బస్సు లోయలో పడి 40 మంది మృతి- బ్రేకులు ఫేయిల్ కావడమే కారణం!
మరో ఎనిమిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించిన అధికారులు

Published : July 3, 2026 at 1:01 PM IST
Pakistan Road Accident : పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడి 40 మంది మరణించారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం
బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్ వైపు వెళ్తున్న ఈ బస్సు, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో పర్వత ప్రాంతంలోని ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు రోడ్డు పక్కకు జారి లోయలో పడిపోయింది. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని షెరాని జిల్లా డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ కాకర్ తెలిపారు.
"ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 40 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. రెండు ప్రావిన్సుల జిల్లా యంత్రాంగాలు, సహాయక బృందాలు బాధితులకు సహాయం అందిస్తున్నాయి. ఈ బస్సు క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా మార్గమధ్యంలో మరో బస్సు బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో అందులోని ప్రయాణికులను కూడా ఈ బస్సులో ఎక్కించుకున్నారు. సామర్థ్యానికి మించి బస్సు ప్రయాణిస్తుండటం వల్లే అదుపుతప్పి లోయలోకి పడిపోయనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది." అని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీడియా ఇంఛార్జ్ షాహిద్ రిండ్ తెలిపారు.
మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (MERC) ప్రకారం, విపత్తు సహాయక బృందాలు నుజ్జునుజ్జు అయిన శిథిలాల నుంచి 40 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపాయి. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులను ఝోబ్‌లోని ట్రామా ఫెసిలిటీకి తరలించారు. ఆరు అంబులెన్సులు, 12 మంది అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు (EMTలు), 10 తేలికపాటి రవాణా వాహనాలను ఆ మారుమూల ప్రమాద స్థలానికి పంపింనట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఈ ప్రమాద ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కార్యాలయం స్పందించింది. గాయపడిన వారికి వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఈ విషాదకర ఘటనలో బాధితుల కుటుంబాలతో పాటు దేశం మొత్తం సమానంగా బాధను పంచుకుంటుందని పేర్కొంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అధ్వాన్నమైన రోడ్లు, వాహనాల పరిస్థితి బాగోలేకపోవడం, శిక్షణ లేని డ్రైవర్లు వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.
థాయిలాండ్ ప్రమాదంలో 9మంది సాధువులు మృతి
ఇదిలా ఉండగా, ఈశాన్య థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదంలో మరో 9 మంది మరణించారు. తీర్థయాత్రకు బయలుదేరి రహదారి వెంబడి నడుచుకొంటూ వెళుతున్న సాధువుల మీదకు 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్కు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్‌కు 600 కి.మీ.ల దూరంలోని ముక్దహాన్ ప్రావిన్సుకు చెందిన 35 మంది సాధువుల బృందం రోడ్డుకు ఒక పక్కగా ఒకరి వెనుక మరొకరు వరుసగా నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అతివేగంతో వచ్చి అదుపు తప్పిన ట్రక్కు క్షణాల్లో అందరినీ చెల్లాచెదురు చేసింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సాధువులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ఆసుపత్రిలో మరణించారు. గాయాలతో చికిత్స పొందుతున్న 13 మంది సాధువుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాలుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
UN హెడ్ క్వార్టర్ ఎదుట టిబెట్ జెండాతో వ్యక్తి ఆత్మాహుతి- చైనా టిబెట్‌ను వీడాలంటూ నినాదం!
ఇరాన్ ప్రతినిధులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ స్కెచ్! చర్చల వేళ అమెరికాకు భయాలు

