ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్- అణు పరీక్షలకు ఆదేశించిన రష్యా అధ్యక్షుడు పుతిన్!
ఇక పుతిన్ వంతు- అణు పరీక్షకు సిద్ధమైన రష్యా


Published : November 6, 2025 at 3:13 PM IST
Russia Nuclear Test : అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తామని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని పుతిన్ తమ అధికారులను బుధవారం ఆదేశించారు. భద్రతా మండలితో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అణు పరీక్షకు సిద్ధమైన రష్యా
అమెరికా ముందుగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తే, మాస్కో కూడా న్యూక్లియర్ టెస్టులను తిరిగి ప్రారంభిస్తుందని పుతిన్ తన మునుపటి ప్రకటనను పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే వాషింగ్టన్ ఉద్దేశాలను విశ్లేషించి, అణు పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు.
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత పుతిన్ నిర్ణయం
30 ఏళ్ల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తున్నామని అక్టోబరు 30న ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశముందని వెల్లడించారు. అయితే అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ ఆదివారం ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ట్రంప్ ఆదేశించిన అమెరికా అణు ఆయుధ వ్యవస్థ కొత్త పరీక్షలలో అణు విస్ఫోటనాలు ఉండవని అన్నారు.
30 ఏళ్ల క్రితం అణు పరీక్షలను ఆపేసిన అమెరికా- మళ్లీ స్టార్ట్
కాగా, అమెరికా సైన్యం గతంలో క్రమం తప్పకుండా అణ్వాయుధాలను పరీక్షించేది. కానీ 1992 నుంచి అణు పరీక్షలను ఆపేసింది. ఒక్క ఉత్తర కొరియా మాత్రమే ప్రస్తుతం అణు పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే మళ్లీ 30 ఏళ్ల తర్వాత అమెరికా అణు పరీక్షలకు సిద్ధమవుతోంది. కాగా, 2023లో పుతిన్ ప్రపంచ అణు పరీక్ష నిషేధాన్ని రష్యా ఆమోదించడాన్ని రద్దు చేసే బిల్లుపై సంతకం చేశారు. ఈ క్రమంలో మళ్లీ అణు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
రక్షణ మంత్రి ఆండ్రీ కీలక వ్యాఖ్యలు
మరోవైపు బుధవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ తమ అణు ఆయుధశాలలను ఆధునీకరించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల గురించి పుతిన్‌కు నివేదించారు. వాషింగ్టన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభిస్తే, అవి రష్యాకు సైనిక ముప్పుల స్థాయిని గణనీయంగా పెంచుతాయని తెలిపారు. ఆర్కిటిక్ నోవాయా జెమ్లియా ద్వీపసమూహంపై మాస్కో వెంటనే అణు పరీక్షలకు సన్నాహాలు ప్రారంభించాలని సూచించారు. 1990లో సోవియట్ యూనియన్ చివరిసారిగా అణ్వాయుధాన్ని పరీక్షించిన ప్రదేశం ఇదేనని, మళ్లీ అక్కడే అణు పరీక్షలు జరపాలన్నారు.
'అణు పరీక్షలకు రష్యా సిద్ధం కావాలి'
మరోవైపు, రష్యా మిలిటరీ జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ కూడా అణు పరీక్షలను త్వరగా జరపడానికి సన్నాహాలు ప్రారంభించాలని సూచించారు. "మనం ఇప్పుడు తగిన చర్యలు తీసుకోకపోతే, అమెరికా చర్యలకు వెంటనే స్పందించే సమయం, అవకాశాన్ని కోల్పోతాం. ఎందుకంటే అణు పరీక్షలకు సిద్ధం కావడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల కాలం పడుతుంది" అని గెరాసిమోవ్ అన్నారు.
తోసిపుచ్చిన క్రెమ్లిన్ ప్రతినిధి
మరోవైపు, అణు పరీక్షలకు సన్నాహాలు ప్రారంభించాలని పుతిన్ ఆదేశించలేదని, ప్రస్తుతానికి అలాంటి పనిని ప్రారంభించడం అవసరమా అని విశ్లేషించమని మాత్రమే అధికారులకు చెప్పారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. తదుపరి నిర్ణయాలు తీసుకునే ముందు అమెరికా ఉద్దేశాలను మాస్కో పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పుతిన్ అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ హెడ్ డిమిత్రి మెద్వెదేవ్ అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రష్యన్లు తీవ్రంగా పరిగణించడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. 'ట్రంప్ అణు పరీక్షల గురించి ఏమి చెబుతున్నారో ఎవరికీ తెలియదు (బహుశా ఆయనకు అది తెలియకపోవచ్చు)' అని మెద్వెదేవ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పూర్తి స్థాయి అణు పరీక్షలను నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలను రష్యా స్వయంగా అంచనా వేయాల్సి ఉందన్నారు.

