ETV Bharat / international

భారీ పేలుడులో ఆరుగురు చిన్నారులు సహా 46 మంది మృతి- 100కిపైగా ఇళ్లు ధ్వంసం

మయన్మార్​లో సంభవించిన భారీ పేలుడు- ప్రమాదంలో 40కిపైగా మృతి- 70 మందికి గాయాలు!

Myanmar Blast
Myanmar Blast (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2026 at 9:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Myanmar Blast : మయన్మార్‌ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి కనీసం 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు, సహాయక బృందాలు వెల్లడించాయి. మరో 74 మంది గాయపడగా, పేలుడు ప్రభావంతో 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం మయన్మార్‌లోని షాన్ రాష్ట్రంలోని నామ్‌ఖామ్‌ టౌన్‌షిప్‌ పరిధిలో ఉన్న కౌంగ్టప్ గ్రామంలో జరిగింది. చైనా సరిహద్దుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం టాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (టీఎన్‌ఎల్‌ఏ) నియంత్రణలో ఉంది. స్థానిక సమాచారం ప్రకారం, గనుల తవ్వకాలు, రాతి గనుల కార్యకలాపాల కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలను ఒక భవనంలో భారీగా నిల్వ ఉంచారు. మధ్యాహ్నం సమయంలో ఆ భవనంలో ఒక్కసారిగా శక్తివంతమైన పేలుడు సంభవించింది.

పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, దాని ప్రభావం కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఘటన అనంతరం భారీగా పొగలు ఎగసిపడగా, భవనం పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ఇళ్ల పైకప్పులు కూలిపోగా, గోడలు పగిలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో గ్రామంలో ఉన్న పలువురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గంటల తరబడి గాలింపు చేపట్టారు. ఆదివారం సాయంత్రానికి 46 మృతదేహాలను వెలికితీసి అంత్యక్రియల కోసం తరలించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో శోధన కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గాయపడిన 74 మందిని నామ్‌ఖామ్‌ టౌన్‌షిప్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాన్ని అధికారులు తోసిపుచ్చడం లేదు. కొన్ని స్థానిక మీడియా సంస్థలు మృతుల సంఖ్య 50 నుంచి 55 మధ్య ఉండవచ్చని కథనాలు ప్రసారం చేశాయి. ప్రాథమిక దర్యాప్తులో గెలిగ్నైట్‌ అనే శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భారీ మొత్తంలో నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. గెలిగ్నైట్‌ను సాధారణంగా కొండలను పగులగొట్టేందుకు, గనుల తవ్వకాలలో ఉపయోగిస్తారు. అయితే దీన్ని భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిల్వ చేస్తే కాలక్రమేణా అస్థిరంగా మారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఘటనపై టాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ కూడా స్పందించింది. తమ ఆర్థిక విభాగం ఆధ్వర్యంలో గనుల తవ్వకాలు, రాతి గనుల అవసరాల కోసం పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లు తెలిపింది. ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు విచారణ చేపట్టినట్లు వెల్లడించింది. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. కౌంగ్టప్‌ గ్రామం ఉన్న నామ్‌ఖామ్‌ ప్రాంతం గత కొన్నేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటోంది. టీఎన్‌ఎల్‌ఏ మయన్మార్‌ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాన జాతి సాయుధ సంస్థల్లో ఒకటి. 2023 చివర్లో ప్రారంభమైన సైనిక చర్యల తర్వాత ఈ ప్రాంతం పూర్తిగా తిరుగుబాటు దళాల ఆధీనంలోకి వెళ్లింది. గత ఏడాది చైనా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు.

ఇదిలా ఉండగా, మయన్మార్‌లో 2021లో సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ, భద్రతా సంక్షోభం కొనసాగుతోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు క్రమంగా సాయుధ పోరాటాలుగా మారాయి. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాలు ఘర్షణలతో అల్లకల్లోలంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ భారీ పేలుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, ప్రమాద బాధితులకు అవసరమైన వైద్య సహాయం, పునరావాస సదుపాయాలు కల్పిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు- 82 మంది మృతి

పవర్‌ ప్లాంట్‌లో పేలిన బాయిలర్‌- 11మంది మృతి- 22మందికి గాయాలు