బంగ్లాలో కిరాణా దుకాణ వ్యాపారి హత్య- 24 గంటల్లోనే మరో హిందువుపై దారుణం
పదునైన ఆయుధాలతో దాడి - జర్నలిస్ట్ హత్య జరిగిన గంటల్లోనే మరో ఘటన - ఫేస్బుక్ పోస్టే కారణమా?

Published : January 6, 2026 at 8:59 AM IST
Hindu Man Killed In Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శరత్ చక్రవర్తి మణి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో ఆయన చనిపోయారు. రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన జరగడం గమనార్హం.
నర్సింగ్డి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్‌సిందూర్ బజార్‌లో ఈ హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, శరత్ చక్రవర్తి మణి స్థానిక మార్కెట్‌లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. సోమవారం రాత్రి దుకాణంలో ఉండగా కొందరు దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో మణి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మణి చక్రవర్తి చాలా మంచి వ్యాపారి అని, అతనికి ఎవరితోనూ విభేదాలు లేవని తోటి వ్యాపారులు తెలిపారు. గడిచిన 18 రోజుల్లోనే హిందువుల మరణాల సంఖ్య ఆరుకు చేరింది.
అసలేం జరిగింది?
స్థానికుల మీడియా ప్రకారం, డిసెంబర్ 19వ తేదీన మణి దేశంలో జరుగుతున్న హింసాకాండ వల్ల తన జన్మస్థలం 'మృత్యులోయ'కు చిహ్నంగా మారిందని ఫేస్బుక్ ఫోస్ట్‌లో వర్ణించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం జర్నలిస్ట్ రాణా ప్రతాప్ మరణం తర్వాత మణి హత్య జరిగినట్లు మీడియా తెలిపింది.
రాణా ప్రతాప్ బైరాగిరి మోహిరాంపూర్లోని కపిలా బజార్‌లో ఐస్ తయారీ కర్మాగారాం ఉంది. అంతేకాకుండా నరాలి నుంచి 'దైనిక్ బీడీ ఖోబోర్" వార్త పేపర్‌కు యాక్టింగ్ ఎడిటర్‌గా సేవలందించారు. అయితే, ముగ్గురు దుండగులు మోటారు వాహనంపై వచ్చి, రాణాను బయటకు పిలిచారు. ఒక సందులోకి తీసుకెళ్లి, తలకు అతి దగ్గరగా కాల్చి చంపి, పారిపోయారు. అతడు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు రాణా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్ట్‌మార్టంకి పంపించినట్టు తెలిపారు. కానీ హత్య జరగడానికి గల కారణాలు పేర్కొనలేదు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.
గత కొన్ని వారాలుగా మైనారిటీ గ్రూపులు ఎదుర్కొంటున్న అభద్రత భావాలను వివిధ ఘటనలు వివరిస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఖోఖోన్దాస్ అనే హిందువుపై కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాస్ తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో చెరువులోకి దూకేసాడు. అతని అరుపులు విన్న స్థానికులు అక్కడికి పరుగెత్తుకుని రావడంతో దుండగులు పారిపోయారు. స్థానికులు దాస్‌ను శరిత్పూర్ సదర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అత్యవసర చికిత్స చేసి, రాత్రికి ఢాకాకు తరలించారు. అతడు చివరికి గాయాలతోనే మరణించాడు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని, బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు
మరోవైపు, పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా అక్కడ హిందూ వితంతువుపై జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కలిగంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఆ దారుణ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి, ఆపై డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా చెట్టుకు కట్టి జుట్టును కత్తిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, సుమారు రెండున్నరేళ్ల క్రితం ఆమె షహిన్, అతడి తమ్ముడి వద్ద నుంచి కొంత భూమి, ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటి నుంచే షహిన్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ వేధింపులపై పలుమార్లు నోరు విప్పాలనుకున్నప్పటికీ, సమాజంలో పరువు పోతుందనే భయంతో ఆమె మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది.
బంగ్లాలో మరో హిందువు దారుణ హత్య- కాల్చి చంపిన దుండగులు
బంగ్లాదేశ్‌లో మరో హిందూపై దాడి- ఇంటికి వెళ్తుండగా అడ్డుకుని నిప్పంటించిన నిందితులు

