ETV Bharat / international

భారత్​తో యుద్ధం తర్వాత హాట్ కేకుల్లా మా జెట్ల అమ్మకాలు- IMF లోన్ మాకు అవసరం లేదు: పాక్ మంత్రి ప్రగల్భాలు

మరోసారి ప్రగల్భాలు పలికి నవ్వులపాలైన పాకిస్థాన్- ఇండియాతో యుద్ధం తర్వాత తమ జెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని వ్యాఖ్యలు- 6నెలల తర్వాత తమకు ఐఎంఎఫ్ లోన్ అవసరం ఉండకపోవచ్చని ప్రగల్భాలు

Khawaja Asif on Pakistan Jet Sales
Khawaja Asif on Pakistan Jet Sales (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 11:41 AM IST

4 Min Read
Choose ETV Bharat

Khawaja Asif on Pakistan Jet Sales : పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ మరోసారి ప్రగల్భాలు పలికింది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల సాయం లేనిదే రోజు గడవని దాయాది దేశం గొప్పలను ప్రదర్శిస్తోంది. భారత్​తో యుద్ధంలో చిత్తుచిత్తుగా ఓడి తోక ముడిచిన పాక్, ఇంకా అసత్య ప్రచారాలను మానుకోవట్లేదు. భారత్​పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. భారత్‌తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, అవి హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయనని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. అయితే ప్రగల్భాలు పలకడం, నవ్వులపాలవడం పాక్​కు కొత్తేం కాదు. అయినా సరే తీరు మార్చుకోని పాక్ నేతలు మళ్లీ మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేసి భంగపడుతున్నారు.

'పాక్ జెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి'
భారత్‌తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించారు. తమ జెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయని ప్రగల్భాలు పలికారు. ఇకపై తమ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు ఐఎంఎఫ్ రుణం కూడా అవసరం ఉండకపోవచ్చని అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యారు. "2025 మే నెలలో భారత్​తో నాలుగు రోజుల పాటు యుద్ధం తర్వాత పాక్ సైనిక పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. అవి ఏ స్థాయిలో అంటే ఆర్నెల్ల తర్వాత పాక్​కు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి రుణాల అవసరం ఉండకపోవచ్చు. పాక్ మిలిటరీ సామర్థ్యాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి." అని ఆసిఫ్ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి దూరంగా పాక్ వ్యాఖ్యలు
అయితే ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు పాకిస్థాన్​లో ఉన్న వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2026-27 బడ్జెట్ కోసం కీలక స్థూల ఆర్థిక, ద్రవ్య నియమాల్లో సడలింపుల కోసం ఐఎంఎఫ్​ను ఒప్పించడానికి వివిధ మార్గాలను పరిశీలిస్తోంది. ఐఎంఎఫ్ కఠినమైన రుణ షరతుల్లో కొంత ఉపశమనం కల్పించాలని పాకిస్థాన్ అభ్యర్థించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల తర్వాత ఐఎంఎఫ్ నుంచి తమకు అప్పే అవసరం లేదని ఖవాజా ఆసిఫ్ గొప్పలకు పోవడం గమనార్హం.

భారత్​తో యుద్ధం గురించి అసత్యాలే
అలాగే భారత్​తో జరిగిన యుద్దంలో తమదే పైచేయి అన్నట్లు ఖవాజా చేసిన వ్యాఖ్యల్లోనూ నిజం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్​కు చెందిన అనేక విమానాలను కూల్చివేశామని పాక్ ఇప్పటికే పదేపదే వాదిస్తోంది. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. బ్రహ్మోస్ దాడులలో భోలారి, నూర్ ఖాన్ వంటి ఎయిర్ బేస్ లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అలాగే పాకిస్థాన్ 4-9 యుద్ధ విమానాలను కోల్పోయిందని అంచనా. ఆ దేశంలోని 11 వైమానిక స్థావరాలు 20 శాతానికి పైగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ పాకిస్థాన్​- భారత్ యుద్ధంలో తమదే పైచేయి అన్నట్లు ఖవాజా వ్యాఖ్యానించడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

