ఉక్రెయిన్‌పై రష్యా అత్యాధునిక ఒరెష్నిక్ ప్రయోగం- యూరప్ మొత్తానికి పెనుముప్పు?
పుతిన్ నివాసంపై డ్రోన్ దాడుల ఆరోపణల నేపథ్యంలో రష్యా ప్రతీకారం- పశ్చిమ లివివ్ ప్రాంతంపై అత్యాధునిక ఒరెష్నిక్ క్షిపణి ప్రయోగం- ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగంతో దూసుకెళ్లే మిస్సైల్

Published : January 9, 2026 at 3:14 PM IST
Russia Ukraine War : రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు నిర్వహించిందని క్రెమ్లిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యగా మాస్కో అత్యాధునిక ఆయుధాన్ని రంగంలోకి దించింది. ఉక్రెయిన్‌పై తొలిసారిగా పూర్తిస్థాయిలో సిద్ధమైన ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి తన శక్తిని ప్రదర్శించింది.
కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసం
గురువారం అర్ధరాత్రి పశ్చిమ ఉక్రెయిన్‌లోని లివివ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పుతిన్ నివాసంపై జరిగినట్లు చెబుతున్న డ్రోన్ దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టామని వెల్లడించింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. అయితే క్షిపణి కచ్చితంగా ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుందన్న వివరాలను మాత్రం మాస్కో వెల్లడించలేదు.
భూగర్భ సహజ వాయువు నిల్వలపై దాడి
ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాల ప్రకారం, లివివ్ ప్రాంతంలోని భూగర్భ సహజ వాయువు నిల్వలపై ఈ దాడి జరిగినట్లు సమాచారం. రష్యా దాడిపై ఉక్రెయిన్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ క్షిపణి దాడితో పాటు రష్యా మొత్తం 36 క్షిపణులు, 242 డ్రోన్లను ప్రయోగించిందని కీవ్ ఆరోపించింది. ఈ దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, కనీసం 22 మంది గాయపడినట్లు వెల్లడించింది.
యూరప్ మొత్తానికి పెనుముప్పు?
నాటో సరిహద్దులకు సమీపంలో ఒరెష్నిక్ క్షిపణి పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఉక్రెయిన్‌కే కాకుండా యూరప్ మొత్తానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా వ్యవస్థలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఒరెష్నిక్ అంటే ఏంటి?
ఒరెష్నిక్ క్షిపణి రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక మిస్సైళ్లలో ఒకటి. రష్యన్ భాషలో ఒరెష్నిక్ అంటే హేజెల్‌నట్ చెట్టు. మాస్కో తయారు చేసే అనేక క్షిపణులకు చెట్ల పేర్లు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇది మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా రష్యా మిస్సైల్ దళాలు పేర్కొంటున్నాయి. గంటకు సుమారు 13 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. అంటే ధ్వని వేగం కంటే దాదాపు 10 రెట్లు వేగంగా ఇది దూసుకెళ్తుంది. రష్యా మిస్సైల్ ఫోర్సెస్ చీఫ్ ప్రకటన ప్రకారం, యూరప్‌లోని దాదాపు అన్ని దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ మిస్సైల్‌ను అడ్డుకునే సామర్థ్యం గల రక్షణ వ్యవస్థ ఏ దేశానికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
అణు బాంబులతో పాటు అనేక వార్‌హెడ్‌లను!
అయితే ఇదే తొలిసారి కాదు. 2024 నవంబరులో ఓ ఉక్రెయిన్ ఫ్యాక్టరీపై ఈ ఒరెష్నిక్ క్షిపణిని ప్రయోగించారు. అప్పట్లో ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. తాజాగా దీనిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు రష్యా ప్రకటించింది. అలాగే రష్యాకు మిత్రదేశమైన బెలారస్‌కు ఈ క్షిపణులను తరలించినట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. ఒరెష్నిక్ అణు బాంబులతో పాటు అనేక వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా చూస్తే, ఒరెష్నిక్ ప్రయోగంతో రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కొత్త దశకు చేరినట్లు కనిపిస్తోంది.
'నాకు చట్టాలు అవసరం లేదు- అలా చేస్తే తీవ్ర పరిణామాలు'- ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా చర్యలు చట్టవిరుద్ధం- మరినెరా నౌకను వెంటనే విడిచిపెట్టాలి: రష్యా

