భారత్కు పుతిన్- ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న రష్యా
భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

Published : November 11, 2025 at 10:48 AM IST
Putin India Visit 2025 : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 డిసెంబరులో భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి క్రెమ్లిన్ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రష్యా ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారం మాట్లాడుతూ, "పుతిన్ గారి భారత్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇరుదేశాల మధ్య పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి" అని తెలిపారు. అయితే, పర్యటన తేదీలను ఇంకా ఖరారు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
కార్మికుల మార్పిడి ఒప్పందం
పుతిన్ పర్యటన సందర్భంగా భారత్-రష్యా దేశాల మధ్య కార్మికుల మార్పిడి ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ నైపుణ్య కార్మికులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రష్యాలో ప్రస్తుతం నిర్మాణం, జౌళి, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులు, సాంకేతిక నిపుణులు అక్కడి పరిశ్రమల్లో పనిచేసే అవకాశం ఉన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
దీని గురించి అడిగిన ప్రశ్నలకు స్పందించిన పెస్కోవ్, "ఈ ఒప్పందం ఇంకా రూపుదిద్దుకుంటోంది. కుదుర్చుకోబోయే ఒప్పందాల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం” అని తెలిపారు. రష్యా ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న తరుణంలో భారతీయ నైపుణ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తారని క్రెమ్లిన్ వర్గాలు భావిస్తున్నాయి.
పుతిన్-మోదీ స్నేహం
2021 తర్వాత పుతిన్ భారత్ పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. గత మూడు సంవత్సరాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది రష్యాను రెండు సార్లు సందర్శించారు. మొదట జూలైలో జరిగిన ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగా, అనంతరం అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్ నగరంలో పుతిన్‌ను మరోసారి కలిశారు.
ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కూడా ఇరువురు నేతలు కలసి పలు అంశాలపై చర్చించారు. ప్రపంచ రాజకీయ పరిణామాలు, రక్షణ, వాణిజ్యం, ఇంధన సరఫరా, అంతరిక్ష రంగాల్లో సహకారం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా నిలిచాయి.
వ్యూహాత్మక సంబంధాలు
భారత్-రష్యా సంబంధాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ఆయుధ సరఫరా, చమురు దిగుమతి, అంతరిక్ష పరిశోధన, విద్యుత్ ప్రాజెక్టులు వంటి విభాగాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ, భారత్ మాత్రం మాస్కోతో సాన్నిహిత్యాన్ని కొనసాగించింది. భారతదేశం రష్యా చమురును భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటూ, ఆర్థిక ప్రయోజనాలను పెంచుకుంది.
భారత్‌లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇంధన రంగం, రక్షణ ఉత్పత్తి, వ్యాపార వృద్ధి, కార్మిక మార్పిడి, విద్యా సహకారం వంటి పలు ఒప్పందాలు కుదరే అవకాశం ఉంది. పుతిన్-మోదీ సమావేశం ద్వార ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబరులో భారత్ పర్యటన చేయడం, ఇరుదేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని మరోసారి ప్రతిబింబించనుంది. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త ఒప్పందాలకు దారి తీసే ఈ పర్యటన, భవిష్యత్ భారత్-రష్యా సంబంధాల దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మారనుంది.

