అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి- ఆ దేశాలను విడిచి వెళ్లాలని పౌరులకు అగ్రరాజ్యం అడ్వైజరీ
పౌరులకు కీలక అడ్వైజరీ జారీ- రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి- రియాద్‌లోని అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లు దాడి చేశాయన్న సౌదీ

Published : March 3, 2026 at 7:43 AM IST
US Travel Advisory to Middle East : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతుండటంతో అమెరికా విదేశాంగశాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఖతార్ , సౌదీ, యూఏఈ, ఇజ్రాయెల్ సహా 15 దేశాల్లో ఉంటున్న అమెరికన్లు వెంటనే ఆ దేశాలను వీడాలని సూచించింది. అందుబాటులో ఉన్న రవాణా సాధనాలను ఉపయోగించుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాలను వెంటనే వీడాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. విమాన ప్రయాణాలకు సంబంధించి రాయబార కార్యాలయాలను లేదా ప్రభుత్వ వెబ్ సైట్‌ను తనిఖీ చేయాలని సూచించారు. ఇరాన్‌పై త్వరలోనే భీకర దాడులు చేస్తామని ట్రంప్ పేర్కొనడంతో అమెరికా విదేశాంగశాఖ అడ్వైజరీని జారీ చేసింది. ఈ జాబితాలో బహ్రైన్, కువైట్, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, గాజా, జోర్డాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలు ఉన్నాయి.
అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి
మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతింది. రెండు డ్రోన్లతో అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి జరిగిందని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో మంటలు వ్యాపించాయని వెల్లడించింది. భవనం స్వల్పంగా దెబ్బతిందని ఎవరికి గాయాలు కాలేదని వివరించింది. తాజా దాడి నేపథ్యంలో జెడ్డా, దహ్రాన్, రియాద్‌లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీ పేర్కొంది. ఖతర్‌లోని ఇంధన కేంద్రంపైనా దాడి జరిగినట్లు తెలిసింది. బహ్రెయిన్, ఇరాక్‌లోని సైనిక స్థావరాలపైనా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం.
ట్రంప్ వార్నింగ్
తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. రియాద్‌లోని తమ ఎంబసీపై జరిగిన దాడి అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్‌లో 49 మంది అత్యున్నత స్థాయి నేతలను మట్టుబెట్టాం: కరోలిన్ లీవిట్
అటు ఇరాన్‌పై దాడుల వివరాలను వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఇరాన్ ప్రభుత్వానికి చెందిన 49 మంది అత్యున్నత స్థాయి నేతలను "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" ద్వారా మట్టుబెట్టినట్లు ప్రకటించారు. ఒమన్ గల్ఫ్‌లో ఉన్న ఇరాన్‌కు చెందిన 11 యుద్ధ నౌకలను అమెరికా దళాలు ముంచేశాయని తెలిపారు. మరోవైపు ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకూ ఆరుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
మరోవైపు లెబనాన్‌లో ఇరాన్ మద్దతు గల హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా కమాండ్ సెంటర్ సహా ఆయుధ నిల్వ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన కమాండర్ అబు హమ్జాను బీరుట్‌లో హతమార్చామని వెల్లడించింది. అతడు ఇజ్రాయెల్ సైనికులు, పౌరుల లక్ష్యంగా అనేక ఉగ్రదాడులు చేశాడని వివరించింది. బీరుట్ దక్షిణ ప్రాంత శివారులో ఉన్న ఓ ఛానల్ స్టూడియో భవనంపై క్షిపణి పడింది. ఫలితంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రాణ, ఆస్తినష్టంపై వివరాలు తెలియరాలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 52 మంది మృతిచెందారని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 154 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణకు వ్యతిరేకంగా తాము దాడి చేసినట్లు హెజ్‌బొల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. తమపై దాడులు ఆపకుంటే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.

