ETV Bharat / international

మరణిశిక్ష విధించే నేరంగా పరిగణిస్తాం- ఇరాన్‌ హెచ్చరిక

ఆందోళనల్లో పాల్గొంటే దేవుని శత్రువుగా, మరణిశిక్ష విధించే నేరంగా పరిగణిస్తామని ఇరాన్‌ అటార్నీ జనరల్‌ హెచ్చరిక

Protests In Iran
Protests In Iran (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 9:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

Protests In Iran : ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకు తీవ్రం కావటంతోపాటు మరిన్ని నగరాలను దిగ్బంధించాలంటూ ప్రవాసంలో ఉన్న యువరాజు పిలుపుతో ఇరాన్‌ అప్రమత్తమైంది. ఆందోళనల్లో పాల్గొంటే దేవుని శత్రువుగా, మరణిశిక్ష విధించే నేరంగా పరిగణిస్తామని ఇరాన్‌ అటార్నీ జనరల్‌ హెచ్చరించారు. అటార్నీ జనరల్‌ చేసిన హెచ్చరికను ఇరాన్‌ ప్రభుత్వ ఛానల్‌ ప్రసారం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేయాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనున్నట్లు అటార్నీ జనరల్‌ హెచ్చరిక ద్వారా ఇరాన్‌ స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇరాన్‌లో దాదాపు రెండువారాలుగా సాగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.

ఇంటర్నెట్, టెలిఫోన్‌ సేవలు నిలిపివేత!
దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్, టెలిఫోన్‌ సేవలను ఇరాన్‌ ప్రభుత్వం ఇదివరకే నిలిపివేసింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియడం కష్టమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే 72 మంది ప్రాణాలు కోల్పోగా, 2300 మందిని భద్రత సిబ్బంది కస్టడీలోకి తీసుకున్నట్లు అమెరికా కేంద్రంగా నడిచే మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. అయితే, వాస్తవంగా మృతుల సంఖ్య దాదాపు 200లకు పైగా ఉండవచ్చని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఇరాన్‌ పౌరులకు అండగా ఉంటామని చెబుతోన్న అగ్రరాజ్యం, నిరసనకారులపై హింసకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని సుప్రీం లీడర్‌ను హెచ్చరిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌తో ఆటలాడొద్దని ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ మంత్రి పేర్కొనడం గమనార్హం. మరోవైపు, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మాత్రం ఆందోళనకారులపై అణచివేత కొనసాగుతుందన్నారు. దేశద్రోహానికి పాల్పడేవారు, అభద్రతను సృష్టించేవారు, విదేశీ ఆధిపత్యాన్ని కోరుకునేవారిపై అభియోగాలు నమోదు చేస్తామని ఇరాన్‌ అటార్నీ జనరల్‌ తెలిపారు. వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. ఈ విషయంలో ఎటువంటి దయ చూపించే ప్రసక్తే లేదన్నారు.

అమెరికా మద్దతు
ఇరాన్‌లో ఆందోళనలు చేస్తున్న వారికి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్‌లోని ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా మద్దతిస్తోందని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో ఎక్స్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో ఇరాన్‌కు అమెరికా విదేశాంగశాఖ హెచ్చరికలు జారీ చేసింది. "అధ్యక్షుడు ట్రంప్‌తో ఆటలాడొద్దు. ఆయన ఎప్పుడైనా ఏదైనా చెబితే ఏదో ఒకటి చేస్తారు " అని స్పష్టంచేసింది. అయితే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా అలీ ఖమేనీ వాటిని లెక్కచేయడం లేదు. నిరసనలను అణచివేసేందుకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని స్పష్టంచేశారు. ప్రవాసంలో తలదాచుకుంటున్న యువరాజు రెజా పహ్లావి పిలుపుతో ఆందోళనలు ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. ఆయనకు అమెరికా మద్దతుంది. ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ విలువ దారుణంగా పడిపోవడంతో డిసెంబరు 28న ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో ఇరాన్‌లోని పలు నగరాలకు విమాన సర్వీసులు రద్దయ్యాయి.

ఇరాన్‌ను చావు దెబ్బకొడతాం
ఇరాన్‌లో నిరసనకారులపై కాల్పులు జరిగితే అమెరికా జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, నిరసనకారులు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం శ్వేతసౌధంలో అగ్రశ్రేణి చమురు, గ్యాస్‌ రంగాల ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌, "ఆ దేశం సమస్యల్లో ఉంది. ఎవరూ ఊహించని నగరాల్లో ప్రజలు నియంత్రణ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. మేం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. గతంలో జరిగినట్లే ప్రజలను చంపడం మొదలుపెడితే మేం జోక్యం చేసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పా " అని పేర్కొన్నారు.

'పుతిన్‌ను కూడా అమెరికా అరెస్ట్ చేస్తుందా?'- ట్రంప్ సమాధానం ఏంటంటే?

ప్రపంచ సైనిక వ్యయం పెరుగుతోంది- శాంతే ఉత్తమ మెడిసిన్​: WHO చీఫ్