ETV Bharat / international

ఇరాన్​పై యుద్ధంలో బ్రిటన్ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​- ముస్లిం ఓట్ల కోసం స్టార్మర్​ పాకులాడుతున్నారని ఆరోపణ

ఇరాన్​పై ఇజ్రాయెల్​, అమెరికా దాడులు- అగ్రరాజ్యానికి మద్దతుగా యుద్ధంలో చేరని బ్రిటన్​- బ్రిటన్ ప్రధాని స్టార్మర్​పై ట్రంప్​ విమర్శలు

US President Trump and UK PM Starmer
US President Trump and UK PM Starmer (Associate Press)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 4:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Trump Criticises UK PM Starmer : ఇరాన్​పై అమెరికా జరుపుతున్న దాడుల్లో బ్రిటన్ భాగస్వామి కాకపోవడంపై యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశంలోని ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సోమవారం (యూఎస్ కాలమానం ప్రకారం) బ్రిటన్​కు చెందిన ఓ ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

"బ్రిటన్ ఇకపై గుర్తించదగిన దేశం కాదు. ప్రధాని స్టార్మర్​ ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నారు. ఆయన మాకు ఏ మాత్రం సహకరించలేదు. బ్రిటన్​ నుంచి మాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మేము బ్రిటన్​ను చాలా ప్రేమిస్తాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

బ్రిటన్ ప్రధాని రాజకీయ కారణాలతో ముస్లిం ఓటర్ల కోసం ప్రాకులాడుతున్నారా? అని విలేకరి ప్రశ్నించగా, "అది నిజం కావచ్చు" అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. "లండన్ ఇప్పుడు చాలా మారిపోయింది. అక్కడ ఒక భయంకరమైన మేయర్​ (సాదిఖ్​ ఖాన్​) ఉన్నాడు. అక్కడ ఇంకొంత మంది వ్యక్తులు ఉన్నారు. లండన్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రదేశం" అని ట్రంప్ విమర్శలు గుప్పించారు.

స్టార్మర్​ ఏమన్నారంటే?
వాస్తవానికి ఇంతకు ముందు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్​ హౌస్​ ఆఫ్ కామన్స్​లో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణంపై మాట్లాడారు. "ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో యునైటెడ్ కింగ్​డమ్ పాల్గొనలేదు. ఇది కావాలనే తీసుకున్న నిర్ణయం. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గమని నేను భావిస్తున్నాను. అలాగే ఇరాన్ తన అణ్వస్త్ర ఆకాంక్షలను విరమించుకోవాలి. అలాగే పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమయ్యే కార్యకలాపాలన్నింటినీ ఇరాన్ ఆపేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది బ్రిటన్ ప్రభుత్వ దీర్ఘకాలిక విధానం" అని కీర్ స్టార్మర్​ అన్నారు. అలాగే ట్రంప్ చేసిన విమర్శలపై స్టార్మర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

"మా నిర్ణయం పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ బ్రిటన్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏది సరైనదో, దాన్నే నిర్ణయించడం నా బాధ్యత. అందుకే ఇరాన్​పై దాడి చేయకూడదనే నిర్ణయానికే నేను కట్టుబడి ఉన్నాను."
- కీర్ స్టార్మర్​, బ్రిటన్ ప్రధాని

మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడాన్ని​ కీర్ స్టార్మర్ తప్పుపట్టారు. అది బ్రిటన్ మిత్రదేశాలకు, వాటి ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.

బ్రిటీష్ మిలటరీ బేస్​ల విషయం ఏమిటి?
అమెరికా తమ దాడుల కోసం బ్రిటీష్ స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతి కోరినట్లు స్టార్మర్​ ధ్రువీకరించారు. అయితే తమ మిలటరీ బేస్​లు కేవలం 'రక్షణాత్మక ప్రయోజనాల' కోసం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. "ఇరాన్ క్షిపణులు సామాన్యులను, బ్రిటీష్ పౌరులను చంపకుండా, మా మిత్రదేశాల్లో విధ్వంసం సృష్టించకుండా ఆపే శక్తి, సామర్థ్యాలు అమెరికా వద్ద ఉన్నాయి. అందుకే బ్రిటీష్ స్థావరాల వినియోగాన్ని కేవలం రక్షణాత్మక చర్యలకే పరిమితం చేశాం. ఇరాన్​పై అమెరికా చేసే దాడుల్లో యూకే పాల్గొనదు" అని ఆయన తేల్చిచెప్పారు.

రగులుతోన్న పశ్చిమాసియా
ఫిబ్రవరి 28న ఇరాన్​పై ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేశాయి. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ/ రోరింగ్ లయన్​' పేరుతో ఇరాన్​లోని కీలక సైనిక, అణు స్థావరాలపై దాడి చేశాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్​ ఖమేనీని అతని కార్యాలయంలోనే అంతమొందించాయి. దీనితో టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్​తో పాటు, అమెరికా సైనిక స్థావరాలు కలిగిన బహ్రెయిన్​, కువైట్​, ఖతార్, యూఏఈ, జోర్డాన్​లపై క్షిపణులతో, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనితో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ దేశాలు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం చేసుకోవాలని చెబుతున్నప్పటికీ, యుద్ధం మాత్రం భయంకరంగా కొనసాగుతూనే ఉంది.

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్‌ అణుశుద్ధి కర్మాగారం- ధ్రువీకరించిన ఐఏఈఏ

అప్పుడు ఉక్రెయిన్​లో విధ్వంసం- ఇప్పుడు గల్ఫ్​ దేశాలకు గుబులు - 'చీప్' డ్రోన్స్​తో ఇరాన్​ ఖరీదైన యుద్ధం