ETV Bharat / international

బంగ్లాదేశ్​లో​ దీపూ చంద్రదాస్‌ హత్య కేసు- ప్రధాన నిందితుడు అరెస్ట్

యాసిన్‌ అరాఫత్‌ను అరెస్టు చేసిన బంగ్లాదేశ్‌ పోలీసులు- దీపూ హత్యకు ప్రణాళిక చేసి అమలు చేసిన యాసిన్‌- ఆందోళనకారులను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించిన యాసిన్‌

Deepudas Murder Arrested
Deepudas Murder Arrested (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 6:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

Dipu Das Murder Case Suspect Arrest : బంగ్లాదేశ్‌ అల్లర్లలో మైనార్టీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు అయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఉపాధ్యాయుడు యాసిన్‌ అరాఫత్‌ను అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్‌ పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి ప్రణాళికలు చేసి, అమలు చేయడంలో యాసిన్‌ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను రెచ్చగొట్టి వారిని దాడికి ప్రేరేపించినట్లు అనుమానిస్తున్నారు.

ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లలో డిసెంబర్‌ 18న మయమన్‌సింగ్‌ జిల్లాలో ఆందోళనకారులు దీపూ చంద్రదాస్‌పై మూకదాడి చేసి చంపేశారు. పెద్దసంఖ్యలో ఆందోళనకారులను సమీకరించి, దాస్‌పై దాడి చేసేలా యాసిన్‌ వారిని ఊసిగొల్పినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు దాస్‌ను కూడలి వద్దకు లాక్కెళ్లి చెట్టుకు ఉరేసి యాసినే నిప్పంటించినట్లు తెలిపారు. హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన యాసిన్‌ను తాజాగా బంగ్లాదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది?
మృతుడు దీపూ చంద్రదాస్ (27) ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఫ్యాక్టరీ సూపర్వైజర్లు అతన్ని బలవంతంగా రాజీనామా చేయించారు. అతన్ని ఆఫీసు నుంచి బయటకు గెంటేశారు. అప్పటికే బయట కాచుకుని ఉన్న ఆగ్రహించిన ఆందోళనకారులకు అప్పగించారు. దీపూతో పాటు పనిచేసే సహచరులు కూడా ఈ మూకలో చేరి దాడి చేయడం అత్యంత విషాదకరం. అరాఫత్ రెచ్చగొట్టడంతో జనం విచక్షణ కోల్పోయి దాడి చేశారు.

ఇప్పటి వరకు 21 మంది
ఈ కేసును బంగ్లాదేశ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అరాఫత్‌తో కలిపి ఇప్పటివరకు మొత్తం 21 మందిని అరెస్టు చేశారు. అరాఫత్ ప్రభావం ఇంకా ఎవరెవరిపై ఉందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలోనే మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.

వరుస హత్యలతో వణుకుతున్న మైనారిటీలు
దీపూ చంద్రదాస్ ఘటన మరువక ముందే, గత కొద్ది రోజుల్లోనే మరో ఐదుగురు హిందువులు బంగ్లాదేశ్‌లో దారుణ హత్యకు గురయ్యారు. రాజ్‌బారిలో అమృత్ మండల్ అనే వ్యక్తిని గ్రామస్థుల గుంపు కొట్టి చంపింది. మైమెన్‌సింగ్​లో బజేంద్ర బిశ్వాస్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. షరియత్‌పుర్​లో న్యూ ఇయర్ రోజున ఖోకన్ చంద్రదాస్ అనే హిందూ వ్యాపారిని కత్తితో పొడిచి నిప్పంటించారు. చికిత్స పొందుతూ ఆయన ఢాకాలో మరణించారు. జెస్సోర్​లో తాజాగా సోమవారం రాణా ప్రతాప్ అనే పత్రికా ఎడిటర్, వ్యాపారిని దుండగులు కాల్చి చంపారు. నవోగావ్​లో దొంగతనం అనుమానంతో స్థానికులు తరుముతుండగా, భయంతో చెరువులో దూకిన ఓ 25 ఏళ్ల హిందూ యువకుడు మునిగి చనిపోయాడు.

రాజకీయ రణరంగం, బీఎన్‌పీ నేత కాల్చివేత
ఒకవైపు మతపరమైన దాడులు జరుగుతుండగా, మరోవైపు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి చెందిన కీలక నేత అజీజుర్‌ ముసబ్బిర్‌ ప్రాణాలు కోల్పోయారు. అజీజుర్‌ గతంలో బీఎన్‌పీకి చెందిన 'ఢాకా మెట్రోపాలిటన్‌ నార్త్‌ స్వచ్ఛసేవక్‌ దళ్‌'కు ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఢాకాలోని కర్వాన్‌ బజార్‌ వద్ద ఓ హోటల్‌ సమీపంలో ఈ దారుణం జరిగింది. దుండగులు అతిదగ్గర నుంచి అజీజుర్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఉద్రిక్తతలు, నిరసనలు
ఈ కాల్పుల ఘటనలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదు. అజీజుర్‌ హత్య వార్త తెలియగానే బీఎన్‌పీ కార్యకర్తలు భగ్గుమన్నారు. పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. భద్రతాధికారులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు బంగ్లాదేశ్ ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి.