ETV Bharat / international

పాక్ vs అఫ్గాన్- ఎవరి సైనిక శక్తి ఎంత? అణ్వాయుధాలు, యుద్ధ విమానాల లెక్క ఇదే!

పాక్, అఫ్గాన్ బార్డర్‌లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు- ఆర్మీ పోస్ట్‌లు లక్ష్యంగా గురువారం రాత్రంతా పరస్పర దాడులు- ఘజబ్ లిల్ హఖ్ పేరుతో పాక్ సైనిక చర్య

Afghanistan Taliban Soldiers
Afghanistan Taliban Soldiers (Source : AP, AFP (File)))
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 8:30 PM IST

7 Min Read
Choose ETV Bharat

Pakistan Army vs Afghanistan Army : పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజులో సైనిక ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఓపెన్ వార్ జరుగుతోందని స్వయంగా పాక్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ వెల్లడించారు. ఫిబ్రవరి 22న అఫ్గానిస్థాన్‌లోని నాన్ గర్హర్, పక్‌టీకా ప్రావిన్స్‌లపై పాక్ చేసిన వైమానిక దాడులకు, ఫిబ్రవరి 26న (గురువారం) రాత్రి తాలిబన్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. 19 పాక్ ఆర్మీ పోస్టులను దహనం చేసి, 55 మంది పాక్ సైనికులను హతమార్చామని తాలిబన్లు ప్రకటించారు.

ఈ ఎటాక్‌‌కు తక్షణ స్పందనగా గురువారం అర్ధరాత్రి అఫ్గానిస్థాన్‌లోని కాబూల్, కాందహార్, పక్టియాలలోని తాలిబన్ సైనిక స్థావరాలపై బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో 133 మంది తాలిబన్లు హతం కాగా, 200 మందికి గాయాలయ్యాయని పాక్ వెల్లడించింది. ఈ సైనిక ఘర్షణల్లో ఎవరికి ఎంత నష్టం జరిగింది? దీనిపై పాక్, అఫ్గానిస్థాన్‌ వాదోపవాదనలు ఎలా ఉన్నాయి ? అఫ్గానిస్థాన్‌‌పై పాక్ జరిపిన వైమానిక దాడులకు ఆపరేషన్ 'ఘజబ్ లిల్ హఖ్' అనే పేరును ఎందుకు పెట్టారు? సైనికశక్తి లెక్కల్లో ఈ రెండు దేశాల బలాబలాలు ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏమిటీ ఘజబ్ లిల్ హఖ్ ?
గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పాక్, అఫ్గానిస్థాన్ బార్డర్ కాల్పుల మోతతో అట్టుడికింది. ఇరుదేశాల సైన్యాలు భీకరంగా తలపడ్డాయి. సరిహద్దుల్లోని ఆర్మీ పోస్ట్‌లు లక్ష్యంగా పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో ఇరువైపులా భారీ నష్టం జరిగింది. అఫ్గానిస్థాన్ ఆర్మీకి పెద్దగా యుద్ధ విమానాలు లేవు. కానీ, పాక్‌ ఆర్మీ అమ్ముల పొదిలో వందలాది ఫైటర్ జెట్స్ ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి సమయానికి బార్డర్‌లో సైనిక ఘర్షణ తారస్థాయికి చేరింది.

దీంతో పెద్దసంఖ్యలో పాక్ యుద్ధ విమానాలు అఫ్గానిస్థాన్ గగనతలంలోకి చొరబడ్డాయి. కాబూల్, కాందహార్, పక్టియాలలోని తాలిబన్ సైనిక స్థావరాలపైకి అవి బాంబులను జారవిడిచాయి. ఈ సైనిక ఆపరేషన్‌కు 'ఘజబ్ లిల్ హఖ్' అనే పేరును పాక్ ఆర్మీ పెట్టింది. 'ధర్మాగ్రహం' అని దీని అర్థం. సరిహద్దుల్లో తాలిబన్ల ఆగడాలకు ప్రతిగానే ఈ దాడి చేశామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వాదనను బలపర్చుకుంటూ సైనిక చర్యకు 'ఘజబ్ లిల్ హఖ్' (ధర్మాగ్రహం) అనే పేరును పెట్టింది.

