ETV Bharat / international

గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్‌ను సీరియస్‌‌గా తీసుకోండి- వెనెజువెలా కొత్త సర్కారు మా మాట వినాలి: జేడీ వాన్స్

గ్రీన్‌లాండ్‌పై శత్రుదేశాలు ఆసక్తి చూపుతుండటం అమెరికాతో పాటు ప్రపంచ క్షిపణి రక్షణ వ్యవస్థకు ముప్పు అన్న జేడీ వాన్స్

Vance
Vance (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 8:07 AM IST

3 Min Read
Choose ETV Bharat

JD Vance on Greenland Venezuela : గ్రీన్‌లాండ్ కొనుగోలు, వెనెజువెలా కొత్త ప్రభుత్వం, ఇరాన్‌‌లో భారీ నిరసనలపై వైట్‌‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్ విషయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ఐరోపా దేశాల నేతలకు ఆయన సూచించారు. గ్రీన్‌లాండ్‌పై శత్రుదేశాలు ఆసక్తి చూపుతుండటం అమెరికాతో పాటు ప్రపంచ క్షిపణి రక్షణ వ్యవస్థకు ముప్పేనన్నారు.

ఇకనైనా ఐరోపా దేశాలు తమ భద్రతను సీరియస్‌గా తీసుకోవాలని, లేదంటే అందుకోసం అమెరికా ఏదైనా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. వెనెజువెలాలోని కొత్త ప్రభుత్వంపై ప్రతిరోజు తానే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జేడీ వాన్స్ తెలిపారు. అమెరికా మాటలు వినేలా, అమెరికా ప్రయోజనాలను కాపాడేలా అక్కడి ప్రభుత్వం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరాన్‌లో హక్కుల కోసం పోరాడే ప్రజలందరికీ తమ మద్దతు కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. అలా అయితేనే అణు కార్యక్రమంపై ఇరాన్ తమతో చర్చలకు వస్తుందన్నారు.

ఐరోపా దేశాలు ఏమీ చేయలేకపోతే, మేమే ఏదైనా చేస్తాం
అమెరికా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం గ్రీన్‌‌లాండ్ ద్వీపం చాలా ముఖ్యమైందని జేడీ వాన్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలిపేందుకు వచ్చే వారం గ్రీన్‌లాండ్, డెన్మార్క్ నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అవుతారని ఆయన చెప్పారు. ఆ తర్వాతి వారంలోనూ తాము ఈ తరహాలోనే కొన్ని సందేశాలను ప్రైవేటుగా, ఇంకొన్ని సందేశాలను పబ్లిక్‌గా విడుదల చేస్తామన్నారు. తప్పకుండా తాము చెబుతున్నది ఐరోపా దేశాల నేతలతో పాటు మరెవరికైనా అర్థం అవుతుందని అనుకుంటున్నట్లు వాన్స్ పేర్కొన్నారు. వాళ్లంతా ప్రెసిడెంట్ ట్రంప్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. గ్రీన్‌లాండ్ భద్రత కోసం ఐరోపా దేశాలు ఏమీ చేయలేకపోతే, అమెరికాయే ఏదైనా చేయాల్సి వస్తుందన్నారు. అందుకే తాము ప్రస్తుతం ఈ అంశంపై ఐరోపా దేశాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

వెనెజువెలా కొత్త ప్రభుత్వం అమెరికా మాట వినాలి
ప్రెసిడెంట్ ట్రంప్ నిర్దేశం మేరకు తాను ప్రతిరోజు వెనెజువెలాలోని పరిస్థితులపై సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జేడీ వాన్స్ తెలిపారు. కొత్త ప్రభుత్వం అమెరికా మాట వింటూ, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వెనెజువెలాలో సుస్థిరత కోసం తదుపరిగా ఏమేం చేయాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెెనెజువెలా ఆపరేషన్‌కు సంబంధించిన ప్లానింగ్ నుంచి తనను, నేషనల్ ఇంటెలీజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్‌ను తప్పించారనే ప్రచారం పచ్చి అబద్ధమని వాన్స్ తేల్చి చెప్పారు. ఈ ఆపరేషన్ వివరాలను తాము చాలా కాలం పాటు సీక్రెట్‌గా ఉంచగలిగామన్నారు. తమ ప్రభుత్వంలోని సీనియర్ క్యాబినెట్ లెవల్ అధికారుల టీమ్ వర్క్ వల్లే వెనెజువెలా ఆపరేషన్ సక్సెస్ అయిందని తెలిపారు.

ఇలా అయితేనే ఇరాన్ చర్చలకు వస్తుంది
ఇరాన్‌లో శాంతియుతంగా నిరసనలు నిర్వహిస్తున్న ప్రతీ ఒక్కరికి అమెరికా మద్దతు లభించి తీరుతుందని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు. వాణిని స్వేచ్ఛగా వినిపించే హక్కు ఆ దేశ ప్రజలకు ఉందన్నారు. ప్రజల వాణిని ఇరాన్ పాలకులు వినాలని సూచించారు. రెండు నెలల క్రితం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన పరిస్థితినే ప్రస్తుతం ఇరాన్ సర్కారు చవిచూస్తోందన్నారు. ఇలా అయితేనే అణు కార్యక్రమంపై తమతో ఇరాన్ చర్చలకు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఇరాన్ విషయంలో ఏం చేయాలి అనే దానిపై స్వయంగా ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతారని తెలిపారు. తాము ప్రపంచవ్యాప్తంగా హక్కుల కోసం గళం విప్పే ప్రతి ఒక్కరి పక్షాన నిలబడతామని జేడీ వాన్స్ చెప్పారు. కాగా, తమ దేశంలో జరుగుతున్న భారీ నిరసనలకు స్పాన్సర్‌గా అమెరికా వ్యవహరిస్తోందని గురువారం రోజు ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. కొందరు నిరసనకారులు ఉగ్రవాదుల్లా హింసకు పాల్పడుతున్నారని, దీనివల్ల తమ దేశ అంతర్గత భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని తెలిపింది.