ETV Bharat / international

హర్మూజ్​లో ఇరాన్ సముద్ర మైన్లు అమర్చిందా? ఒత్తిడి పెంచే వ్యూహమా?

ఇరాన్ గార్డులు సముద్ర మైన్లు పెట్టినట్టు చార్ట్‌లు విడుదల- హర్మూజ్ మార్గంలో డేంజర్ జోన్ గుర్తింపు- నౌకాయానంపై ప్రభావం!

Strait of Hormuz
Strait of Hormuz (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : April 9, 2026 at 11:42 AM IST

3 Min Read
Choose ETV Bharat

Strait of Hormuz Iran Sea Mines : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలని భావించిన సమయంలో తాజా పరిణామాలు పరిస్థితిని మళ్లీ సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఇరాన్‌కు చెందిన పలు వార్తా సంస్థలు విడుదల చేసిన చార్ట్‌లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. ఆ చార్ట్‌ల ప్రకారం, ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డులు హర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్లు అమర్చినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.

డేంజర్ జోన్ గుర్తింపు
ఆ సమాచారం ముఖ్యంగా నౌకాయాన రంగానికి, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు రవాణా జరుగుతుంది. ఒక అంచనా ప్రకారం, గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్‌లో సుమారు 20 శాతం ఈ మార్గం మీదుగా సాగుతుంది. ఇరాన్ వార్తా సంస్థలు ఐఎస్‌ఎన్ఏ, తస్నీమ్ విడుదల చేసిన చార్ట్‌లలో డేంజర్ జోన్​గా ఒక పెద్ద వలయం గుర్తించారు.

మైన్లు తొలగించారా లేదా?
ఇది సాధారణంగా నౌకలు ప్రయాణించే ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్‌పై ఉంది. ఈ ప్రాంతంలోనే మైన్లు అమర్చినట్టు సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నౌకలు సాధారణ మార్గాన్ని వదిలి, ఇరాన్ తీరానికి దగ్గరగా, లారక్ దీవి వైపు ఉత్తర దిశగా ప్రయాణించినట్లు యుద్ధ సమయంలో తెలుస్తోంది. ఆ చార్ట్‌లు ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు ఉన్న కాలాన్ని సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ మైన్లు తొలగించారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.

ఒత్తిడి పెంచే వ్యూహమా?
దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్య ఇరాన్ వైపు నుంచి ఒత్తిడి పెంచే వ్యూహంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ.. పలు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో కాల్పుల విరమణపై అనిశ్చితి నెలకొంది.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. పూర్తిస్థాయి శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చే వరకు అమెరికా యుద్ధ నౌకలు, బలగాలు ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ తన ప్రకటనలో హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తెరిచి, సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి వెల్లడించారు.

ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు
ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని పేర్కొంటూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా చర్యలకు దిగడంతో ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, హర్మూజ్ జలసంధి భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. ఈ మార్గం లో ఎలాంటి అంతరాయం కలిగినా ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద, కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో శాంతి ఇంకా దూరంగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఇరాన్ చర్యలు, అమెరికా హెచ్చరికలు, ప్రాంతీయ సంఘర్షణలు అన్నీ కలిపి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చలు ఈ సంక్షోభానికి పరిష్కారం చూపుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తోంది.

నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు- మళ్లీ గ్రీన్ ల్యాండ్ వైపు దృష్టి మళ్లిందా?

'కాల్పుల విరమణనా లేదా యుద్ధమా?'- ఏదో ఒకటి తేల్చుకోవాలన్న ఇరాన్