిలా ఉంటే ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ దౌత్యపరమైన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానీ టెహ్రాన్‌లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో సమావేశమయ్యారు. ఇరాన్ చమురు ఎగుమతులపై రెజాయ్​ మాట్లాడుతూ, కాల్పుల విరమణ సమయంలో టెహ్రాన్ 70 మిలియన్ నుంచి 80 మిలియన్​ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిందని పేర్కొన్నారు. "కాల్పుల విరమణ సమయంలో, మేము నావికా దిగ్బంధనాన్ని ఛేదించి, సుమారు 70 నుంచి 80 కోట్ల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేయగలిగాం" అని పేర్కొన్నారు.

ఇరాన్​ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా
ఇదిలా ఉండగా, ఆగస్టు 24న ఇరాన్‌పై విధించిన తాజా ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌లను బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ప్రశంసించారు. ఈ ఆంక్షలు టెహ్రాన్ దాని చర్యలకు మద్దతు ఇచ్చేవారి నుంచి న్యాయబద్ధంగా భారీ మూల్యం వసూలు చేస్తుందని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ పోస్టులో రాసుకొచ్చారు. కాగా, ఇరాన్ సైనిక కార్యకలాపాలు, సేకరణ నెట్‌వర్క్‌లు, పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆగస్టు 24న దాదాపు 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలను లక్ష్యంగా చేసుకుని "ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్" భాగంగా ఆంక్షలను ప్రకటించిన తర్వాత నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఇరాన్, అమెరికా మధ్య ఎలాంటి చర్చలు లేవు'
ఇక, వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ గురువారం(స్థానిక కాలమానం ప్రకారం) ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. "ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య​ ఎలాంటి చర్చలు జరగడం లేదు. వారు అర్థవంతమైన రీతిలో చర్చలకు ముందుకు వస్తారని అధ్యక్షుడు భావించే వరకు ఇది కొనసాగుతుంది. కానీ, ఇంకా అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడంపై అమెరికా దృష్టి సారించింది. వారి సైన్యాన్ని నాశనం చేయడానికి మేం 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'ని చేపట్టాం. ప్రస్తుతం వారి ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్'ను చేపడుతున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు, వాషింగ్టన్‌తో సంఘర్షణను ముగించడానికి తన వద్ద నిర్దిష్ట కాలపరిమితి ఏదీ లేదని , చర్చలు పునఃప్రారంభం కావడానికి తాను తొందరపడటం లేదని ట్రంప్ తెలిపారు. "మనం చాలా పెద్ద విజయం సాధిస్తున్నాం. అక్కడ(ఇరాన్​లో) భారీ ద్రవ్యోల్బణం ఉంది. వారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. అక్కడి ప్రజలను చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది నిరసనకారులను చంపుతున్నారు"అని తెలిపారు. అయితే, సైనిక దాడుల కంటే ఆర్థిక చర్యలు ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయా అని అడగగా, అవి రెండూ ప్రభావవంతమైనవేనని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

నేపాల్​కు సాయం చేయడానికి అమెరికా సిద్ధం: ట్రంప్​

అమెరికా-భారత్‌ బంధంపై భాగవత్‌కు 'అన్‌షేకబుల్‌ కాన్ఫిడెన్స్‌'- న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌ రౌండ్‌టేబుల్‌ భేటీ