సైనిక చర్యపై పాక్ ప్రకటన ఇదీ
శుక్రవారం ఉదయం 'ఘజబ్ లిల్ హఖ్'‌పై కీలక వివరాలను పాకిస్థాన్ సమాచారశాఖ మంత్రి అతావుల్లా తరార్ మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 133 మంది ఆఫ్గన్ తాలిబన్లు హతమయ్యారని, 200 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు. చనిపోయిన తాలిబన్ల సంఖ్య మరింత పెరగొచ్చన్నారు. పాక్ బార్డర్‌లోని 27 తాలిబన్ పోస్ట్‌లను ధ్వంసం చేశామని, మరో తొమ్మిది పోస్ట్‌లను స్వాధీనం చేసుకున్నామని తరార్ పేర్కొన్నారు.

పాక్ దాడుల్లో తాలిబన్లకు చెందిన 2 కార్ప్స్ ప్రధాన కార్యాలయాలు, 3 బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, 2 మందుగుండు సామగ్రి డిపోలు, ఒక లాజిస్టిక్స్ బేస్, 3 బెటాలియన్ ప్రధాన కార్యాలయాలు, 2 సెక్టార్ ప్రధాన కార్యాలయాలు ధ్వంసం అయ్యాయని ఆయన చెప్పారు. ఆఫ్గానిస్థాన్‌లోని 80కిపైగా యుద్ధ ట్యాంకులు, ఆర్టిల్లరీ తుపాకులు, సాయుధ సిబ్బంది వాహనాలను కూడా ధ్వంసం చేశామన్నారు.

తాలిబన్, భారత్ కవ్వింపులను ఒకేసారి ఎదుర్కొనేందుకు సిద్ధం : పాక్
ఇక తమ సహనం నశించిపోయిందని, అఫ్గానిస్థాన్ ఆగడాలను చూస్తూ ఊరుకునేది లేదని పాక్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పాక్, అఫ్గానిస్థాన్ యుద్ధంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. పాక్‌లోకి తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు చొరబడుతుంటే, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ పాలకులు ఆపడం లేదని ఆరోపించారు. సరిహద్దుల్లో పాక్ సైన్యాన్ని తాలిబన్లు కవ్విస్తున్నారని ఖాజా ఆసిఫ్ మండిపడ్డారు. భారత్‌కు ప్రాక్సీగా తాలిబన్లు మారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఏకకాలంలో తాలిబన్, భారత్ కవ్వింపులను ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు.

చొరబాటుకు పాక్ యత్నం- అందుకే ఎటాక్ చేశాం : అఫ్గానిస్థాన్
గురువారం రాత్రి 8.00 గంటలకు పాక్ దళాలు తమ దేశంలోకి చొరబడేందుకు యత్నించగా, తాము దాడులు చేశామని అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ మీడియాకు వెల్లడించింది. బార్డర్‌లో పాక్టికా, పాక్టియా, ఖోస్ట్, నంగర్హార్, కునార్, నురిస్తాన్ ప్రావిన్సుల సమీపంలో ఉన్న పాక్ సైనిక పోస్టులపై దాడులు చేశామని తెలిపింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో 55 మంది పాక్ సైనికులు చనిపోయారని చెప్పింది.

ఈ ఆపరేషన్‌లో 2 పాక్ సైనిక స్థావరాలు, 19 మిలిటరీ పోస్ట్‌లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. మరో నాలుగు సైనిక స్థావరాల నుంచి పాక్ సైనికులు పారిపోయారని అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. పాక్‌కు చెందిన ఒక యుద్ధ ట్యాంకును ధ్వంసం చేశామని, మరొక పెద్ద సైనిక రవాణా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఫిబ్రవరి 22న పాక్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లోనూ అఫ్గానిస్థాన్‌కు చెందిన మహిళలు, పిల్లలు చనిపోయారని అఫ్గానిస్థాన్ రక్షణ శాఖ గుర్తుచేసింది.

బలంగా పాక్- అఫ్గాన్ అంతంతగానే
లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డేటా ప్రకారం, సైనిక బలం విషయంలో అఫ్గానిస్థాన్‌ కంటే పాక్ చాలా మెరుగ్గా ఉంది. చైనా నుంచి పాక్‌కు పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలు అందుతున్నాయి. తన ఆయుధాలను పాక్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇక 2021 నుంచి అఫ్గానిస్థాన్‌‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటివరకు తాలిబన్ ప్రభుత్వానికి చాలాదేశాల గుర్తింపు లభించలేదు. ఆయుధాల సంగతిని అలా ఉంచితే, తాలిబన్లకు కనీసం అప్పులు ఇవ్వడానికీ ఏ దేశాలూ ముందుకు రావడం లేదు.

