ETV Bharat / international

ఇరాన్‌పై మళ్లీ దాడులకు సిద్ధమైన అమెరికా?- ఖమేని​ ప్రభుత్వానికి ట్రంప్​ వార్నింగ్​

ఇరాన్​లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులపై యంత్రాంగం ఉక్కుపాదం - దీనిపై ఇప్పటికే పలుమార్లు టెహ్రాన్​కు ట్రంప్​ హెచ్చరిక - శాంతియుతంగా చేస్తున్న నిరసనలను అణచివేస్తే జోక్యం చేసుకుంటామన్న అమెరికా

AMERICA warning ON IRAN
AMERICA warning ON IRAN (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 3:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

US on Iran Protests : ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అధికార యంత్రాంగం వాటిపై ఉక్కుపాదం మోపుతుండటంతో అమెరికా జోక్యం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టెహ్రాన్‌కు పలుమార్లు హెచ్చరిక చేశారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలను హింసాత్మక చర్యలతో అణిచివేస్తే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. అదే జరిగితే టెహ్రాన్‌ పెద్దకష్టంలో పడినట్లేనని పేర్కొన్నారు. అమెరికా ప్రతిస్పందనలో పదాతి దళాలు పాల్గొనవంటూ ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌కు గట్టి దెబ్బ తగిలేలా దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఎప్పుడూ లేనివిధంగా స్వాతంత్య్రం కోసం ఉద్యమిస్తున్న ఇరాన్‌ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్‌ శనివారం ప్రకటించారు. ఆ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో సంభాషించారు. ఇరాన్‌లో ప్రజా ఆందోళనలు, సిరియా, గాజాలో పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ధైర్యవంతులైన ఇరాన్‌ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని సోషల్​ మీడియాలో రూబియో ఓ పోస్టు పెట్టారు.

నిరసనలు హింసాత్మకంగా చేపడుతున్నారని
టెహ్రాన్‌లో మొదలైన నిరసనలు ఇరాన్‌లోని ఇతర ప్రాంతాలు సహా విదేశాలకు విస్తరించటమే కాకుండా అమెరికా మద్దతు ప్రకటించటంతో సుప్రీం లీడర్‌ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ పేరు ప్రస్తావించకుండా మరోదేశం అధ్యక్షుడిని సంతోషపరించేందుకు ఆందోళనకారులు తమ వీధులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమేనీ ప్రసంగాన్ని రెండు రోజులక్రితం ఇరాన్‌ అధికార ఛానల్‌ ప్రసారం చేసింది. నిరసనలను కట్టడి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించినట్లు సమాచారం.

ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పలుచోట్ల వాహనాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. దీంతో ఇరాన్‌ సైన్యం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వంద మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఆ సంఖ్య చాలా ఎక్కువే ఉంటుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అక్కడి పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలియకుండా ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్‌, అంతర్జాతీయ టెలిఫోన్‌ కాల్స్‌ను నిలిపివేశారు. తాజా పరిణామాల వేళ ఇరాన్ పార్లమెంట్ సమావేశమైంది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించింది. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌ అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చేశారు. పలువురు సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా, తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.

ఇతర దేశాలకూ వ్యాపించిన నిరసన సెగ
ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలు విదేశాలకు సైతం వ్యాపించాయి. లండన్‌లో ఇరాన్‌ ఎంబసీ కార్యాలయం వద్ద నిరసనలు జరిగాయి. ఇరాన్‌ ఎంబసీ బల్కనీపైకి ఎక్కి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ జెండాను తొలగించిన ఆందోళనకారులు, దానిస్థానంలో 1979 నాటి పతాకాన్ని ఎగురవేశారు. పారిస్‌, బెర్లిన్‌ సహా ఐరోపాలోని ప్రధాన నగరాల్లో సంఘీభావ ర్యాలీలు జరిగాయి. ఇరాన్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చటమే కాకుండా విదేశాల్లో కూడా వారికి మద్దతు పెరుగుతుండటంతో, మిలిటరీ చర్య గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా సైన్యం వివరించినట్లు పలువురు అధికారులు న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పారు. దాడులు చేయటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే పరిమితంగా దాడిచేసే అంశాన్ని ట్రంప్‌ సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు సహా ఇరాన్‌ భద్రతాదళాలే లక్ష్యంగా దాడులుచేసే పలు ప్రతిపాదనలను సైన్యం వివరించినట్లు అమెరికా అధికారులు చెప్పారు. పశ్చిమాసియాలోని అమెరికా రాయబార కార్యాలయాలు, భద్రతాదళాలపై టెహ్రాన్‌ ప్రతీకార చర్యలకు అవకాశం లేకుండా దాడులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అగ్రరాజ్యం సైనికాధికారులు తెలిపారు. బలమైన సైనిక చర్య జరపటానికి వీలుగా వనరుల సమీకరణకు కొంత సమయం కావాలని మిలిటరీ కమాండర్లు కోరినట్లు చెప్పారు. మిడ్‌నైట్‌ హ్యామర్‌ పేరుతో ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై 6 నెలల క్రితం దాడులు జరిపిన అమెరికా మళ్లీ ఆ దిశగా చర్చలు జరుపుతోంది.