హర్మూజ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు- ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి
క్షిపణి దాడులతో మంటల్లో చిక్కుకున్న చమురు ట్యాంకర్- చమురు ట్యాంకర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపిన బ్రిటన్ సైన్యం

Published : July 7, 2026 at 7:37 AM IST
Tanker Hit in Strait of Hormuz : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై మంగళవారం తెల్లవారుజామున క్షిపణి దాడి జరగడంతో నౌకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) ధ్రువీకరించింది. ఈ దాడిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
యూకేఎంటీఓ వెల్లడించిన వివరాలు ప్రకారం, హర్మూజ్ నుంచి ఒమాన్ గల్ఫ్ వైపు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ట్యాంక్‌పై లిమా ప్రాంతంలో సమీపంలో క్షిపణి తాకింది. నౌక ఎడమ వైపున క్షిపణి పడటంతో మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటన వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపింది.
స్పందించిన ఇరాన్ ప్రభుత్వ మీడియా
ఇదిలా ఉండగా, చమురు ట్యాంక్‌పై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఖతార్ నుంచి సహజవాయువును తరలిస్తున్న ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్‌కు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వాటిని నౌక పట్టించుకోలేదని పేర్కొంది. అనంతరం ట్యాంకర్‌పై దాడి జరిగిందని తెలిపింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ ఘటనపై స్పందించినప్పటీ, దాడికి తామే బాధ్యులమంటూ ఇరాన్ ప్రభుత్వం లేదా సైన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది. ఇటీవల ఇరాన్ తాము ఆమోదించిన మార్గాల్లోనే చమురు ట్యాంకర్లు ప్రయాణించాలని హెచ్చరించింది. నిర్దేశించిన మార్గాలను ఉల్లంఘించిన నౌకలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ గత వారం స్పష్టం చేసింది. అమెరికా దళాలు ఈ జలసంధిలో జోక్యం చేసుకుంటే వేగంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది.
ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే
అయితే ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు చేసిన కొద్ది గంటల్లోనే హర్మూజ్‌లో ఈ దాడులు జరిగాయి. సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి రావాలని లేకపోతే అమెరికా పని పూర్తి చేస్తుందని అన్నారు. ఆ పని చేయడం పెద్ద కష్టం కాదని గంటల వ్యవధిలోనే వారి వంతెలను కూల్చివేయగలమని, అలాగే విద్యుత్తు సరఫరాను నిలిపివేయగలమని పేర్కొన్నారు.
మరోవైపు, ఖమేనీ భౌతికకాయాన్ని సోమవారం రాత్రి హెలికాప్టర్‌లో షియా మతపరమైన కేంద్రంగా పేరొందిన ఖోమ్ నగరానికి తరలించారు. మంగళవారం జమ్‌కరాన్ మసీదు వద్ద లక్షలాది మంది ఆయనకు నివాళులర్పించారు. అంత్యక్రియల సందర్భంగా ఖమేనీ చిత్రాలతో పాటు ఆయన కుమారుడు, కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన అయతుల్లా మొజ్తబా ఖమేనీ చిత్రాలతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించారు. అయితే మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు. తన తండ్రిపై జరిగిన వైమానిక దాడిలో ఆయన కూడా గాయపడినట్లు ప్రచారం జరుగుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఖమేనీ అంతిమయాత్రలో పాల్గొన్న కొందరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ అంతాన్ని చూడాలంటూ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో నల్లని దుస్తుల్లో హాజరైన ప్రజలు పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు.
ట్రంప్ హెచ్చరికలు, ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న వేళ హర్మూజ్‌లో ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో కీలకమైన ఈ సముద్ర మార్గంలో భద్రతా పరిస్థితులపై మళ్లీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హమాస్ కీలక నిర్ణయం- గాజాలో పాలక మండలి రద్దు
'వాళ్లు ఆపేద్దామనుకుంటున్నారు'- రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

