ETV Bharat / international

భారత్​పై సుంకాలు పెంచుతా- నేను హ్యాపీగా లేనని మోదీకి తెలుసు: ట్రంప్​

భారత్‌, రష్యా చమురు ఒప్పందాలపై ట్రంప్ ఫైర్​- కొనుగోళ్లు కొనసాగిస్తే సుంకాలు పెంచుతానని వార్నింగ్

Trump
Trump (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 5, 2026 at 8:27 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump On Tariffs : రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే భారత్‌పై సుంకాలు (టారిఫ్‌లు) పెంచేందుకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ పలు వ్యాఖ్యలు చేశారు.

రష్యా చమురు అంశంలో తన అసంతృప్తిని భారత్‌కు ఇప్పటికే తెలియజేశానని తెలిపారు. "ప్రధాని మోదీ మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మనం టారిఫ్‌లను చాలా వేగంగా పెంచుతాం" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను శ్వేతసౌధం అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేయడం గమనార్హం. భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

వెనెజువెలా ఘటనతో మళ్లీ చమురు రాజకీయాలు
ఇటీవల అమెరికా వెనెజువెలాలో చేపట్టిన సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంగా వెనెజువెలా గుర్తింపు పొందింది. ఓపెక్‌ అంచనాల ప్రకారం, వెనెజువెలా వద్ద సుమారు 300 బిలియన్‌ బ్యారెళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 17 శాతం.

అయితే అమెరికా ఆంక్షలు, పెట్టుబడుల కొరత కారణంగా అక్కడ చమురు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 లక్షల బ్యారెళ్లకే ఉత్పత్తి పరిమితమైంది. ఈ నేపథ్యంలో రష్యా, వెనెజువెలా వంటి దేశాల చమురు ఎగుమతులు, వాటిపై ఆంక్షలు అమెరికా విదేశాంగ విధానంలో కీలకంగా మారాయి.

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ వాదన
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ సమర్థించుకుంటూ వస్తోంది. దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు లభిస్తున్న చమురును కొనుగోలు చేయడం తప్పనిసరి అని న్యూఢిల్లీ స్పష్టం చేస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో, భారత్‌ రాయితీ ధరలకు చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే దీనిపై వాషింగ్టన్‌లో అసంతృప్తి పెరుగుతోంది. భారత్‌ రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.

వాణిజ్య చర్చల మధ్య బెదిరింపులు
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో వేగం కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. అదే సమయంలో భారత్‌- అమెరికా అధికారుల మధ్య తాజా వాణిజ్య చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ చర్చల ఉద్దేశం, సుంకాలకు సంబంధించిన దీర్ఘకాల వివాదాలకు పరిష్కారం కనుగొనడమే.

అయితే ఈ చర్చలకు ముందు రోజులలోనే ట్రంప్‌ భారత్‌ నుంచి బియ్యం దిగుమతులపై కొత్త టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం గమనార్హం. భారతదేశం, చైనా, థాయ్‌లాండ్‌ దేశాలు తక్కువ ధరలకు బియ్యం ఎగుమతి చేస్తూ అమెరికా రైతులను నష్టపరుస్తున్నాయంటూ వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఓ రైతు ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నివాసంపై గతవారం ఉక్రెయిన్‌ దాడి చేసినట్లు మాస్కో చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఖండించారు. పుతిన్‌ నివాసాన్ని ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా అధికారులు నిర్ధరించారని ట్రంప్‌ చెప్పారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ బయలుదేరేముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌, పుతిన్‌ నివాసంపై దాడి ఘటనను తాను నమ్మడం లేదన్నారు. తన నివాసంపై దాడి జరిగిందని పుతిన్‌ చెప్పారని, తమ అధికారుల ఇచ్చిన సమాచారం తర్వాత దానిని తాను నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. గతవారం నోవ్‌గొరొడ్‌ ప్రాంతంలోని పుతిన్‌ నివాసంపై 91 దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా పేర్కొన్న మాస్కో, ఉక్రెయిన్‌పై సరైన సమయంలో దాడిచేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని వెల్లడించింది.

'ట్రంప్‌నకు అన్ని ఆప్షన్లు ఓపెన్‌'- వెనిజువెలా విషయంలో రుబియో యూటర్న్

'ట్రంప్ లాగా పాకిస్థాన్‌కు వెళ్లి వాళ్లను ఈడ్చుకురండి'- మోదీకి ఒవైసీ సవాల్