ETV Bharat / international

'రామాయణం, మహాభారతం మన బంధానికి పునాది'- ఇండోనేసియా పార్లమెంటులో మోదీ కీలక వ్యాఖ్యలు

ఇండోనేసియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం- రెండు దేశాల ప్రాచీన, సాంస్కృతిక, చారిత్రాత్మక బంధాల ప్రస్తావన- సముద్రం విడదీయలేదు కలిపిందని వ్యాఖ్యలు

Prime Minister Narendra Modi
Prime Minister Narendra Modi (Photo/ANI/DD)
author img

By ETV Bharat Telugu Team

Published : July 7, 2026 at 4:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

PM Modi Address To Indonesian Parliament : ఇండోనేసియా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ- ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఇండోనేసియా సంబంధాల చారిత్రక, సాంస్కృతిక, వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని వివరించారు. రెండు దేశాల మధ్య బంధం సముద్రంతో కాకుండా వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వంతో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. సముద్రం ఎప్పుడూ రెండు దేశాల్ని విడదీయలేదని, అది ఎప్పటికీ రెండు దేశాల అనుబంధానికి వారధిగా నిలిచిందని చెప్పారు. ఇండోనేసియా పార్లమెంట్ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ- ప్రబోవో సుబియాంటోతో జరిగిన చర్చలు ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. 2018లోనే ప్రారంభమైన ఈ భాగస్వామ్యం ఇప్పుడు అభివృద్ధి, భద్రత, సాంకేతికత, విద్య, సంస్కృతి వంటి ఎన్నో రంగాలకు విస్తరించిందన్నారు.

ఈ సందర్భంగానే రామాయణం, మహాభారతం రెండు దేశాల బంధానికి పునాది అని వ్యాఖ్యానించారు మోదీ. 'భారత్- ఇండోనేసియాను కేవలం సముద్రం మాత్రమే కలపలేదు. మనకు ఉమ్మడి చరిత్ర ఉంది. రామాయణం, మహాభారతం, నలందా విజ్ఞాన సంపద మన బంధానికి పునాది. వయాంగ్ కళారూపం, నృత్యం, సంగీతం, బొరోబుదూర్, ప్రంబనన్ వంటి అద్భుత కట్టడాలు మన సాంస్కృతిక అనుబంధానికి నిదర్శనం. ఇండోనేసియా జాతీయ చిహ్నమైన గరుడ, బాలి యాత్ర ఉత్సవం కూడా మన మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తాయి' అని మోదీ పేర్కొన్నారు.

క్రుపుక్, పాపడ్- ఏదీ క్రిస్పీగా ఉంటుంది?
మోదీ ప్రసంగంలో ఆహార సంస్కృతి గురించి కూడా ప్రస్తావించారు. 'ఇండోనేసియా క్రుపుక్ లేదా మన పాపడ్ (అప్పడం) ఏది ఎక్కువగా కరకరలాడుతుంది (క్రిస్పీ) అంటే చెప్పడం కష్టం. కానీ మసాలాలు, బుంబు (సుగంధ ద్రవ్యాలు) మాత్రం రెండు దేశాల జీవితాల్లో అంతర్భాగంగా మారిపోయాయి' అని వ్యాఖ్యానించారు. భారత్ రాజధాని, ఇండోనేసియా రాజధాని మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ సముద్ర మార్గంలో కేవలం 150 కిలోమీటర్ల దూరమే ఉందని మోదీ గుర్తు చేశారు. చాలా దేశాలకు సముద్రమే సరిహద్దు అని, కానీ భారత్- ఇండోనేసియా మధ్య సముద్రం ఎప్పుడూ విభజనకు చిహ్నం కాదన్నారు. అదే మనల్ని కలిపే వంతెన అని, అదే మన భవిష్యత్తుకు కేంద్ర బిందువు అన్నారు ప్రధాని.

'ఇరు దేశాల బంధాన్ని కొత్త శిఖరాలకు చేరుద్దాం'
'ఇండియా, ఇండోనేసియా, ఇండియన్ ఓషియన్ (హిందూ మహాసముద్రం)- ఈ పేర్లే మన మధ్య ఉన్న గాఢమైన చారిత్రక బంధానికి సాక్ష్యం. వేల సంవత్సరాలుగా మన నౌకాశ్రయాలు ప్రపంచాన్ని అనుసంధానించాయి. మన నౌకలు వాణిజ్యంతో పాటు సంస్కృతిని కూడా ప్రపంచ నలుమూలలకు చేర్చాయి. సముద్ర సంబంధాల ద్వారా భవిష్యత్తులో అపార అవకాశాలు ఉన్నాయి. ఈ విశాలమైన మహాసముద్రాన్ని స్ఫూర్తిని తీసుకొని భారత్- ఇండోనేసియా సంబంధాల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం' అని పిలుపునిచ్చారు.

ఇక భారత్ ఎప్పుడూ విస్తరణ వాదాన్ని అనుసరించలేదని, అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని స్పష్టం చేశారు. ''సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అనే సిద్ధాంతంతో అందరి భాగస్వామ్యంతో అందరి అభివృద్ధే భారత్ లక్ష్యం' అనే సందేశంతో నేను మీ ముందుకు వచ్చాను'' అని మోదీ పేర్కొన్నారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఆసియాన్‌లో (ASEAN) కీలక పాత్రకు భారత్ ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని మోదీ స్పష్టం చేశారు. సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక సహకారంతో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు.

ఈ పర్యటనలో భారత్- ఇండోనేసియా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇండోనేసియా ఎన్నికల వ్యవస్థ ఆధునీకరణ కోసం భారత ఓటింగ్ సాంకేతికతను అందించడంపై అంగీకారం కుదిరింది. ఈ శతాబ్దం తొలి 25 సంవత్సరాలు పూర్తయ్యాయని, రానున్న 25 ఏళ్లు భారత్- ఇండోనేసియా రెండింటికీ అత్యంత కీలకమని మోదీ పేర్కొన్నారు. 'ఇండోనేసియా గొప్ప నేలపై నిలబడి ఉమ్మడి అభివృద్ధిపై విశ్వాసంతో వచ్చాను. రెండు దేశాలు కలిసి మానవాళికి సేవ చేయాలనే సంకల్పంతో వచ్చాను' అని చెప్పారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి తప్పిన పెను ప్రమాదం- మెక్రాన్‌ బసచేసిన హోటల్ వద్ద భారీ పేలుడు

మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం- బ్రహ్మోస్​తో సహా 20 కీలక ఒప్పందాలు ఖరారు