ETV Bharat / international

ఇజ్రాయెల్​ పార్లమెంటులో మోదీ ప్రసంగం- భారత తొలి ప్రధానిగా రికార్డ్

ఇజ్రాయెల్‌ పర్యటనలో మోదీ- అక్కడి పార్లమెంటులో భారత ప్రధానికి స్టాండింగ్‌ ఒవేషన్‌- ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ స్పీచ్!

PM Modi Israel Visit
PM Modi Israel Visit (Source : AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 10:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi Israel Visit 2026 : ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించరాదని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. రెండు రోజుల ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్‌లో చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్‌ పార్లమెంటులో మాట్లాడిన భారత తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఉద్వేగభరిత ప్రసంగం చేసిన ప్రధాని మోదీ ఇరుదేశాల సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఇజ్రాయెట్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ చేసిన కృషి ఆమోఘమని చెప్పారు.

భారత్‌ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి ఇజ్రాయెల్‌ ఒక మంచి స్నేహితుడి మాదిరిగా అండగా నిలిచిందని చెప్పారు. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లను అధిగమించి భారత్‌కు భరోసాను ఇచ్చిందన్నారు. భారత్‌ సుదీర్ఘ కాలం నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, ఈ మహమ్మారిని అణిచివేసేందుకు భారత్ చేస్తున్న కృషికి ఇజ్రాయెల్‌ ఎప్పుడూ అండగా ఉందన్నారు. భారత్‌ కూడా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించి తీరాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు.

'పౌరుల హత్యను ఏ కారణమూ సమర్థించలేదు. ఉగ్రవాదాన్ని ఏదీ కూడా సమర్థించలేదు. భారతదేశం కూడా సుదీర్ఘ కాలంగా ఉగ్రవాద బాధను అనుభవించింది. 26/11 ముంబయి దాడులను, అందులో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్ పౌరులతో సహా అమాయకులను మేం గుర్తు చేసుకుంటాము. మీలాగే, మేము కూడా ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలు లేకుండా, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అనే స్థిరమైన, రాజీలేని విధానంతో ఉన్నాము'

'సమాజాలను అస్థిరపరచడం, అభివృద్ధిని అడ్డుకోవడం, నమ్మకాన్ని దెబ్బతీయడమే ఉగ్రవాదం లక్ష్యం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి నిరంతరం సమన్వయంతో కూడిన ప్రపంచ స్థాయి చర్య అవసరం. ఎందుకంటే ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా అది ప్రతిచోటా శాంతికి విగాతం కలిగిస్తుంది. అందుకే శాశ్వత శాంతికి, ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు భారత్​ మద్దతు ఇస్తుంది' అని మోదీ పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రధాని నరేంద్ర మోదీకి 'స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ పతకాన్ని' ప్రదానం చేసింది.

అంతకుముందు పార్లమెంటులో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. భారత్‌తో ఇజ్రాయెల్‌ మధ్య వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయని ఆయన వెల్లడించారు. భారత్‌తో సన్నిహిత సంబంధాలు సైతం మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన ఎంతో సంతోషదాయకం అని అన్నారు. మోదీ స్నేహితుడి కంటే ఎక్కువ తన సోదరుడు అని పేర్కొన్నారు. చాలా విషయాల్లో తామిద్దరు సోదరులమని అన్నారు. అలాగే గతేడాది మోదీ ఇజ్రాయెల్ పర్యటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేమన్న నెతన్యాహు ఇరు దేశాల ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని వివరించారు.

'మనవి రెండు ప్రాచీన నాగరికతలు. కాలక్రమంలో ఎన్నో కష్టనష్టాలను, సవాళ్లను ఎదుర్కొంటూ సుదీర్ఘ ప్రయాణం చేశాం. ఐనప్పటికీ ఎనభై ఏళ్ల క్రితం, మనం ఒకే సమయంలో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం సాధించాం. మనకు ఎన్నో ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. మనవి రెండు ప్రజాస్వామ్య దేశాలు. మీరు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇజ్రాయెల్ కూడా అటువంటిదే. మరే ఇతర దేశం ఎదుర్కోని సవాళ్లు మధ్య మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం మన మధ్య ఉన్న ఈ లోతైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాం' అని నెతన్యూహు అన్నారు.

కాగా, రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ ఇజ్రాయెల్​కు వెళ్లారు. ఆయన బుధవారం సాయంత్రం టెల్‌ అవీవ్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. ప్రోటోకాల్‌ పక్కనపెట్టి మరీ మోదీకి వెల్​కమ్ చెప్పారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్‌ కార్పెట్‌తో సైనిక గౌరవ వందనం సమర్పించింది.