4రోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌తో బంగ్లాదేశ్‌తో 'రక్షణ' డీల్?- 'జేఎఫ్-17' యుద్ధ విమానాల విక్రయం
ఇస్లామాబాద్ వేదికగా బంగ్లాదేశ్ వాయుసేన సారథి హసన్ మహమూద్ ఖాన్, పాక్ వాయుసేన సారథి మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిధు భేటీ

Published : January 8, 2026 at 11:19 AM IST
Pakistan Bangladesh Defence Pact : భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ధాటికి నాలుగు రోజుల్లోనే చేతులెత్తేసిన పాక్, ఇప్పుడు బంగ్లాదేశ్‌ను రక్షిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతోంది. పాకిస్థాన్ తనను తానే రక్షించుకోలేని స్థితిలో ఉందని తెలిసినా, దానితో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి బంగ్లాదేశ్ రెడీ అవుతోంది. కేవలం భారత్‌పై ఉన్న అక్కసుతో పాక్, బంగ్లాదేశ్ సైన్యాలు చేతులు కలుపుతున్నాయి. దొందూదొందే అన్నట్టుగా వ్యవహరిస్తూ తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నాయి. మంగళవారం (జనవరి 6న) పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా బంగ్లాదేశ్ వాయుసేన సారథి హసన్ మహమూద్ ఖాన్, పాక్ వాయుసేన సారథి మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిధు సమావేశమయ్యారు. పాక్ నుంచి 'జేఎఫ్-17 ఠండర్' యుద్ధ విమానాలను కొంటామనే ఆసక్తిని బంగ్లాదేశ్ వాయుసేన చీఫ్ వ్యక్తం చేశారు. వాటిని అందించేందుకు తాము సిద్ధమేనని పాక్ వాయుసేన చీఫ్ చెప్పారు. అయితే ఆ డీల్ విలువ ఎంత? ఎన్ని 'జేఎఫ్-17 ఠండర్' యుద్ధ విమానాలను బంగ్లాదేశ్‌కు పాక్ అందించబోతోంది? అనే సమాచారం తెలియరాలేదు.
తొలుత శరవేగంగా సూపర్ ముష్షాక్ ట్రైనర్ యుద్ధ విమానాల్ని బంగ్లాదేశ్‌కు అందిస్తామని పాక్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విమానాలను నడపడం, సాంకేతికంగా నిర్వహించడంపై దీర్ఘకాలం పాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పాక్ తెలిపినట్లు సమాచారం. జేఎఫ్-17 యుద్ధ విమానాల విషయానికొస్తే, వీటిని పాక్, చైనా సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. వీటి తయారీ యూనిట్లు ఇరుదేశాల్లోనూ ఉన్నాయి. ఇది తేలికపాటి యుద్ధ విమానం. గగనతలంతో శత్రుదేశపు యుద్ధ విమానాలను ఎదుర్కోవడానికి, వైమానిక దాడుల కోసం ఈ విమానం ఉపయోగపడుతుంది.
వారం క్రితం యూనస్ కీలక భేటీ
గతేడాది డిసెంబరు 28న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ వేదికగా ఒక కీలక సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌తో బంగ్లాదేశ్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ ఇమ్రాన్ హైదర్ భేటీ అయ్యారు. 2026 జనవరి నుంచి ఢాకా - కరాచీ డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించాలని పాకిస్థాన్ హైకమిషనర్ ఇమ్రాన్ హైదర్ కోరారని మహ్మద్ యూనస్ కార్యాలయం మీడియాకు వెల్లడించింది. వాణిజ్యం, పెట్టుబడులు, విమానయానం, విద్య, వైద్యం, సాంస్కృతిక విభాగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇమ్రాన్ హైదర్, యూనస్ చర్చించారని పేర్కొంది. కట్ చేస్తే, వారం తర్వాత (జనవరి 6న) బంగ్లాదేశ్ వాయుసేన చీఫ్ హసన్ మహమూద్ ఖాన్ పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లి రక్షణ ఒప్పందంపై చర్చలు మొదలుపెట్టడం గమనార్హం.
గతేడాది అక్టోబరులో యూనస్‌కు ఆ కాల్
గతేడాది అక్టోబరులో పాకిస్థాన్ ఆర్మీ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ శంషాద్ మీర్జా కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్‌కు ఫోన్ కాల్ చేశారు. వారు కూడా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం పెంపుపై చర్చించారని అప్పట్లో యూనస్ కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
పదేళ్ల తర్వాత బంగ్లాదేశ్ - పాకిస్థాన్ విమాన సర్వీసులు
దాదాపు పదేళ్ల తర్వాత జనవరి 29 నుంచి బంగ్లాదేశ్ - పాకిస్థాన్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఢాకా - కరాచీ నగరాల మధ్య బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను నడపనుంది. తొలివిడతలో గురువారం, శనివారం మాత్రమే విమాన సర్వీసులు నడుస్తాయి. చివరిసారిగా 2012లో ఈ దేశాల మధ్య విమాన సర్వీసులు నడిచాయి. 2012లో పాకిస్థాన్‌లో పెద్దసంఖ్యలో ఉగ్రదాడులు జరిగాయి. దీంతో ఆనాడు బంగ్లాదేశ్‌లోని ఓ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పాక్ పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్‌ను పంపొద్దని నిర్దేశించింది. ఈనేపథ్యంలో భద్రతా కారణాలతో విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తూ ఆనాటి బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