గతంలో అఫ్గానిస్థాన్‌ గడ్డపై రష్యా సేనలు, అమెరికా సేనలు సైనిక స్థావరాలను నిర్వహించాయి. అవి అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో కొన్ని యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రైఫిల్స్, ఫిరంగీలను వదిలి వెళ్లాయి. ఇప్పుడు వీటినే తాలిబన్ ఆర్మీ వినియోగిస్తోంది. వీటికి మరమ్మతులు చేసేందుకూ ఏ దేశమూ తాలిబన్లకు సహకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో పాక్‌ను తాలిబన్లు సైనికంగా దీర్ఘకాలం పాటు ఎదుర్కోవడం కష్టమేనని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నిపుణులు అంటున్నారు.

సైనిక శక్తిలో పాక్ VS అఫ్గానిస్థాన్‌‌

  • ప్రపంచ ర్యాంకు : సైనిక శక్తిపరంగా ప్రపంచంలో పాకిస్థాన్‌కు 9వ ర్యాంకు ఉంది. అఫ్గానిస్థాన్‌‌ ర్యాంకు 55
  • సైనికుల సంఖ్య : పాక్‌‌కు 6.60 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. వీరిలో 5.60 లక్షల మంది ఆర్మీలో, మిగతావారు ఇతర సరిహద్దు భద్రతా విభాగాల్లో ఉన్నారు. అఫ్గానిస్థాన్‌‌‌కు దాదాపు 1.72 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు
  • సాయుధ వాహనాలు : పాక్ వద్ద 6వేలకుపైగా సాయుధ వాహనాలు, 4,600కుపైగా ఫిరంగి(ఆర్టిల్లరీ) యూనిట్లు ఉన్నాయి. గతంలో అమెరికా వదిలివెళ్లిన హై మొబిలిటీ మల్టీ పర్పస్ వీల్డ్ వెహికల్ (హమ్వీ) సాయుధ వాహనాలు, ఎం4 కార్బైన్‌లను తాలిబన్లు వినియోగిస్తున్నారు. తాలిబన్ల వద్ద అతికొద్ది సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. కచ్చితంగా వాటి సంఖ్య తెలియదు
  • యుద్ధ విమానాలు : పాక్ వద్ద 465 యుద్ధ విమానాలు ఉన్నాయి. తాలిబన్ల వద్ద సోవియట్ కాలం నాటి 6 యుద్ధ విమానాలు ఉన్నాయి. అవి పనిచేయడం లేదని సమాచారం. ఈ లెక్కన వాళ్ల దగ్గర ఫైటర్ జెట్స్ లేనట్టే
  • హెలికాప్టర్లు : పాక్ వద్ద 260కిపైగా సైనిక హెలికాప్టర్లు ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌‌‌ వద్ద సోవియట్ కాలం నాటి 23 హెలికాప్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో ఎన్ని ఎగిరే స్థితిలో ఉన్నాయో తెలియదు
  • అణ్వాయుధాలు : పాక్ వద్ద 170 న్యూక్లియర్ వార్ హెడ్‌లు ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌‌‌ వద్ద అణ్వాయుధాలు లేవు
  • గెరిల్లా పోరాట వ్యూహం : గెరిల్లా పోరాట వ్యూహ రచనను పకడ్బందీగా అమలు చేసే విషయంలో తాలిబన్లు దిట్టలు. ఈ వ్యూహంతోనే వాళ్లు గతంలో 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీతో తలపడ్డారు. ఈ అంశం సరిహద్దుల్లో పాక్‌ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ తెలిపింది. పాక్‌‌కు చెందిన సరిహద్దు ఆర్మీ పోస్ట్‌లకు తాలిబన్లు భారీ నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇందుకోసం గెరిల్లా పోరాట వ్యూహాలను తాలిబన్లు అమలు చేస్తున్నారు

అఫ్గాన్లు మాతృభూమిని కాపాడుకుంటారు- పాక్ దాడులను ఐకమత్యం, సాహసాలతో ఎదుర్కొంటారు: హమీద్ కర్జాయ్

అఫ్గాన్​- పాక్​ మధ్య యుద్ధం- పరస్పర దాడుల్లో వందకు పైగా మృతి!