ETV Bharat / international

'టారిఫ్‌ బెదిరింపులతోనే భారత్- పాక్ యుద్ధాన్ని ఆపా'- ట్రంప్ నోట మళ్లీ అదే మాట

తన హయాంలో ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య- వరుసగా మూడు రోజుల పాటు ఇరాన్‌పై దాడులు చేశామని ట్రంప్ వెల్లడి- క్రిప్టో, ఏఐలో అమెరికాదే అగ్రస్థానమని చెప్పిన ట్రంప్

Trump On India Pakistan War
US President Donald Trump (AP File Photo)
author img

By ETV Bharat Telugu Team

Published : July 3, 2026 at 6:58 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump On India Pakistan War : భారత్​- పాకిస్థాన్ యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. టారిఫ్ హెచ్చరికతోనే రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు. తన అధ్యక్ష పదవీకాలంలో మొత్తం ఎనిమిది యుద్ధాలను నిలిపివేశారని, అందులో ఐదు యుద్ధాలు టారిఫ్​ల బెదిరింపుల వల్లే ఆగిపోయాయని పేర్కొన్నారు. అమెరికా మీడియా సంస్థ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్​పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏఐ, క్రిప్టోకరెన్సీ రంగాల్లో ప్రపంచానికి అమెరికా నాయకత్వం వహిస్తోందని అన్నారు.

'200 శాతం టారిఫ్ విధిస్తానని చెప్పా'

భారత్​, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో రెండు దేశాలకు ఒకే విధమైన హెచ్చరిక చేసినట్లు ట్రంప్ చెప్పారు. 'మీరు యుద్ధం కొనసాగిస్తే మీ దేశంపై 200 శాంతి టారిఫ్​ విధిస్తా అని భారత్​, పాకిస్థాన్​కు చెప్పా. ఆ హెచ్చరికతోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ సమయంలో భారత్​, పాకిస్థాన్ పూర్తి స్థాయి యుద్ధానికి చేరుకున్నాయి. రెండు దేశాలు అణ్వాయుధ శక్తులు కావడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఘర్షణల్లో 11 యుద్ధ విమానాలను కూల్చివేశారు. ఈ యుద్ధాన్ని ఆపడం వల్ల మూడు కోట్ల మంది ప్రాణాలు కాపాడిగలిగినట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్​ చెప్పారు' అని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ గతంలోనూ పలుమార్లు భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా కీలక పాత్ర పోషించిందని చెప్పినప్పటికీ, భారత్ ఆ వాదనను నిరంతరం ఖండిస్తోంది.

'ఇరాన్ రాడార్లను ధ్వంసం చేశాం'
హర్మూజ్​లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా దళాలు వరుసగా మూడు రోజుల పాటు ఇరాన్​పై సైనిక చర్యలు చేపట్టాయని ట్రంప్ తెలిపారు. ఈ దాడుల్లో ఇరాన్ రాడార్ వ్యవస్థలను పలుమార్లు ధ్వంసం చేశామని, హర్మూజ్​లో ప్రయాణించే చమురు ట్యాంకర్లను అమెరికా నౌకాదళం రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. అమెరికా అవసరమైతే మరిన్ని చర్యలకు కూడా సిద్ధంగా ఉందని, అందుకు కావాల్సిన అన్ని సైనిక సామర్థ్యాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. హర్మూజ్​లో అమెరికా నౌకాదళం కీలక పాత్ర పోషించిందని, అది సాధారణ దిగ్భంధం కాదని, ఉక్కు గోడలా పనిచేసిందని వెల్లడించారు.

ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యలు
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని ట్రంప్ ఆరోపించారు. అక్కడ ద్రవ్యోల్బణం 300 శాతానికి చేరుకుందని, దేశానికి ఆదాయం దాదాపు లేకుండా పోయిందని అన్నారు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే అమెరికా రైతులు పండించే మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్ వంటి ఆహార ధాన్యాలను ఇరాన్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఇరాన్ సైనిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని, పలువురు ఉన్నత సైనికాధికారులు మరణించారని, దేశం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు.

'క్రిప్టోలో వెనుకబడకూడదు'
ఏఐ, క్రిప్రోకరెన్సీ రంగాల్లో అమెరికా వెనకబడితే చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అలా ఎప్పటికీ జరగనివ్వలేమని చెప్పారు. క్రిప్టోలోనూ, కృత్రిమ మేధలోనూ అమెరికానే నంబర్‌వన్ అని, ఏఐలో చైనాతో పాటు మిగతా అన్ని దేశాల కంటే తాము గణనీయంగా ముందున్నామని వ్యాఖ్యానించారు. క్రిప్టోకరెన్సీని తాను కేవలం ఆర్థిక అంశంగా మాత్రమే చూడలేదని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డారు. ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కలిసిన వెంటనే అమెరికా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పును షీ జిన్‌పింగ్ ప్రశంసించారని చెప్పారు.

కుటుంబ క్రిప్టో వ్యాపారాలపై స్పందన
కుటుంబ క్రిప్టో వ్యాపారాలపై ప్రయోజనాల సంఘర్షణ ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు తోసిపుచ్చారు. తన కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు తెలియవని చెప్పారు. అయితే తెలిసి ఉన్నా అందులో ఎలాంటి చట్టవిరుద్ధం, తప్పేమీ లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వీలైనంత వరకు వ్యాపారాలకు దూరంగా ఉండాలని తన పిల్లలకు సూచించినట్లు తెలిపారు. అయితే వారికి కూడా వ్యక్తిగత జీవితం, వ్యాపారాలు ఉంటాయని అన్నారు.

పనామా కాలువపై చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటాం- జన్మతః పౌరసత్వంపై సుప్రీం తప్పు చేసింది : ట్రంప్

'మీ పెంపుడు శక్తుల్ని అదుపులో పెట్టుకోండి- లేదంటే తగిన బుద్ధి చెబుతాం'- అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్