సొంత దేశస్థులకే నమ్మకం లేదు!
ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశస్థులే నమ్మట్లేదు. రక్షణ రంగం గురించి కవరేజ్ చేస్తామని చెప్పుకునే చాలా మంది జర్నలిస్టుల లాగే ఖవాజా కూడా మాట్లాడుతున్నారని పాకిస్థానీ రాజకీయ శాస్త్రవేత్త, రచయిత్రి అయేషా సిద్ధిఖా తెలిపారు. విమానం వెనుక భాగానికి, ముందు భాగానికి లేదా జలాంతర్గామికి ఉన్న తేడాను కూడా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జేఎఫ్-17 థండర్ ఎయిర్‌ ఫ్రేమ్‌లో పాకిస్థాన్‌కు సుమారు 35శాతం వాటా ఉందని, ఆ డబ్బు పాక్​ను ఐఎంఎఫ్ నుంచి రక్షించడానికి సరిపోదన్నారు. జేఎఫ్-17, జే-10 వంటి పాకిస్థానీ యుద్ధ విమానాలకు అజర్‌ బైజాన్, లిబియా వంటి కొన్ని దేశాలు కొనుగోలు చేసేందుకు మందుకొచ్చాయన్నది వాస్తవమేనని అన్నారు.

జేఎఫ్-17 విమాన బాడీలో సుమారు 35 శాతం మాత్రమే పాకిస్థాన్​లో తయారువుతుంది. ఈ విమానాల ప్రధాన రూపకర్త, తయారీదారు చైనా. అందుకే ఈ యుద్ధ విమానాల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని చైనా, పాకిస్థాన్ పంచుకుంటాయి. జేఎఫ్-17 యుద్ధ విమానం తయారీలో పాకిస్థాన్​తో పాటు రష్యా, చైనా, ఇటలీ, తుర్కీయే, యూకే వంటి దేశాల నుంచి వచ్చిన భాగాలను ఉపయోగిస్తారు. పాకిస్థాన్ జేఎఫ్-17 థండర్ జెట్లు రష్యాలో తయారైన క్లిమోవ్ ఆర్డీ-93 టర్బోఫ్యాన్ ఇంజిన్‌తో నడుస్తాయి. అయితే, జేఎఫ్-17 ఒక్కొ విమానాన్ని 15 మిలియన్ డాలర్లు, జే-10 విమానాన్ని 40 మిలియన్ డాలర్లకు అమ్మినా అందులో ఎంత మొత్తం పాకిస్థాన్​కు దక్కుతుంది? ఐఎంఎఫ్ వద్ద పాక్ తీసుకున్న సుమారు 300 బిలియన్ డాలర్ల రుణం తీర్చడానికి అది సరిపోతుందా? అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది.

ఆర్థిక ఊబిలో పాక్
పాకిస్థాన్ ఆర్థికంగా చతికిలపడిపోయింది. ద్రవ్యోల్బణంలో కూరుకుపోయింది. అందుకే అక్కడి పాల ధర లీటరు పాక్ కరెన్సీలో 280, లీటర్ పెట్రోల్ రేట్ 250కి పైమాటే. అంతలా నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం దొరికిన దగ్గరల్లా అప్పు చేస్తూ నెట్టుకొస్తోంది. ఇటీవలే తమ దేశ పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ (పీఐఏ)ను పీకేఆర్ 13,500 ( భారత కరెన్సీలో రూ. 4,300 కోట్లు)కు విక్రయించింది. అంతలా పాక్ ఆర్థికంగా చితికిపోయింది. కానీ ప్రగల్భాలు, భారత్​పై అక్కసు వెళ్లగక్కడంలో వెనక్కి తగ్గట్లేదు.