'ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడు ఇంకా ఎందుకు బతికి ఉన్నాడు'- ట్రంప్ మరణాన్ని కోరిన ఇరానీయన్లు
ఖమేనీ అంత్యక్రియల్లో ఉద్రిక్త వాతావరణం- 'అమెరికా, ఇజ్రాయెల్ నశించాలి' అంటూ నినాదాలు- ఖమేనీని గౌరవిస్తూ బ్యానర్లు, జెండాలు పట్టుకుని ప్రదర్శనలు

Published : July 5, 2026 at 10:18 AM IST
Iranians Wants Trump Death : ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖమేనీ అంతక్రియలకు హాజరైన లక్షలాది మంది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చాలంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు. ట్రంప్ మరణాన్ని కోరుతూ నినాదాలు చేశారు.
అంత్యక్రియల వేడుకలో ప్రదర్శన ఇచ్చిన మహమ్మద్ రసూలీ అనే కవి, ట్రంప్‌ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడైన ఆ వ్యక్తి (ట్రంప్) ఇంకా ఎందుకు బతికే ఉన్నాడు?" అని ప్రశ్నించాడు. ఆ వ్యాఖ్యలతో అక్కడున్న లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా పెద్ద పెట్టున కేకలు వేస్తూ 'అమెరికా నశించాలి', 'ఇజ్రాయెల్ నశించాలి' అంటూ నినాదాలు చేశారు. నల్లటి దుస్తులు ధరించిన ఇరాన్ ప్రజలు ఖమేనీని గౌరవిస్తూ బ్యానర్లు, జెండాలు పట్టుకుని ప్రదర్శనలు చేపట్టారు. అయితే, సరిగ్గా అదే సమయంలో వాషింగ్టన్‌లో అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో ట్రంప్ పాల్గొని ఉండటం గమనార్హం.

ట్రంప్, నెతన్యాహులను చంపాలని పిలుపునిచ్చే పోస్టర్లు, గోడరాతలు కనిపించాయి. అలాగే, ఈ అంత్యక్రియల్లో ఒక వ్యక్తి ట్రంప్ మరణం గురించి నేరుగా పిలుపునివ్వడం ఇదే తొలిసారి. మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధానికి శాశ్వత ముగింపు కోసం టెహ్రాన్, అమెరికా మధ్య చర్చలు జరుపుతున్నప్పటికీ, ఈ కఠిన వైఖరితో కూడిన డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఇక, ఖమేనీ అంతక్రియల కార్యక్రమంలో ఖమేనీ కుమారులు మసూద్, మీసం, మోస్తఫాలతో పాటు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలీబఫ్, రివల్యూషనరీ గార్డ్ అధిపతి జనరల్ అహ్మద్ వహిదీతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిగిన వైమానిక దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అనంతరం సుదీర్ఘ కాలం పాటు యుద్ధం కొనసాగడం వల్ల ఈ అంత్యక్రియలు ఆలస్యమయ్యాయి. అయితే, ఖమేనీ అంతక్రియల్లో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పాల్గొనలేదు. ఖమేనీ మరణానంతరం ఆయన అజ్ఞాతంలో ఉన్నారని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆయన్ని కూడా చంపుతామని గతంలో హెచ్చరించింది.
'అంతర్జాతీయ సంస్థలు విఫలమయ్యాయి'
ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ చర్యలపై అంతర్జాతీయ సంస్థల మౌనాన్ని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. ఆ ప్రాంతంలో మేధావులు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రభావవంతులైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే, ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతున్న అమెరికాను విమర్శించారు. మానవ హక్కులను పరిరక్షిస్తామని చెప్పుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ సంస్థలు ఇటువంటి చర్యలను నిరోధించడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. శనివారం(స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఇస్లామిక్ వర్గాలు, జాతి సమూహాల మధ్య అంతర్గత విభేదాలను, బాహ్య శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని పెజెష్కియాన్ హెచ్చరించారు. ఒకవేళ ముస్లిం దేశాలు కలసి కట్టుగా వ్యవహరిస్తే, గాజా, లెబనాన్, పాలస్తీనాలో ఘర్షణలు, మానవతా సంక్షోభాలు కొనసాగలేవని ఆయన స్పష్టం చేశారు.
ఇక, ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణం గురించి ప్రస్తావిస్తూ, ఖమేనీ మరణం తమకు తీరని లోటైనప్పటికీ, ఆయన అందించిన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పెజెష్కియాన్ తెలిపారు. న్యాయం, ధర్మం, ప్రతిఘటన సాధనలో భవిష్యత్ తరాలను ప్రేరేపిస్తూనే ఉంటాయన్నారు.
ఇరాన్ అధ్యక్షుడి సందేశాలను అనసరించడానికి, ఇస్లామిక్ ఐక్యతను బలోపేతం చేయడానికి, అలాగే, శాంతిని పెంపొందించడానికి ఇరాన్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ముస్లిం దేశాలు ఉమ్మడి విలువలతో, సామూహిక సంకల్పంతో ఐక్యతతో ఉంటే, ఏ బాహ్య శక్తి కూడా వారి పురోగతిని ఆపలేదని పేర్కొన్నారు.
'అమెరికా ఎన్నడూ లేనంత బలంగా ఉంది'- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రంప్
బాస్ ఎవరో నెతన్యాహుకు బాగా తెలుసు- ఒక్కదెబ్బతో ఇరాన్ నేతలందరినీ చంపేసేవాళ్లం: ట్రంప్

