ETV Bharat / international

నేపాల్​ వరదల వెనుక కారణం ఇదే- శాటిలైట్ చిత్రాలతో క్లారిటీ!

5,200 మీటర్ల ఎత్తులో భారీగా విరిగిపడిన హిమానీనదం- లెండే ఖోలా నదిలోకి దూసుకొచ్చిన మంచు, రాళ్లు, శిథిలాలు- 'లిక్విడ్ కాంక్రీట్‌'లా మారిన బురద, నీటి ప్రవాహం- ఇస్రో ఉపగ్రహ చిత్రాలతో బయటపడిన విపత్తు

Satellite Images Nepal Floods
అక్టోబర్ 18, 2023న నేపాల్‌ ఉపగ్రహ చిత్రం (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 10:57 AM IST

3 Min Read
Choose ETV Bharat

Satellite Images Nepal Floods : నేపాల్‌- టిబెట్ సరిహద్దులో సంభవించిన జలప్రళయానికి సంబంధించి ఆందోళన కలిగించే కారణాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ఈ జలప్రళయానికి భూకంపమే కారణమని భావించినప్పటికీ, తాజా శాస్త్రీయ విశ్లేషణలు అందుకు భిన్నమైన విషయాన్ని వెల్లడించాయి. దాదాపు 5,200 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ హిమానీనదం విరిగిపడటం, దాని వెంట మంచు, రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు కొండపై నుంచి కిందికి దూసుకురావడం వల్లే విపత్తు సంభవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాలు కూడా ఈ ఘటన ఎలా జరిగిందో స్పష్టంగా చూపించాయి.

భారీగా విరిగిన హిమానీనదం
పర్వత శిఖరాలపై ఉన్న హిమానీనదంలో దాదాపు మూడింట రెండు వంతుల భాగం విరిగిపోయినట్లు ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో తేలింది. ఈ భారీ మంచు ముక్కలు సుమారు 1.2 కిలోమీటర్ల దిగువన ఉన్న 'లెండే ఖోలా' నదీ పరివాహక ప్రాంతంలో పడిపోయాయి. ఆగస్టు 24న తీసిన ఇస్రో సెంటినెల్‌-2 ఉపగ్రహ చిత్రాల్లో హిమానీనదం దాదాపు చెక్కుచెదరకుండా కనిపించింది. అయితే ఆగస్టు 26 తర్వాత తీసిన ల్యాండ్‌శాట్‌-9 చిత్రాల్లో హిమానీనదం విరిగిపడిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీకి చెందిన శాస్త్రవేత్త డానియల్ షుగర్ అంచనా ప్రకారం, భారీ మొత్తంలో మంచు విరిగిపడి లోయలోకి చేరింది. హిమానీనదం కూలిపోవడం ఎంత బలంగా జరిగిందంటే, భూకంప పరికరాల్లో నమోదయ్యేంత స్థాయిలో ప్రకంపనలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Satellite Images Nepal Floods
2023 అక్టోబర్ 18న నేపాల్‌లోని ఒక సిమెంట్ కేంద్రం (AP)

'లిక్విడ్ కాంక్రీట్‌'లా
హిమానీనదం పై నుంచి కిందకు జారిపడే సమయంలో అది ముక్కలుగా విడిపోయింది. ఆ మంచు ముక్కలతో పాటు రాళ్లు, మట్టి, చెట్లు, ఇతర శిథిలాలు కూడా దిగువకు కొట్టుకొచ్చాయి. దీంతో సాధారణ నీటి ప్రవాహానికి భిన్నంగా అత్యంత సాంద్రత కలిగిన బురద, శిథిలాల ప్రవాహం ఏర్పడింది. శాస్త్రవేత్తలు దీనిని 'లిక్విడ్ కాంక్రీట్‌' ప్రవాహంగా అభివర్ణించారు. మొదట భారీగా కొట్టుకొచ్చిన శిథిలాలు నది ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో అక్కడ తాత్కాలికంగా ఒక అడ్డుకట్ట ఏర్పడింది. ఆ తర్వాత ఆ అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో నీరు, బురద, మంచు, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. భోటే కోశీ- త్రిశూలి కారిడార్‌ వెంట ఉన్న ప్రాంతాలపై ఈ ప్రవాహం తీవ్ర ప్రభావం చూపింది. ఇళ్లు, వాహనాలు, భారీ బండరాళ్లు సైతం ఈ శక్తివంతమైన ప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి.

Satellite Images Nepal Floods
2026 ఆగస్టు 27, నేపాల్‌లోని స్యాప్రు బేస్​ (AP)

చైన్ రియాక్షన్‌లా విపత్తు
ఈ ఘటనలో వరుస పరిణామాలు చైన్ రియాక్షన్‌లా చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తల అంచనాలు సూచిస్తున్నాయి. తొలుత హిమానీనదం విరిగిపడటం ఆ తర్వాత మంచు, రాళ్ల శిథిలాలు కొండపై నుంచి కిందకు జారడం, అవి నదిని అడ్డుకోవడం దాంతో తాత్కాలికంగా నీరు నిలవడం, ఆ అడ్డుకట్ట తెగిపోవడంతో భారీ స్థాయిలో వరద దిగువకు దూసుకెళ్లడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట ఈ విపత్తు భూకంపం కారణంగానే జరిగిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే భూకంప తరంగాలపై నిర్వహించిన అదనపు విశ్లేషణతో ఆ అనుమానాలు తప్పని తేలింది. నమోదైన ప్రకంపనలు నిజమైన భూకంపం వల్ల కాకుండా హిమానీనదం కూలిపోవడం, దాని వెంట భారీగా శిథిలాలు కిందకు జారిపడటం వల్లే ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Satellite Images Nepal Floods
2026 ఆగస్టు 27 నేపాల్‌లోని ఒక సిమెంట్ కర్మాగారం (AP)

హిమాలయాల్లో పెరుగుతున్న ముప్పు
ఈ ఘటన హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న ప్రకృతి విపత్తుల ముప్పుపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. భూమి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమానీనదాలు క్రమంగా కరుగుతున్నాయి. అదే సమయంలో ఎత్తైన ప్రాంతాల్లో మంచు, రాళ్లను స్థిరంగా ఉంచే శాశ్వత మంచు పొరలు బలహీనపడుతున్నాయి. దీంతో పర్వత ప్రాంతాలు మరింత అస్థిరంగా మారి హిమానీనదాలు, మంచు-రాళ్ల చరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Satellite Images Nepal Floods
2024 ఏప్రిల్ 19న నేపాల్‌లోని త్రిశూలి నదిపై ఉన్న ఒక వంతెన, భవనాలు (AP)

లైవ్‌ నేపాల్‌కు ఆస్ట్రేలియా అత్యవసర సహాయం

పరిస్థితి ఉద్రిక్తంగా మారితే నెతన్యాహును నరకానికి పంపుతాం: ఇరాన్​ బిగ్ వార్నింగ్