అమెరికా చర్యలు చట్టవిరుద్ధం- మరినెరా నౌకను వెంటనే విడిచిపెట్టాలి: రష్యా
అమెరికా చర్యలు అంతర్జాతీయ సముద్ర చట్టాలకు విరుద్ధం- అక్రమ చర్యలను నిలిపివేయాలని రష్యా విదేశాంగ శాఖ డిమాండ్

Published : January 9, 2026 at 9:28 AM IST
Russia Ship Captured : అంతర్జాతీయ సముద్ర చట్టాల నిబంధనలను ఉల్లంఘిస్తూ అమెరికా వ్యవహరిస్తోందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో ప్రయాణిస్తున్న చమురు నౌక మరినెరా (Marinera)పై అమెరికా సైన్యం బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, తక్షణమే ఇలాంటి అక్రమ చర్యలను నిలిపివేయాలని రష్యా విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది.
అంతర్జాతీయ సముద్ర న్యాయ సూత్రాలకు అమెరికా తిరిగి రావాలని స్పష్టం చేసింది. గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, జనవరి 7న మరినెరా ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా సాయుధ దళాలు అక్రమంగా బలప్రయోగం చేశాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ (MFA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సముద్ర రవాణాకు వర్తించే నిబంధనలను అమెరికా పట్టించుకోవడం లేదని మండిపడింది.
ఉద్రిక్తతలకు దారి తీసే చర్యలు
అమెరికా వైఖరి ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రష్యా–అమెరికా సంబంధాలను మరింత దెబ్బతీస్తోందని రష్యా పేర్కొంది. ఈ ఘటన యూరో–అట్లాంటిక్ ప్రాంతంలో సైనిక, రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పౌర నౌకలపై బలప్రయోగానికి అమెరికా చూపుతున్న ఉదాహరణ ఇతర దేశాలను కూడా ఇలాంటి చర్యలకు ప్రోత్సహించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
США захватили российский танкер «Маринера» в Атлантике.
— URA.RU (@ura_ru) January 7, 2026
Европейское командование ВС США обвинило танкер в нарушении режима американских санкций.
Подробнее — в комментариях.
Фото: X/US_EUCOM pic.twitter.com/pCO9xyfm5k
ఈ వ్యవహారంలో బ్రిటన్ పాత్రపై కూడా రష్యా ఆరోపణలు చేసింది. సముద్ర దోపిడీకి చరిత్ర ఉన్న దేశంగా పేర్కొన్న యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర అట్లాంటిక్‌లో అమెరికా సైనిక ఆపరేషన్‌లో తమ ప్రమేయాన్ని బహిరంగంగా అంగీకరించిందని విమర్శించింది.
చట్టబద్ధంగానే రష్యా జెండా
మరినెరా నౌకకు డిసెంబర్ 24న అంతర్జాతీయ, రష్యా చట్టాల ప్రకారం తాత్కాలికంగా రష్యా జెండా ఎగరేసే అనుమతి ఇచ్చినట్లు రష్యా వెల్లడించింది. ఆ నౌక ఉత్తర అట్లాంటిక్ అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తూ ఒక రష్యన్ పోర్టుకు వెళ్తోందని స్పష్టం చేసింది.
నౌక రష్యా రిజిస్ట్రేషన్‌లో ఉందని, ఇది పూర్తిగా పౌర, సైనికేతర నౌకేనని అమెరికా అధికారులకు ముందుగానే అధికారికంగా తెలియజేశామని పేర్కొంది. “నౌక జెండా లేకుండా ప్రయాణించింది” లేదా “తప్పుడు జెండాతో సాగింది” అన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఖండించింది.
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన
అంతర్జాతీయ సముద్ర చట్టం ప్రకారం, ఓ నౌకపై పూర్తి అధికార పరిధి ఆ నౌక జెండా కలిగిన దేశానికే ఉంటుందని రష్యా గుర్తు చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకను ఆపి తనిఖీ చేయడం కేవలం దోపిడీ, బానిస వ్యాపారం వంటి అనుమానాలున్నప్పుడే సాధ్యమని, అవి ఈ కేసులో వర్తించవని స్పష్టం చేసింది. మిగతా సందర్భాల్లో జెండా దేశం అనుమతి తప్పనిసరిగా అవసరమని, అయితే రష్యా అలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపింది.అయినా కూడా అమెరికా కోస్ట్ గార్డ్ నౌక వారాల పాటు మరినెరాను వెంబడించిందని, దీనిపై రష్యా ఇప్పటికే అధికారికంగా నిరసన వ్యక్తం చేసిందని వెల్లడించింది.
సిబ్బంది ప్రాణాలకు ముప్పు
తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఆయిల్ ట్యాంకర్‌ను బలవంతంగా నిలిపి, ఆయుధాలతో స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా భారీ పర్యావరణ ప్రమాదాన్ని కూడా సృష్టించిందని రష్యా ఆరోపించింది. నౌక సిబ్బందిలో అనేక దేశాల పౌరులు ఉన్నారని, వారి ప్రాణాలు, ఆరోగ్యం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. వారిపై అసంబద్ధమైన చట్టపరమైన బెదిరింపులు చేయడం పూర్తిగా అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది.
ఆంక్షలకు చట్టబద్ధత లేదు
అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షలకు అంతర్జాతీయ చట్టాల్లో ఎలాంటి చెల్లుబాటు లేదని రష్యా తేల్చిచెప్పింది. ఆంక్షల పేరుతో అంతర్జాతీయ జలాల్లో నౌకలను స్వాధీనం చేసుకోవడం పూర్తిగా అక్రమమని పేర్కొంది. వెనెజువెలా సహజ వనరులపై అపరిమిత నియంత్రణ సాధించాలనే వ్యూహంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారన్న అమెరికా అధికారుల వ్యాఖ్యలను "నియో–కాలనియల్ ఆలోచనలు"గా రష్యా కొట్టిపారేసింది.
నౌక సిబ్బందిని వెంటనే విడుదల చేయాలి
మరినెరా నౌకలో ఉన్న రష్యన్ పౌరులకు మానవీయంగా వ్యవహరించాలని, వారి హక్కులను పూర్తిగా గౌరవించాలని, వీలైనంత త్వరగా స్వదేశానికి పంపించాలని రష్యా మరోసారి డిమాండ్ చేసింది.వెనెజువెలా సమీపంలో ఆంక్షలున్న చమురు నౌకలపై అమెరికా విధించిన నిర్బంధాన్ని తప్పించుకుందని ఆరోపణల మధ్య, వారాల పాటు వెంబడించిన అనంతరం మరినెరాను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనపై మాస్కో తీవ్రంగా స్పందిస్తూ, అంతర్జాతీయ జలాల్లో మరో దేశానికి చెందిన చట్టబద్ధ నౌకపై బలప్రయోగం చేసే హక్కు ఏ దేశానికీ లేదని స్పష్టం చేసింది.

