సౌదీపై ఆగని హూతీ దాడులు- దమ్మామ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులతో ఎటాక్
Houthi Attack On Saudi Dammam Airport : సౌదీ అరేబియాపై హూతీ రెబల్స్ వరుస దాడులు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దమ్మామ్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుపై క్షిపణులతో దాడి విరుచుకుపడ్డారు.

Published : October 12, 2026 at 9:44 AM IST
Houthi Attack On Saudi Dammam Airport : సౌదీ అరేబియాపై హూతీ రెబల్స్ దాడులు ఆగడం లేదు. సౌదీలోని ప్రధాన విమానాశ్రయాలపై వరుస దాడులు చేస్తోన్న హూతీలు, తాజాగా దమ్మామ్‌లోని కింగ్ ఫహాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుపై క్షిపణులతో విరుచుకుపడ్డారు. కీలక ఏవియేషన్ హబ్‌గా ఉన్న ఈ విమానాశ్రయంపై అర్ధరాత్రి హూతీ రెబల్స్ దాడులు జరిపారు. అయితే ఈ దాడికి సంబంధించిన నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటు రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మరోసారి దాడి చేశారు. తాజా దాడిలో ఒక పాకిస్థాన్ జాతీయుడు మరణించగా, మరో 11 మంది గాయపడినట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. దాడుల వల్ల విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్‌లో చెలరేగిన మంటలను అదుపు చేసినట్లు పేర్కొంది. మరోవైపు సౌదీ ఇంధన దిగ్గజం అరామ్‌కోకు చెందిన రెండు కేంద్రాలపై కూడా దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించుకున్నారు. గడచిన దశాబ్దకాలంలో సౌదీ భూభాగంపై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఆదివారం హూతీలు చేసిన దాడి ఒకటి. యెమెన్‌లో అంతర్యుద్ధం జరుగుతుండగా, అక్కడ ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా సైనిక మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలోనే హూతీలు దాడులు చేయడం గమనార్హం.
King Fahd Airport, Dammam #Dammam #KFIA #SaudiArabia https://t.co/5hIFwtNKom
— Summitsoldier (@Summitsoldier) October 11, 2026
దాడులు చేస్తూనే ఉంటాం!
గత 24 గంటల్లో సౌదీలోని విమానాశ్రయంతోపాటు పలు ప్రాంతాలపై తాము దాడులు చేసినట్లు హూతీ రెబల్స్ ఆదివారం ప్రకటించారు. అంతేకాదు సౌదీ రాజధానిలోని రవాణా కేంద్రాలను తమ దళాల యుద్ధక్షేత్రంగా అభివర్ణించారు. వాటిపై ఇంకా దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. అలా ప్రకటించిన కొద్ది గంటలకే కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఓ క్షిపణి తాకిందని, అక్కడ మంటలు చెలరేగాయని సౌదీ సంకీర్ణ దళాలు వెల్లడించాయి. మరో క్షిపణిని గాల్లోనే తమ దళాలు అడ్డుకున్నాయని పేర్కొంది. దమ్మామ్‌లోని కింగ్ ఫహాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుపై కూడా హూతీలు దాడి చేయగా, ఒక డ్రోన్‌ను తాము కూల్చేశామని తెలిపింది. అలాగే సోమవారం తెల్లవారు జామున, దక్షిణ సౌదీ నగరంలోని ఖమీస్ ముషైత్ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చిన హూలీ బాలిస్టిక్ క్షిపణిని కూడా అడ్డుకుని, దానిని నాశనం చేసినట్లు పేర్కొంది.
ఇది యుద్ధనేరం!
గత గురువారం హూతీలు సౌదీ చమురు కేంద్రాలు, ఎర్రసముద్రంలోని చమురు ట్యాంకర్లపై దాడులు చేశారు. ఆ ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కాగా శనివారం చేసి దాడిని సౌదీ 'పూర్తి స్థాయి యుద్ధ నేరం'గా అభివర్ణించింది. దీనికి తాము గట్టిగా సమాధానం ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. "వాస్తవానికి సౌదీ అరేబియా తన రక్షణ రంగం కోసం బిలియన్ల కొద్దీ నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, హూతీల దాడులు జరుగుతూనే ఉన్నాయి.సౌదీ వైమానిక రక్షణ దళాలు కొన్ని హూతీ క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకోగలుగుతున్నాయి. కానీ సౌదీ అరేబియా భౌగోళికంగా చాలా పెద్ద దేశం. అందువల్ల అన్ని వైపులా నిరంతరం రక్షించుకోవడం అసాధ్యం" అని ఒట్టావా విశ్వవిద్యాలయానికి చెందిన భద్రతా విశ్లేషకుడు థామస్ జునో అన్నారు.
సౌదీ కౌంటర్ ఎటాక్
మరోవైపు ఆదివారం హూతీల నియంత్రణలో ఉన్న యెమెన్‌లోని సనా గవర్నరేట్‌పై సౌదీ దళాలు దాడులు చేశాయి. ఈ విషయాన్ని హూతీ మీడియా ధ్రువీకరించింది. ఈ దాడుల్లో ఒక పౌరుడు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని హూతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎక్స్ వేదికగా తెలిపారు.
దాడులను ఖండించిన ఇజ్రాయెల్
సౌదీ విమానాశ్రయంలో హూతీలు చేసిన దాడిని ఐరాస, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలువురు ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. చివరికి సౌదీతో దౌత్య సంబంధాలు లేని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కూడా దీనిని 'భయంకరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించారు.
విమానాల రాకపోకలు బంద్
సౌదీ విమానాశ్రయాలపై హూతీలు దాడులు చేసిన నేపథ్యంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. విమానాశ్రయం రాడార్, కమ్యునికేషన్ పరికరాలు దెబ్బతిన్నాయని, రన్‌వేలను పరిశీలించాల్సి ఉందని విమానయాన వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా అమెరికా, కెనడా, జర్మనీ, స్పెయిన్ రాయబార కార్యాలయాలు తమ పౌరులను రియాద్ విమానాశ్రయానికి వెళ్లవద్దని హెచ్చరించాయి. సౌదీ కూడా తమ పౌరులను ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరింది.
సౌదీని ఆర్థికంగా దెబ్బతీసేందుకేనా?
సౌదీకి ఇప్పుడు పర్యాటక రంగానికి అనుకూలమైన సమయం. సాధారణంగా అక్టోబర్‌లో ఎండ తీవ్రత తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఉమ్రా తీర్థయాత్ర కోసం మక్కాకు రావడం ప్రారంభిస్తారు. త్వరలోనే అక్కడ కన్వెన్షన్లు, వినోద కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ తరుణంలోనే హూతీలు అక్కడ దాడి చేశారు. ఇది సౌదీకి ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. "సౌదీ అరేబియా తమపై ఏ విధంగా ఆంక్షలు విధించిందో, ఇప్పుడు హూతీలు కూడా సౌదీకి అదే రుచి చూపించాలని అనుకుంటున్నారు" అని జునో అన్నారు.
హర్మూజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు- ఇద్దరు భారతీయ నావికులు గల్లంతు- తీవ్రంగా ఖండించిన భారత్

