సింధూ జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గని భారత్- అంతర్జాతీయ వేదికపై మొర పెట్టుకుంటున్న పాక్
సింధు జలాల నిలిపివేతపై మరోసారి తమ ఆందోళన వ్యక్తం చేసిన పాక్- ఈ విషయంపై అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్రయించిన దాయాది దేశం- నీటి భద్రత అనేది తమ దేశ స్థిరత్వానికి కేంద్ర బిందువని వ్యాఖ్య

Published : August 29, 2026 at 7:14 AM IST
Pakistan Pleads Indus Waters : సింధు జలాల నిలిపివేత ఒప్పంద విషయంలో భారత్ తన దృఢ వైఖరిని కొనసాగిస్తోంది. అయితే, జలాల నిలిపివేత కారణంగా పెరుగుతున్న దేశీయ బలహీనతలు, దౌత్యపరమైన ఒంటరితనంపై పాకిస్థాన్ మరోసారి తమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్రయించింది. భారత్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ఒప్పందంలో ఎలాంటి ఆధారం లేదని విమర్శించింది. నీటి భద్రత అనేది తమ దేశ స్థిరత్వానికి కేంద్ర బిందువని, ఈ నిర్ణయం వల్ల విస్తృత పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం నిర్వహించిన వర్చువల్ సెమినార్లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"సింధు నదీ పరివాహక ప్రాంతం 25 కోట్ల మందికి పైగా పాకిస్థాన్ ప్రజలకు జీవనాధారం. దేశంలోని వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధన ఉత్పత్తి, ప్రజల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి సింధు జలాలపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి పాకిస్థాన్‌కు నీటి భద్రత అనేది ఆర్థిక, ఆహార, జాతీయ భద్రత నుంచి వేరు చేసి చూడలేం. అందువల్ల ఒప్పందం పునరుద్ధరణకు భారత్‌తో చర్చలు, సహకారం అవసరం. ఒకవేళ అది జరగకపోతే ప్రాంతీయ శాంతి, భద్రతపై తీవ్ర ప్రభావం ఉంటుంది."
-పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్
పాకిస్థాన్‌లో నీటి కొరత
మరోవైపు, పాకిస్థాన్‌లో నీటి కొరత తీవ్రంగా పెరుగుతోందని, గత కొన్ని దశాబ్దాల్లో తలసరి నీటి లభ్యత గణనీయంగా తగ్గిందని ఇషాక్ దార్ తెలిపారు. మారుతున్న వర్షపాత సరళి, హిమనదాలు క్షీణత, వరదలు, దీర్ఘకాలిక కరువులు, నీటి ప్రవాహాల్లో హెచ్చుతగ్గులు వంటివి ఇప్పటికే తమ దేశంపై ఒత్తిడిని పెంచుతున్నాయని చెప్పారు. ఇలాంటి సందర్భంలో దేశాల మధ్య నీటి సహకారం మరింత బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సింధు జలాల ఒప్పందంపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఈ ఒప్పందాన్ని పరిరక్షించాలని అభ్యర్థించారు. ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన నీటిని దక్కకుండా చేసే ఏ ప్రయత్నమైనా, ప్రాంతీయ శాంతి భద్రతపై తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అందువల్ల, సింధూ నది ప్రాంత ప్రజలకు జీవనాధారంగా ఉండాలని, ఘర్షణలకు కారణంగా మారకూడదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి జలాలకు ఆయుధంగా ఎప్పుడూ ఉపయోగించకూడదని పేర్కొన్నారు.
అయితే, అంతర్జాతీయ ఒత్తిళ్లు, పాకిస్థాన్ నుంచి వస్తున్న హెచ్చరికలకు లొంగిపోయే ప్రసక్తే లేదని, ఉగ్రవాదంపై తుదిముట్టించడం తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే, సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నప్పటికీ, భారత్ తన స్పష్టమైన వైఖరిని కొనసాగిస్తోంది.
పహల్గాం ఉగ్రదాడితో ఉద్రిక్త పరిస్థితులు
కాగా, 2025 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ క్రమంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు ఒప్పంద కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు భారత్ పేర్కొంది. 'రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు' అనే తన చిరకాల సూత్రాన్ని పునరుద్ఘాటించింది. ఓ వైపు, సరిహద్దు ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటే మరోవైపు, సాధారణ దౌత్య, ఆర్థిక, జల సహకారాన్ని కొనసాగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. సీమాంతర ఉగ్రదాడులను ఆపితేనే ఈ అంశంపై ఆలోచిస్తామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలితే, ఒక సార్వభౌమ దేశంగా దానిని రద్దు చేసే హక్కు భారత్‌కు ఉందని తెలిపింది. అయితే, సింధూ జలాలను విడుదల చేయాలని, ఒప్పందాన్ని పునరుద్ధరించాలని పదేపదే పాక్ డిమాండ్లు చేస్తు వస్తుంది.
నేపాల్ వరదలు- 1924 మంది గల్లంతు- 579కి పెరిగిన మృతుల సంఖ్య!
'వెనెజువెలాతో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఒప్పందం'- ట్రంప్ సంచలన ప్రకటన

